హైదరాబాద్: 2025–2027వ సంవత్సరాలకు తెలుగు టెలివిజన్ డిజిటల్ అండ్ ఓటీటీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నూతన కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసారి అధ్యక్షుడిగా ఏ.ప్రసాదరావు (సోనోపిక్స్ ప్రసాద్) ఎన్నికవ్వగా, ఉపాధ్యక్షులుగా పి.ప్రభాకర్, యన్.అశోక్‌లు బాధ్యతలు చేపట్టారు. జనరల్ సెక్రటరీగా యం.వినోద్‌బాల, జాయింట్ సెక్రటరీలుగా నటుడు–నిర్మాత కె.వి. శ్రీరామ్, గుత్తా వెంకటేశ్వరరావు, ఖజాంచీగా డి.వి. చౌదరి ఎంపికయ్యారు. అదేవిధంగా హానరబుల్ అడ్వయిజర్‌గా కె. రమేష్‌బాబు నియమితులయ్యారు.
సభ్యులంతా మాట్లాడుతూ “మా యూనియన్ గత 14 ఏళ్లుగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా, పూర్తిగా వాలంటీరింగ్ ఆధారంగా సభ్యుల కోసం పనిచేస్తూ వస్తోంది. అందుకే ఇది అందరూ ‘శభాష్’ అనిపించే ప్రత్యేక యూనియన్‌గా నిలిచింది” అని ప్రెసిడెంట్ ప్రసాద్ రావు అన్నారు. “ఎటువంటి ఎన్నికల హడావిడి లేకుండా, రాగద్వేషాలు లేకుండా, ఏకగ్రీవంగా కార్యవర్గం ఎన్నుకోవడం మా యూనియన్ ప్రత్యేకత” అని జనరల్ సెక్రటరీ వినోద్‌బాల తెలిపారు.
ప్రస్తుతం ఈ కౌన్సిల్లో 200 మందికిపైగా నిర్మాతలు సభ్యులుగా పని చేస్తున్నారు. వందలమందికి ఉపాధి కల్పించడంలో, సౌతిండియాలోనే అగ్రగామి సంస్థగా నిలవడంలో మా యూనియన్ ముందంజలో ఉందని సభ్యులు తెలిపారు. “సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, మేమందరం కలసి మాట్లాడి, సమన్వయం చేసుకొని నిర్ణయాలు తీసుకుంటాం. అందుకే మాలో విభేదాలు పెద్దగా ఉండవు” అని నటుడు–నిర్మాత శ్రీరామ్ తెలిపారు.
ఈ యూనియన్ 2011లో దర్శక దిక్సూచి దాసరి నారాయణరావు సమక్షంలో స్థాపించబడిన సంగతి తెలిసిందే. ఆయన చూపించిన దిశలో ముందుకు సాగుతూ, ఆయన జ్ఞాపకార్థం మరిన్ని మంచి కార్యక్రమాలను చేపడతామని సభ్యులు హామీ ఇచ్చారు.


