తమిళ నటుడు విజయ్ నటించిన ‘జన నాయగన్’(Jana Nayagan) సినిమా చుట్టూ నెలకొన్న సెన్సార్ వివాదం ఇప్పుడు సుప్రీం కోర్టు గడప తొక్కింది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ తీర్పును మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇటీవల రద్దు చేసింది. దీంతో సెన్సార్ బోర్డు నిర్ణయమే ప్రస్తుతానికి చెల్లుబాటు అవుతోంది.
అయితే, చిత్ర నిర్మాతలు మద్రాస్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని గ్రహించిన సెన్సార్ బోర్డు, ముందస్తుగా ‘కేవియట్ పిటిషన్’ దాఖలు చేసింది. నిర్మాతలు పిటిషన్ వేస్తే, తమ వాదన వినకుండా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని బోర్డు అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది.
నిజానికి ఈ సినిమా జనవరి 9నే విడుదల కావాల్సి ఉన్నా, న్యాయపరమైన చిక్కుల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. రాజకీయ ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో, సుప్రీం కోర్టులో ఈ వివాదం ఎటు తేలుతుందోనని అటు సినీ వర్గాలు, ఇటు విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


