ఎప్పుడూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉండే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తాజాగా మరో వివాదాస్పద నేపథ్యంలో ‘కిల్లింగ్ వీరప్పన్’ అనే సినిమాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే! వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత అతడు ఎంత డేంజరస్ వ్యక్తి అనే విషయం అర్థమైందని, అలాంటి క్రిమినల్‌ను చంపిన ఓ పోలీసాఫీసర్ కథే ఈ ‘కిల్లింగ్ వీరప్పన్’ అని వర్మ తెలిపారు.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ హీరోగా నటించనున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెలాఖర్లో మొదలు కానుంది. రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా కోసం తమిళ నాడు, కర్ణాటకల్లోని వీరప్పన్ స్థావరాలు ఏర్పరచుకున్న ప్రదేశాల్లో షూటింగ్ జరిపే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే లొకేషన్ల వేటను ప్రారంభించారు. కర్ణాటక, తమిళనాడు, మారెడుమిల్లి ఫారెస్ట్ ఏరియాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. జూలైకల్లా సినిమా షూటింగ్ పూర్తవుతుందని వర్మ తెలిపారు. ఇక ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ఇంటెన్స్ ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై విడుదలకు ముందే అంచనాలు పెంచింది.


