బాలీవుడ్‌కే ఫిక్స్ అయిపోయిన తాప్సీ!

taapsee
తెలుగు, తమిళ, హిందీ ఇలా మూడు ప్రధాన సినీ పరిశ్రమల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ, గత కొంతకాలంగా కేవలం నటిగా తానేంటో నిరూపించుకునే పాత్రలనే ఎంపిక చేసుకుంటూ వెళుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె పూర్తిగా బాలీవుడ్ సినిమాలనే చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది బాలీవుడ్‌లో ‘పింక్‌’తో వచ్చి పెద్ద హిట్ కొట్టిన ఆమె, తాజాగా ‘నామ్ శభానా’ అంటూ మరో సినిమాతో సిద్ధమవుతున్నారు. కొద్దిసేపటి క్రితం విడుదలైన ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

డీ గ్లామరైజ్డ్ లుక్‌లో, ఓ ముస్లిమ్ యువతిగా తాప్సీ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌ను ఇదే పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో చూడొచ్చు. తాప్సీ నటించిన బేబీ అనే సినిమాకు ప్రీక్వెల్‌గా నామ్ శభానా తెరకెక్కుతోంది. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేస్తున్నారట. శివమ్ నాయర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే నిర్మిస్తున్నారు. నామ్ శభానాతో పాటు రానా హీరోగా తెరకెక్కుతోన్న ద్విభాషా చిత్రం ఘాజీలోనూ తాప్సీ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.