తమిళ స్టార్ హీరో విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. రజినీకాంత్ తర్వాత ఆ స్థాయి ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరో విజయ్. సినిమాలతో తరచూ వసూళ్ల రికార్డులు సృష్టించే విజయ్ బయట పెద్దగా కనబడరు. సన్నిహితుల కార్యక్రమాలు, షూటింగ్ స్పాట్ వద్ద తప్ప ఆయన హడావిడి ఎక్కడా ఉండదు. ఆయన కనిపిస్తే అభిమానులే ఎగబడి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని నెలల క్రితం మాత్రం విజయే అభిమానులతో సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీ అసాధారణ రీతిలో వైరల్ అయింది. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించింది. ఫిబ్రవరి 10న విజయ్ ఆ ఫోటోను ట్వీట్ చేయగా లక్షా 47 వేల రీట్వీట్లు పొందింది.
తాజాగా ట్విట్టర్ థిస్ హప్పెన్డ్ 2020 పేరుతో కొన్ని రికార్డులను బయటపెట్టింది. అందులో అత్యధిక రీట్వీట్లు సాధించిన ట్వీట్ గా విజయ్ సెల్ఫీ ట్వీట్ నిలిచింది. అయితే ఈ ట్వీట్ వెనుక ఇంకొక విషయం కూడ ఉంది. ఈ ఏడాది ఆరంభంలో విజయ్ మీద ఆదాయపన్ను శాఖ సోదాలు జరిపింది. నేరుగా షూటింగ్ స్పాట్ నుండి విజయ్ ను విచారణకు పిలిచారు అధికారులు. అది అభిమానులకు విపరీతమైన కోపం తెప్పించింది. వీటి వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయ్ సైతం ఐటీ సోదాల మీద తీవ్ర అసహనం చెందారు. అది జరిగాక ఎక్కడి నుండైతే విజయ్ ను విచారణకు పిలిచారో అక్కడికే భారీ ఎత్తున అభిమానులు చేరుకుని ఆయనకు మద్దతు తెలిపారు. ఆ టైంలోనే విజయ్ ఇదే సమాధానం అన్నట్టు భారీగా వచ్చిన అభిమానులతో సెల్ఫీ దిగి ట్వీట్ చేశారు. అందుకే ఆ సెల్ఫీ అంత సంచలనంగా మారింది.


