సుమంత్ శైలేంద్ర హీరోగా, యాంకర్ ప్రభాకర్ దర్శకత్వంలో ‘బ్రాండ్ బాబు’ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో దూసుకెళ్తున్న దర్శకుడు మారుతీ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ఇక ఈ చిత్రంతో సుమంత్ శైలేంద్ర సరసన ఈషా రెబ్బా కథానాయకిగా నటిస్తోంది. ప్రముఖ నటుడు మురళీశర్మ ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. కాగా డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
ఈ చిత్ర ఆడియోను కూడా త్వరలోనే రిలీజ్ చేయటానికి దర్శకనిర్మాతలు సన్నద్ధం అవుతున్నారు. ఐతే ఆగస్ట్ మొదటివారంలో ఈ బ్రాండ్ బాబు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. జే.బీ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ పళని కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యస్ శైలేంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఐతే ఈ చిత్రం మారుతి చిత్రాల శైలిలోనే సాగుతుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం తెరకెక్కిందని సమాచారం.


