‘తొలిప్రేమ’ ముందుగా విడుదలయ్యేది అమెరికాలోనే !

వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ చిత్రం పోటీ కారణంగా ఈ నెల 9న కాకుండా 10వ తేదీన విడుదలవుతున్న సంగతి తెలిసిందే. 9వ తేదీన మరొక మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘ఇంటిలిజెంట్’ విడుదలవుతున్న కారణంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ వాయిదా చోటు చేసుకుంది. కానీ అమెరికాలో మాత్రం సినిమా ముందు ప్రకటించిన 9వ తేదీన రిలీజవుతుందట.

అంతేగాక 8వ తేదీన ప్రత్యేకమైన ప్రీమియర్లను కూడా వేయనున్నారు. దీన్నిబట్టి ఇండియాలో కంటే ముందే అమెరికాలో సినిమా రిలీజవుతుందన్నమాట. ‘ఫిదా’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుణ్ తేజ్ చేస్తున్న సినిమా కావడంతో ‘తొలిప్రేమ’ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. నూతన దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకత్వం అందించారు.