తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా “శ్రీమద్ భాగవతం పార్ట్-1” షూటింగ్ ప్రారంభం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా “శ్రీమద్ భాగవతం పార్ట్-1” షూటింగ్ ప్రారంభం

Published on Jul 15, 2025 9:30 AM IST

Bhagavatam Part 1

సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఆకాష్ సాగర్ చోప్రా నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న‌ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం “శ్రీమద్ భాగవతం పార్ట్-1”. సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబించే ఒక గొప్ప ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. “శ్రీమద్ భాగవతం” వంటి గాఢమైన ఆధ్యాత్మిక కథాంశం ఆధారంగా రూపొందుతున్న‌ ఈ సినిమా ప్రేక్షకులకు స‌రికొత్త అనుభవాన్ని అందించనుంది.

హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక రామోజీ ఫిల్మ్ సిటీలో “శ్రీమద్ భాగవతం పార్ట్-1″ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జూలై 14, 2025న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్ర‌ముఖ నిర్మాత మోతీ సాగ‌ర్‌ తదితర ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే రామోజీ ఫిల్మ్ సిటీ ఒక యూనిక్ ఫిల్మ్ సిటీ.. అలాంటి రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణలో ఉండటం మనకు గర్వకారణం. శ్రీమద్ భాగవతం సినిమా తీయాలన్న ఆలోచన వచ్చినందుకు సినిమా టీమ్ ను అభినందిస్తున్నా. తరం మారుతున్న ఈ సమయంలో ‘శ్రీమద్ భాగవతం’ లాంటి సినిమాలు చాలా అవసరం. నలభై ఏళ్ల క్రితం రామాయణం సీరియల్ రామాయణాన్ని అందరికీ చేరువ చేసింది. కోవిడ్ టైమ్ లో మళ్లీ రామాయణం సీరియల్ ను టెలికాస్ట్ చేస్తే రికార్డు సృష్టించింది.

2035లోగా తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమిగా తీర్చి దిద్దాలని మేం సంకల్పించాం. 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమిగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందుకోసం 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకుంటున్నాం. 2047 విజన్ డాక్యుమెంట్ లో సినిమా రంగానికి ఒక ప్రత్యేక చాప్టర్ ఉంటుంది. ఆనాడు రామానంద్ సాగర్ తీసిన రామాయణం సీరియల్ ఎంత పాపులర్ అయిందో.. శ్రీమద్ భాగవతం పార్ట్-1 సినిమా అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నా మూవీ టీమ్ కు నా అభినందనలు. రాబోయే రోజుల్లో హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్‌లో షూటింగ్ చేసే స్థాయికి ఎదగాలని మా ఆకాంక్ష,” అని ఆయన పేర్కొన్నారు.

శ్రీమద్ భాగవతం మొదటి భాగం 2026లో బహుళ భాషలలో గ్రాండ్ థియేటర్లలో విడుదల కానుంది. భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వం, విలువలు మరియు దైవిక కథలను కొత్త తరానికి – భాషలలో, ఖండాలలో మరియు కాలానుగుణంగా తిరిగి పరిచయం చేయడానికి ఈ ప్రాజెక్ట్ ఒక ఉద్యమంగా లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు