సమీక్ష : థగ్స్ అఫ్ హిందుస్థాన్ – విజువల్స్ బాగున్నా.. సినిమా ఆకట్టుకోదు

Published on Nov 9, 2018 4:02 am IST

విడుదల తేదీ : నవంబర్ 08, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఆమిర్ ఖాన్‌, క‌త్రినా కైఫ్‌, ఫాతిమా స‌నా షేక్ తదితరులు

దర్శకత్వం : విజ‌య్ కృష్ణ ఆచార్య‌

నిర్మాత : ఆదిత్య చోప్రా

సంగీతం : అజ‌య్‌, అతుల్‌

స్క్రీన్ ప్లే : విజ‌య్ కృష్ణ ఆచార్య‌

విజ‌య్ కృష్ణ ఆచార్య‌ దర్శకత్వంలో అమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’. అమితాబ్ బచ్చన్ , కత్రినా కైఫ్ , సనా ఫాతిమా షేక్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

బ్రిటీష్ వాళ్లు తమ వ్యాపార కార్యక్రమాల కోసం భారతదేశం వ‌చ్చి.. మ‌న రాజ్యాల‌ను, సంస్థానాల‌ను ఆక్ర‌మించుకుంటుంటారు. ఈ క్రమంలో బ్రిటీష్ పాల‌కుడు జాన్ క్లైవ్ కన్ను రోన‌క్‌ పూర్ అనే స్వతంత్ర్య రాజ్యం పై ప‌డుతుంది. దాంతో జాన్ క్లైవ్ రోన‌క్‌ పూర్ రాజును, అత‌ని కుమారుడుని బంధించి చంపేస్తాడు.

అయితే రాజ్య ర‌క్ష‌కుడు ఖుదా బ‌క్ష్ (అమితాబ్ బ‌చ్చ‌న్‌) రోన‌క్‌ పూర్ రాజు కుమార్తె అయిన యువ‌రాణి జ‌ఫీరా( ఫాతిమా స‌నా షేక్‌)ను బ్రిటీష్ పాల‌కుల నుండి రక్షిస్తాడు. ఆ తరువాత జరిగే కొన్ని సంఘటనలు అనంతరం ఖుదా బ‌క్ష్ ఆజాద్ పేరుతో ఓ సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు. దీంతో బ్రిటీష్ పాల‌కులు ఖుదా బ‌క్ష్‌ను ఓ దోపిడి దొంగ‌గా ప్ర‌క‌టిస్తారు. ఖుదా బ‌క్ష్‌ను ప‌ట్టుకోవ‌డానికి జిత్తుల మారి ఫిరంగి(ఆమిక‌ర్ ఖాన్‌)ని నియ‌మిస్తారు బ్రిటీష్ వాళ్ళు. మరి ఈ జిత్తుల మారి ఫిరంగి నిజంగానే ఖుదా బ‌క్ష్‌ ను పట్టుకున్నాడా ? లేక ఖుదా బ‌క్ష్‌ కు సహాయ పడ్డాడా ? అనేదే మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రం అద్భుతమైన నిర్మాణ విలువలతో మరియు భారీ తారాగణంతో తెరకెక్కించబడటమే ఈ సినిమా ప్రధాన బలం. అమితాబ్ బ‌చ్చ‌న్‌ తన పరిపక్వతమైన నటనతో మరియు అనుభవంతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు.

ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యుద్ధ సన్నివేశాల్లోనూ తీవ్రమైన భావోద్వేగాలతో పాటు అద్భుత పోరాటాల్లోనూ ఆయన తన మార్క్ నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. ఇక అమీర్ ఖాన్ ఈ చిత్రంలో ఒక గమ్మత్తైన పాత్రను పోషించాడు. తన నటనా సామర్ధ్యంతో, తన లుక్ అండ్ తన కామెడీ టైమింగ్ తో సినిమాని ఓ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేశారు.

కీలక పాత్ర అయిన యువరాణి పాత్రలో నటించిన ఫాతిమా సనా షేక్ చాలా చక్కగా నటించింది. ఆమెకు అమితాబ్ కు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. మొత్తానికి దంగల్ తర్వాత ఫాతిమా సనాకు గుర్తు పెట్టుకునే పాత్ర ఈ చిత్రంలో దొరికింది.

