ఇంటర్వ్యూ : జయం రవి – ఇండియన్ సినిమా చరిత్రలో ఇదొక గొప్ప సినిమా అవుతుంది !

తమిళ హీరో జయం రవి చేసిన స్పేస్ ఫిల్మ్ ‘టిక్ టిక్ టిక్’ తెలుగులో కూడా అదే పేరుతో రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) మీ సినిమా గురించి చెప్పండి ?
జ) ఇండియాలో ఇదే మొట్ట మొదటి స్పేస్ ఫిల్మ్. తప్పకుండా ఇండియన్ సినిమా చరిత్రలో ఇదొక మర్చిపోలేని చిత్రంగా నిలిచిపోతుంది.

ప్ర) ఈ సినిమా ఎలా సెట్టైంది ?
జ) డైరెక్టర్ శక్తి సౌందర్ రాజన్ నా దగ్గరకొచ్చి ఏదైనా డిఫరెంట్ గా చేద్దాం, నా దగ్గరొక కొత్త ఐడియా ఉంది అన్నారు. నేను అదొక స్పేస్ ఫిల్మ్ అని ఆటను చెప్పేదాకా ఊహించలేకపోయాను. అందరూ ఇంపాజిబుల్ అనుకున్నారు. కానీ మా డైరెక్టర్ చేసి చూపించారు.

ప్ర) అసలీ సినిమా కథేంటి ?
జ) మొత్తం చెప్పను.. కొంచెం చెబుతాను (నవ్వుతూ). ఇండియాకి ఒక ప్రమాదం ఏర్పడుతుంది. దాన్ని తప్పించడానికి ఒక డిఫెన్స్ స్పేస్ డివిజన్ ప్రయత్నిస్తుంది. ఆ ప్రమాదం ఏంటి, దాన్నుండి దేశాన్ని ఎలా కాపాడారు అనేదే సినిమా కథ. దాన్ని స్క్రీన్ పైన చూడాల్సిందే.

ప్ర) ఇందులో మీ క్యారెక్టర్ ఏంటి ?
జ) ఇందాక చెప్పాను కదా డిఫెన్స్ స్పేస్ డివిజన్ అని అందులో ముఖ్యమైన వ్యక్తిని నేనే. ఎగ్జాట్ గా చెప్పాలంటే నా క్యారెక్టర్ ఎస్కెప్ ఆర్టిస్ట్ లా ఉంటుంది. ఎస్కెప్ ఆర్టిస్ట్ అంటే ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి నుండైనా బయటపడగలిగేవాడు.

ప్ర) స్పేస్ ఫిల్మ్ అంటే హాలీవుడ్ సినిమాలతో పోలిక ఉంటుంది.. దాన్ని ఎలా అందుకుంటారు ?
జ) అవును తప్పకుండా పోలిక ఉంటుంది. ఆలా ఉండాలి కూడ. అప్పుడే మనలోని గొప్పదనం బయటికొస్తుంది. ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు అస్సలు తీసిపోదు.

ప్ర) కొందరేమో ట్రైలర్ చూస్తే కొన్ని ఇంగ్లీష్ సినిమాలోని సీన్స్ చూసినట్టే ఉంది అంటున్నారు ?
జ) ఎందుకంటే వాటి కాన్సెప్ట్, ఈ సినిమా కాన్సెప్ట్ ఒకటే కాబట్టి. కొన్ని సన్నివేశాలు తప్పకుండా ఒకేలా ఉంటాయి. వాటిని మార్చలేం. కానీ కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ సన్నివేశాల కన్నా గొప్పగా ఉంటాయని చెప్పగలను.

ప్ర) ఈ సినిమా కోసం ఎలా కష్టపడ్డారు ?
జ) ఎక్కువ కష్టం దర్శకుడిదే. ఆయన విజన్ ను బట్టే సినిమా ఉంటుంది. ఇక గ్రాఫిక్స్ విషయానికొస్తే అజాక్స్ మీడియా ఈ సినిమాకి వర్క్ చేశారు. సుమారు 200 మంది 5 నెలల పాటు పనిచేశారు. షూటింగ్లో కూడా స్పేస్ షాట్స్ చేయడానికి బాగా కష్టపడాల్సి వచ్చింది.

ప్ర) ఇందులో మీ కొడుకు కూడా ఉన్నాడట కదా ?
జ) అవును. సినిమాలో నా కొడుకు క్యారెక్టర్ చేశాడు. నటిస్తావా అని అడగ్గానే ఒప్పేసుకున్నాడు. నా కొడుకుతో కలిసి నటించడం ఒక మర్చిపోలేని, మాటల్లో చెప్పలేని అనుభవం.

ప్ర) సినిమాలో స్పేస్ ఎపిసోడ్స్ ఎంతసేపుంటాయి ?
జ) ఇంటర్వెల్ కు 20 నిముషాల ముందే స్పేస్ ఎపిసోడ్స్ మొదలవుతాయి. 80 శాతం సినిమా స్పేస్ లోనే ఉంటుంది.

ప్ర) తెలుగులో ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి ?
జ) చాలా బాగా చేస్తున్నారు. నిజానికి వాళ్లకు థ్యాంక్స్ చెప్పడానికే ఈ మీట్ పెట్టాను. అంతా బాగానే జరుగుతోంది.