మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చి నేడు స్టార్స్‌గా వెలుగొందుతున్న వారి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే హీరోలు చాలామందే ఉన్నా మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్లుగా మాత్రం ఇప్పటివరకూ ఎవ్వరూ ఎంట్రీ ఇచ్చిన దాఖలాలు లేవు. కాగా తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. టీవీ 9 సంస్థతో కలిసి ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈమధ్యే సెట్స్‌పైకి వెళ్ళి సైలెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది.
‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ వంటి అందమైన ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, వరుస హిట్స్‌తో జోరుమీదున్న నాగశౌర్య హీరోగా నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ జానర్లో రూపొందుతోన్న ఈ సినిమాలో తాజాగా ప్రకాష్ రాజ్ రూపంలో మరో పెద్ద స్టార్ నటుడు వచ్చి చేరారు. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఓ కీ రోల్‌లో నటించనున్నారు. ఈ సినిమా లాంచ్ చాలా సింపుల్‌గా జరిగినా, మెగా హీరోయిన్ పరిచయ వేడుకను మాత్రం పెద్ద ఎత్తున నిర్వహించేందుకు మెగా ఫ్యామిలీ ప్లాన్ చేస్తోంది.


