
‘కొచ్చాడయాన్’ (విక్రమ సింహ), ‘లింగా’ లాంటి రెండు వరుస ఫ్లాపుల తర్వాత తన కొత్త సినిమాల విషయంలో రజనీకాంత్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘లింగా’ విడుదలై దాదాపుగా ఐదు నెలలైన తర్వాత ఓ సినిమాను అనౌన్స్ చేయడం ద్వారా ఈ విషయం మరోసారి స్పష్టమైంది. అదేవిధంగా కొత్తతరం దర్శకులైతే తనను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారన్న ఆలోచనలో ఉన్న రజనీ ‘అట్టకత్తి’, ‘మద్రాస్’ సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర సమాచారాలు రోజుకొకటి బయటకొస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో రజనీ తన వయసుకు సరిపోయే తరహా పాత్రను చేయనున్నట్లు తెలుస్తోంది. ఓ వయసైన గ్యాంగ్‌స్టర్‌గా రజనీ ఈ సినిమాలో కనిపించనున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర అనేదే లేదని ఓ ఆసక్తికర కథనం తాజాగా హల్‌చల్ చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మితం కానున్న ఈ సినిమాలో లేడీ క్యారెక్టర్స్ ఉన్నా రజనీ సరసన హీరోయిన్ తరహాలో ఎవరూ ఉండరనేది తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

