‘ఏఐ’తో చేస్తున్న అసభ్య కంటెంట్ సినిమా ఇండస్ట్రీ పై బాగానే ప్రభావం చూపిస్తుంది. తాజాగా దేవర సినిమాలో పాటని మార్పింగ్ చేసి వదిలారు. అలా చేసిన ఎవరిని వదలను అంటూ మార్ఫింగ్ బ్యాచ్ కు ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చే వరకు వచ్చింది పరిస్థితి. అసలు హీరోహీరోయిన్ల వీడియోలను, ఫోటోలను మార్పింగ్ చేయడం వల్ల ఫ్యాన్స్ తో పాటు ఆయా హీరోహీరోయిన్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు మార్ఫింగ్, డీప్‌ఫేక్ కంటెంట్‌ను రూపొందించి లేదా షేర్ చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
చర్యలు తీసుకోవడం అంటే.. అంతా అయిపోయాక కాదు, ఎప్పటికప్పుడు ఫిర్యాదుల కోసం ప్రత్యేకమైన సైబర్ హెల్ప్‌లైన్, వేగవంతమైన కంటెంట్ టేక్ డౌన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. అప్పుడే ఆకతాయిల ఆగడాలు ఆగుతాయి. అలాగే, నటీనటులు తమ ఫొటోలను, వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ప్రైవసీ సెట్టింగ్స్, వాటర్ మార్క్స్, డిజిటల్ ప్రొటెక్షన్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
అటు అభిమానులు కూడా అనుమానాస్పద కంటెంట్‌ను ఫార్వర్డ్ చేయకుండా రిపోర్ట్ చేస్తేనే మార్ఫింగ్, డీప్‌ఫేక్‌ల కంటెంట్ తగ్గుతుంది. అయినా, ఏఐ దానికి తెలిసిన సమాచారంతో నిర్ణయం తీసుకుంటుంది, మనిషి అతనికి తెలియని సమాచారంతో నిర్ణయం తీసుకుంటాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కంటెంట్ ను ఓ లుక్ వేస్తే అందరికి మంచిది.


