
‘ఏం మాయ చేసావే’ సినిమాతో అక్కినేని నాగ చైతన్యకి కెరీర్లో తొలి బిగ్ హిట్ ఇచ్చిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో చైతన్య మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘సాహసమే శ్వాసగా సాగిపో’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చెన్నైలో జరుగుతోంది. ఈ చిత్ర టీం తెలిపిన దాని ప్రకారం షూటింగ్ చివరి దశలో ఉంది. అక్టోబర్ చివరికల్లా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలిపారు.
మొదటి నుంచీ ఈ చిత్ర టీం కూడా అక్టోబర్ కల్లా సినిమాని ఫినిష్ చేసి నవంబర్లో రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలోనే ఉన్నారు. అనుకున్నట్టుగానే సినిమాని ఆన్ టైం ఫినిష్ చేసి రిలీజ్ చేస్తారని సమాచారం. గౌతమ్ మీనన్ చాలా డిఫరెంట్ గా ఈ సినిమాని తీస్తున్నాడు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాంటిక్ స్టొరీగా కనిపించే ఈ సినిమా సెకండాఫ్ లో ఒక్కసారిగా హాయ్ వోల్టేజ్ యాక్షన్ మూవీగా మారిపోతుంది.
నాగచైతన్య సరసన మలయాళ భామ మంజిమ మోహన్ హీరోయిన్ గా కనిపించనుంది. టాలీవుడ్ ఫేమస్ రైటర్ కోన వెంకట్ ఈ సినిమాని తెలుగులో నిర్మిస్తున్నాడు.
గౌతమ్ మీనన్ ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తమిళ్ లో శింబు హీరోగా నటిస్తున్నాడు. తమిళంలో ‘అచ్చం ఎన్బదు మదమైయద’ అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. ఎ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

