మెగా యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అభిమానులకు ఇది కాస్త ఆందోళన కలిగించే వార్తే. తన అప్‌కమింగ్ మూవీ ‘బరి’ కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా వరుణ్ కాలికి తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు ఈ రోజు ఆయనకు మైనర్ సర్జరీ జరగనుంది.
ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదం..
గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ‘భారీ’ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ప్రొఫెషనల్ వాలీబాల్ ప్లేయర్‌గా సహజంగా కనిపించేందుకు వరుణ్ తేజ్ గత కొద్దిరోజులుగా ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఇలాగే ప్రాక్టీస్ చేస్తుండగా కాలికి బలమైన గాయం కావడంతో డాక్టర్లు సర్జరీ అవసరమని స్పష్టం చేశారు. ఆపరేషన్ తర్వాత ఆయన కొద్దివారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. కాలు పూర్తిగా నయమయ్యాకే మళ్లీ షూటింగ్‌లో అడుగుపెడతారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
సోదరి నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైంది. క్యారెక్టర్ కోసం వరుణ్ తేజ్ పడుతున్న కష్టం, ఇప్పుడు గాయపడిన తీరు చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆయన డెడికేషన్‌ను మెచ్చుకుంటున్నాయి. సర్జరీ విజయవంతమై తమ హీరో త్వరగా కోలుకోవాలని, మళ్లీ పవర్‌ఫుల్‌గా సెట్స్‌లోకి రావాలని సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


