కోలీవుడ్ సూపర్‌స్టార్లు రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత తెలుగులో తనకంటూ ఒక సొంత మార్కెట్‌ను, క్రేజ్‌ను ఏర్పరచుకున్న తమిళ హీరో విశాల్. ఈ యాక్షన్ హీరో చిత్రాలకు ఒకప్పుడు ఆంధ్రా, తెలంగాణల్లో కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చేవి. అయితే గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లు పడటంతో ఆయన తెలుగు మార్కెట్ తీవ్రంగా దెబ్బతింది. ఈ క్రమంలోనే విశాల్ మెగాఫోన్ పట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మకుటం’ తాజాగా థియేటర్లలోకి వచ్చింది.
అయితే ఈ సినిమా విశాల్ ఆశలపై నీళ్లు చల్లింది. తొలిరోజే తీవ్ర నెగిటివ్ టాక్‌ను మూటగట్టుకున్న ఈ మూవీ డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. తమిళంలోనూ ఓపెనింగ్స్ దారుణంగా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రేక్షకులు లేక షోలు కూడా రద్దయ్యే పరిస్థితి నెలకొంది. ప్రమోషన్లు లోపించడం, సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ పోటీగా ఉండటం ఈ సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది.
కథనం బలహీనంగా ఉండటం, విశాల్ దర్శకత్వ ప్రతిభపై తీవ్ర విమర్శలు రావడంతో థియేటర్లకు జనాలు కరువయ్యారు. ఒకప్పుడు తిరుగులేని మార్కెట్ ఉన్న విశాల్, ఇప్పుడు మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోవడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


