సమీక్ష : తిమ్మరాజుపల్లి టీవీ – కొన్నిచోట్ల ఆకట్టుకునే పీరియాడిక్‌ డ్రామా !

సమీక్ష : తిమ్మరాజుపల్లి టీవీ – కొన్నిచోట్ల ఆకట్టుకునే పీరియాడిక్‌ డ్రామా !

Published on Apr 18, 2026 2:04 AM IST

Thimmarajupalli TV Review

విడుదల తేదీ : ఏప్రిల్ 17, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : సాయి తేజ్, వేద జలంధర్‌, ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ తదితరులు.
దర్శకుడు : వి.మునిరాజు
నిర్మాతలు : కిరణ్ అబ్బవరం, తేజ వేల్పుచర్ల.
సంగీతం :వంశీకాంత్‌ రేఖన
ఛాయాగ్రహణం : అక్షయ్‌ రామ్‌ పొదిశెట్టి
ఎడిటింగ్ : వి.మునిరాజు

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

సాయి తేజ్, వేద జలంధర్‌ హీరో హీరోయిన్స్‌గా నటించిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. క ప్రొడక్షన్స్, సుమైనా స్టూడియోస్‌ బ్యాన‌ర్స్‌పై కిరణ్ అబ్బవరం తేజ వేల్పుచర్ల నిర్మించిన ఈ సినిమాకు మునిరాజు దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

తిమ్మరాజుపల్లి అనే గ్రామంలో 1996 కాలంలో ఈ కథ సాగుతుంది. సతీష్ (సాయి తేజ్) 7వ తరగతి వరకు చదువుకుని ఊర్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన శారద (వేద జలంధర్‌)ను ప్రేమిస్తూ ఉంటాడు. శారద కూడా సతీష్ ను ప్రేమిస్తూ ఉంటుంది. ఐతే, శివరాత్రి రోజు సతీష్ ఓ టీవీ రెంట్ కి తెస్తాడు. దానిలో సినిమా చూడటానికి ఊరు జనమంతా వస్తారు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అదే ఊరులో ఉండే రాజప్ప ఓ టీవీ కొని తెస్తాడు. ఆ టీవీ చూడటానికి జనం అంతా రాజప్ప ఇంటి మీదకు ఎగబడతారు. ఆ తర్వాత ఏం జరిగింది ?, అసలు రాజప్ప ఇంటిలో టీవీ ఎలా మిస్ అయింది ?, ఆ దొంగతనానికి సతీష్ కి ఉన్న కనెక్షన్ ఏమిటి ?, చివరకు ఆ టీవీ దొరికిందా? లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా కథ 1990 బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఆ నేపథ్యమే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్. అలాగే తిమ్మరాజుపల్లి అనే గ్రామాన్ని, ఆ గ్రామంలో ప్రజలను చాలా సహజంగా చూపించారు. అలాగే ఈ కథ ముగింపులో వచ్చే ట్విస్ట్ కూడా సినిమాకి ప్లస్ అయింది. ఈ సినిమాలో హీరోగా నటించిన సాయి తేజ్ చాలా బాగా నటించాడు. హీరోయిన్ గా నటించిన వేద జలంధర్‌ నటన బాగుంది. హీరోహీరోయిన్ల మధ్య నడిచే ప్రేమ కథ బాగానే సాగింది.

ఇక మరో ముఖ్య పాత్రలో నటించిన ప్రదీప్ కొట్టే నటన సినిమాకి ప్రధాన ఆకర్షణ. తన పాత్రకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ ప్రదీప్ నటించిన విధానం చాలా బాగుంది. ఇక స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల్లో మెప్పించారు. ముఖ్యంగా 1990 లో ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, టీవీ చూడటానికి ఎంత ఆసక్తి చూపించేవాళ్ళో తమ నటనతో అందరూ చాలా బాగా నటించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ తిమ్మరాజుపల్లి టీవీ సినిమా కచ్చితంగా ఓ వర్గం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. కానీ, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా సాగిన ఈ సినిమా మిగిలిన ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది డౌటే. చాలా లాజికల్ పాయింట్స్ ని పర్ఫెక్ట్ గా రివీల్ చేసిన డైరెక్టర్ వి.మునిరాజు కొన్నిటిని మాత్రం ఇన్ డైరెక్ట్ గా చాలా సింపుల్ గా చూపించి వదిలేశాడు. అలాగే కీలకమైన సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాల్లో ప్రధానంగా సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ ను ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది.

దీనికితోడు ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా రెగ్యులర్ గా రొటీన్ గా సాగింది. సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది ?, సతీష్ పాత్రకు  మిగిలిన పాత్రలకు మధ్య ఏం జరిగింది ?, ఏం జరగబోతుంది? అనే ఉత్కంఠను ప్రేక్షకుల్లో బాగానే కలిగించినా.. టీవీని ఎవరు దొంగిలించారు అనే పాయింట్ చుట్టూ కథను సాగదీయడంతో సినిమాలో కొన్ని చోట్ల ఇంట్రెస్ట్ మిస్ అయ్యింది. క్లైమాక్స్ కి ముందు వచ్చే సీక్వెన్స్ లను కూడా ఇంకా బెటర్ గా చూపించి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

మంచి కథా నేపధ్యాన్ని తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వి.మునిరాజు, కొన్ని చోట్ల ఉత్కంఠభరితమైన సీన్స్ ను రాసుకోవడంలో మాత్రం తడబడ్డాడు. కానీ, ఆయన రూపొందించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించింనందుకు నిర్మాతలను అభినందించాలి. నిర్మాతలు కిరణ్ అబ్బవరం, తేజ వేల్పుచర్ల నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు :

‘తిమ్మరాజుపల్లి టీవీ’ అంటూ వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ వర్గం ప్రేక్షకులకు తమ గత అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా కథ, అప్పటి టీవీ నేపథ్య సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్.. ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, కొన్ని సీన్స్ రెగ్యులర్ గా అండ్ స్లోగా సాగడం, మరియు రొటీన్ స్క్రీన్ ప్లే, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా పీరియాడికల్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమాలో కొన్ని అంశాలు కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

తాజా వార్తలు