ఈ చిత్రం మొదటి సగ భాగం సరదాగా ఆసక్తికరంగా సాగుతూ ఆకట్టుకుంటుంది. అలాగే అమీర్ మరియు అమితాబ్ కాంబినేషన్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు చాలా బాగున్నాయి. ముఖ్యమైన ఇతర కీలక పాత్రలను పోషించిన బ్రిటీష్ నటులు కూడా తమ ఉత్తమైన నటనతో ఉత్తమంగా నటించారు. క‌త్రినా కైఫ్‌ తన అందంతో మరియు అభినయంతో సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ,

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు విజ‌య్ కృష్ణ ఆచార్య‌ టేకింగ్ మీద పెట్టినంత శ్రద్ధ కథ, కథనం మీద పెట్టలేదనిపిస్తుంది. సినిమా మొత్తం చాలా సీరియస్ గా బోర్ గా సాగుతూ ఉండటం వల్ల ప్రేక్షకులు కొంత అసహనానికి గురి అవుతారు. అయితే అక్కడక్కడ కామెడీ ఉన్నా అది పెద్దగా వర్కౌట్ కాలేదు.

ముఖ్యంగా అనేక సన్నివేశాలను అనవసరంగా లాగడం వల్ల ఆ సాగతీత సన్నివేశాలను చూడలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. టైట్ స్క్రీన్ ప్లే మరియు ఎంగేజింగ్ ఎలిమెంట్స్ లేని ఈ చిత్రం ప్రేక్షకుడ్ని కూర్చీలో కదలకుండా కూర్చోపెట్టదు.

సినిమాలోని ఒక్కో సన్నివేశం వీడిగా చూస్తే, ఆ పోరాట సన్నివేశాలు మరియు ఆ రిచ్ విజువల్స్ చాలా బాగున్నాయి అనిపిస్తోంది, కానీ.. సినిమా మొత్తంగా చూసుకుంటే ప్లో లేని కథనం, ఇంట్రస్ట్ కలిగించలేని క్యారెక్టరైజేషన్స్ తో సినిమా ఆకట్టుకోదు.

కత్రినా కైఫ్ కూడా కేవలం రెండు పాటలకు వచ్చి వెళ్ళటం తప్ప, ఆమె పాత్రకు సరైన క్యారెక్టరైజేషన్ కూడా లేదు. మొత్తంగా దర్శకుడు ఆసక్తికరమైన కథాకథనాలను రాసుకోవడంలో విఫలమయ్యాడు.

 

సాంకేతిక విభాగం :

దర్శకుడు విజ‌య్ కృష్ణ ఆచార్య‌ భారీ విజువల్స్ తో భారీ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆయన ఆసక్తికరమైన కథాకథనాలను రాసుకోవడంలో విఫలమయ్యాడు. కొన్ని సన్నివేశాలను అద్భుత విజువల్స్ తో బాగా తెరకెక్కించినప్పటికీ.. పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన తెరకెక్కించలేకపోయారు.

అజ‌య్‌, అతుల్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆయన అందించిన పాటలు మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకున్నే విధంగా లేవు. మానుశ్ నంద‌న్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన భారీ విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు.

రితేశ్ సోని ఎడిటింగ్ బాగుంది. కానీ అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 

తీర్పు:

విజ‌య్ కృష్ణ ఆచార్య‌ దర్శకత్వంలో అమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’. అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, సనా ఫాతిమా షేక్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేదు. దానికి తోడు అనువాద చిత్రం కావడం, అందులోనూ తెలుగు నేటివిటీకి కాస్తంత దూరంగా ఉండటం వంటి అంశాల కారణంగా తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడ్డానికి అంతగా ఆసక్తి చూపించకపోవొచ్చు. పైగా ఇటు ఉత్కంఠభరితంగా అటు ఎంటర్ టైనింగ్ గా లేని ఈ చిత్రాన్ని మరి మన ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

 

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :

More