భారీ బడ్జెట్, సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) నేపథ్య సినిమాల్లో కెమెరామెన్ పాత్రపై సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గ్రాఫిక్స్ సినిమాలకు వీఎఫ్ఎక్స్ టీమ్ చెప్పిందే వేదమని, తమ అనుభవాన్ని, ఇగోను పక్కనపెట్టి వాళ్లు అడిగినట్లే అవుట్‌పుట్ ఇస్తామని వెల్లడించారు.
రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’కు ఇగో చూపించకుండా, సీజీ టీమ్‌తో సమన్వయం చేసుకుంటూ బెస్ట్ క్వాలిటీ కోసం కష్టపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
రోజురోజుకూ టెక్నాలజీ పెరుగుతుండటంతో పాన్ ఇండియా సినిమాల్లో వీఎఫ్ఎక్స్ (గ్రాఫిక్స్) పాత్ర కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో భారీ గ్రాఫిక్స్ ఉండే సినిమాల్లో అసలు కెమెరామెన్ రోల్ ఎంత వరకు ఉంటుంది? అనే ఆసక్తికరమైన ప్రశ్నకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తాజాగా ‘వదల’ మూవీ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ప్రెస్ మీట్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ వీఎఫ్ఎక్స్ సినిమాల మేకింగ్ గురించి పలు విషయాలు పంచుకున్నారు.
సినిమాల్లో సిజీ వర్క్ ఉన్నప్పుడు కెమెరామెన్ ఎవరైనా పర్వాలేదు కానీ వీఎఫ్ఎక్స్ టెక్నీషియన్లు చాలా ముఖ్యమని ఆయన కుండబద్దలు కొట్టారు. “వాళ్ళు ఎంత బాగా ప్లాన్ చేసుకుంటే అవుట్‌పుట్ అంత అద్భుతంగా వస్తుంది. అందుకే ఆ సక్సెస్, ఫెయిల్యూర్‌తో కెమెరామెన్‌కు పెద్దగా సంబంధం ఉండదు. సీజీ టీమ్ ఏం అడిగితే అది ఇవ్వడమే మా బాధ్యత” అని వివరించారు. ఒక్కోసారి సీజీ టీమ్ అడిగిన లైటింగ్ రాంగ్ అని తమకు ముందే తెలిసినా, బెస్ట్ ఔట్‌పుట్ కోసం వాళ్లు అడిగిందే ఇస్తామని చెప్పారు. ఇగోకి పోయి వాళ్ళకు కోఆపరేట్ చేయకపోతే రేపు ప్రాజెక్ట్ పాడవుతుందని, అందుకే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సీనియారిటీని పక్కనపెట్టి పనిచేస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు సిజీ కోసం మొదటి నుంచి చివరి దాకా ఒక స్పెషల్ టెక్నీషియన్ సెట్‌లో ఉంటున్నారని, వాళ్లకి తెలియకుండా ఒక్క ఫ్రేమ్ కూడా తీయట్లేదని టెక్నికల్ అంశాలను ఆయన వివరించారు.
‘విశ్వంభర’ గురించి ఏమన్నారంటే..
“నేను గతంలో చేసిన ‘అంజి’ సినిమాకు తలెత్తుకుని పనిచేశాను. కానీ ఇప్పుడు ‘విశ్వంభర’కు తలదించుకుని (అణకువగా) పనిచేస్తున్నాను” అని చోటా కె. నాయుడు కామెంట్ చేశారు. దానికి కారణం వివరిస్తూ.. “విశ్వంభర సినిమాలో పీక్ రేంజ్‌లో సీజీ వర్క్ ఉంటుంది. అక్కడకి వెళ్లి నేను చోటా కె. నాయుడుని, నాకు అంతా తెలుసు అని నా ఇగో చూపిస్తే వర్కవుట్ అవ్వదు. ఎందుకంటే ఆ సినిమా వెనుక దాదాపు రూ. 400 కోట్లు ఉన్నాయి. అందుకే అక్కడ నా ఇగో పక్కనపెట్టి, వాళ్లకు ఏం కావాలో అదే చేస్తూ బెస్ట్ అవుట్‌పుట్ కోసం టైమ్ తీసుకుంటున్నాం” అని స్పష్టం చేశారు. భారీ బడ్జెట్ సినిమాల్లో టెక్నీషియన్ల మధ్య సమన్వయం ఎలా ఉంటుందో ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
