చిన్న సినిమాలకు వెంకీ మాట సాయం…!

Published on Aug 4, 2019 12:01 am IST

చిత్ర పరిశ్రమ బాగుండాలంటే చిన్న సినిమాలు బ్రతకాలని అంటుంటారు. కానీ మంచి కాన్సెప్ట్,కంటెంట్ తో తెరకెక్కిన అనేక చిన్న చిత్రాలు సరైన ప్రచారం,ప్రోత్సహం లేక ప్రేక్షకుడి వరకు చేరకుండానే థియేటర్ల నుండి వెళ్లిపోతున్నాయి. ఐతే ఇలాంటి చిన్న సినిమాలకు స్టార్ హీరో చేసే మాటసాయం చాలా ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. ఒక స్టార్ హీరో చిన్న చిత్రంపై చేసే చిన్న కామెంట్ లేక, ఒక ట్వీట్ ఆ చిత్రానికి మంచి ప్రచారం తెచ్చిపెడుతుంది.

కాగా విక్టరీ వెంకటేష్ ఇటీవల కొన్ని చిన్న చిత్రాలకు తనదైన సాయం చేస్తున్నారు. ఆ సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలకు హాజరుకావడం ద్వారానో,ట్రైలర్,టీజర్ విడుదల చేయడం ద్వారానో కొంచెం ప్రచారం కల్పిస్తున్నారు. ఆది నటించిన “బుర్ర కథ” ట్రైలర్ లాంచ్ చేసిన వెంకీ, “మిస్ మ్యాచ్” అనే సినిమా టీజర్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇటీవల కొత్త హీరో రూపేష్ కుమార్ చేస్తున్న” 22″ చిత్ర షూటింగ్ ప్రారంభ కార్యక్రమానికి హాజరుకావడం జరిగింది. తాజాగా నేడు “ఆర్ ఎక్స్ 100” ఫేమ్ పాయల్ రాజ్ ఫుట్,తేజు కంచెర్ల జోడిగా తెరకెక్కుతున్న “ఆర్డీఎక్స్ లవ్” ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.

ఇలా గత కొంత కాలంగా విక్టరీ వెంకటేష్ చిన్న చిత్రాల వేడుకలకు హాజరవుతూ వాటికి ప్రచారం కల్పించడంలో దోహదం చేస్తున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య తో ఆయన చేస్తున్న “వెంకీ మామ” చిత్రం అక్టోబర్ లో విడుదల కానుందని సమాచారం.

సంబంధిత సమాచారం :