మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. గ్రామీణ నేపథ్యంతో కూడిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ యూట్యూబ్ రివ్యూవర్ తనకు సినిమా కథ తెలుసన్నట్లుగా వ్యాఖ్యానిస్తూ, సహచరులతో జరిగిన సమావేశంలో ఈ భారీ ప్రాజెక్ట్‌పై అనవసర విమర్శలు చేయడం వివాదానికి దారి తీసింది.
ఈ వ్యవహారంపై నటుడు విశ్వక్ సేన్ తీవ్రంగా స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ఆ యూట్యూబర్ ప్రవర్తనను తప్పుబడుతూ, ఇలాంటి వారిని సినిమా పరిశ్రమకు పారాసైట్‌లుగా అభివర్ణించారు. “సినిమా ఇండస్ట్రీ వల్లే జీవనం సాగిస్తూ, అదే పరిశ్రమను సినిమా విడుదలకంటే ముందే దెబ్బతీయాలని ప్రయత్నించడం, తాను తినే ప్లేట్లోనే ఉమ్మేసినట్టే” అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈ ప్రెస్టీజియస్ చిత్రంలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా శివ రాజ్‌కుమార్, జగపతి బాబు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2026 మార్చి 27న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.


