ఇంటర్వ్యూ: మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి – పరిశ్రమలోని మంచి, చెడు రెండిటినీ చెప్పడం జరిగింది !

ఇంటర్వ్యూ: మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి – పరిశ్రమలోని మంచి, చెడు రెండిటినీ చెప్పడం జరిగింది !

Published on Jun 8, 2018 3:45 PM IST

దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం ‘సమ్మోహనం’. ఈ నెల 15వ తేదీన సినిమా విడుదలకానుంది. ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం.

‘సమ్మోహనం’ సినిమా ఎలా వచ్చింది ?
చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకి అన్నీ కుదిరాయి. నాకు పెద్దగా అసంతృప్తి లేని సినిమా ఏదైనా ఉంది అంటే అది ఇదే.

ఈ సినిమా కథేమిటి ?
సినిమాలంటే ఒక చిన్న చూపు ఉన్న అబ్బాయి జీవితంలోకి ఒక స్టార్ హీరోయిన్ ఎలా వచ్చింది, అనూహ్య పరిస్థితుల్లో వారి మధ్య ప్రేమ ఎలా పుట్టింది, మళ్ళీ వాళ్ళు ఎలా విడిపోయారు, తిరిగి ఏ విధంగా కలుసుకున్నారు అనేదే సినిమా. ఈ మధ్యలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్, ఫన్ ఉంటాయి.

అసలు ఈ కథ ఎలా పుట్టింది ?
‘గోల్కొండ హైస్కూల్’ తీసేటప్పుడు నాకు ఒక వ్యక్తి తారసపడ్డాడు. అతని క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. దాంతో ఒక కథ చేద్దామనుకుని మొదలుపెడితే అది ప్రేమ కథగా తయారైంది. అదే ఈ ‘సమ్మోహనం’.

మీకు కలిసిన వ్యక్తి పాత్రను ఈ సినిమాలో ఎవరు చేశారు ?
అది హీరో తండ్రి పాత్ర. నరేష్ గారు చేశారు. చాలా బాగుంటుంది. ఆ పాత్రకు సినిమాలంటే చాలా ఇష్టం. ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడుతూ ఉంటాడు. మొదట్లో ఆ పాత్రకు భరణి, రావు రమేష్ గార్లను అనుకున్నాను కానీ సెట్టవ్వదని నరేష్ గారిని తీసుకున్నా. చాలా బాగా చేశారు.

ఈ సినిమా ద్వారా సినీ పరిశ్రమను విమర్శించినట్టున్నారు ?
విమర్శించాను. కానీ అది సద్విమర్శ. అలాంటి విమర్శ ఎప్పుడూ మంచిదే. వాటి నుండి ఎంతో కొంత నేర్చుకోవచ్చు. పరిశ్రమలో చెడు ఉంది కానీ అందరూ చెడ్డవాళ్ళు కాదు. అన్ని చోట్ల ఉన్నట్టే ఇక్కడ కూడ మంచి చెడు రెండూ ఉంటాయి. ఆ రెండిటినీ సినిమాలో చెప్పడం జరిగింది. సినిమా రంగంపై జనాల్లో తప్పుడు భావన కలగడానికి సినిమా వాళ్ళు కూడ కొంత కారణమనేది నా ఫీలింగ్.

‘రంగస్థలం, మహానటి’ లాంటి సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దాని పట్ల మీ ఫీలింగ్ ?
చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులు ఎప్పుడూ ముందే ఉన్నారు. కానీ మన ఫిల్మ్ మేకర్స్ వాళ్లకన్నా పదేళ్లు వెనకున్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళను అందుకుంటున్నారు. త్వరలోనే వాళ్లను చేరుకుంటారు. మంచి సినిమాల్ని ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు.

మీ హీరో సుధీర్ బాబు ఎలా చేశారు ?
చాలా బాగా చేశాడు. ఈ సినిమాతో కొత్త సుధీర్ బాబుని చూస్తారు. ‘శమంతకమణి’ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ చూసి తీసుకున్నాను. షూటింగ్ సమయంలో ఆతని నటన చూసే వరకు నాక్కూడ అతనిలో ఇంత మంచి నటుడున్నాడని తెలీలేదు.

ఇందులో అదితిరావ్ హైదరినే తీసుకోవాలని ఎందుకనిపించింది ?
ఇందులో హీరోయిన్ తెలుగు మాట్లాడటం రాని సౌత్ హీరోయిన్. అలాంటి పాత్రలో స్టార్ ఇమేజ్ ఉండి తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయంలేని నటి అయితే బాగుంటుందని ఆమెను తీసుకున్నాం.

ఈ సినిమాకు ఆమె ఎంత వరకు ప్లస్ అవుతుంది ?
చాలా. ఆమెదే ముఖ్యమైన పాత్ర. స్క్రీన్ మీద చాలా అందంగా కనిపిస్తూ మంచి నటన కనబర్చింది. సుధీర్ తో ఆమె జోడీ చాలా బాగుంటుంది. సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు తెలుగులో చూడని సన్నివేశాలవి.

మీ తర్వాతి సినిమాల గురించి చెప్పండి ?
ఇప్పటి వరకు ఏం అనుకోలేదు. ఇంకా కథ కూడ రాసుకోలేదు. స్క్రిప్ట్స్ రెడీగా ఉండబట్టి గత మూడు సినిమాలు చాలా వేగంగా చేసేశాను. ఇప్పుడు కొత్త కథ రాసుకుని సినిమా తీయాలి. కొంచెం టైమ్ పడుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు