సమీక్ష : 365 డేస్ – జస్ట్ ఓకే అనిపించిన వర్మ పెళ్లి.!

365 Days

విడుదల తేదీ : 22 మే 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ

నిర్మాత : డి.వెంకటేష్

సంగీతం : నాగ్ శ్రీ వత్స – ఎల్.ఎం ప్రేమ్

నటీనటులు : నందు, అనైక సోఠి..

‘శివ’ సినిమాతో తెలుగు సినిమా చరిత్రలో ఓ ట్రెండ్ సెట్ చేసి విలక్షణతకి మారుపేరుగా నిలిచిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అలాంటి డైరెక్టర్ ప్రస్తుతం విలక్షణ అనే పదానికి దూరంగా, వివాదం అనే పదానికి దగ్గరగా చెప్పాలంటే వివాదానికి మారుపేరుగా మారాడు. గత కొంత కాలంగా ఆయన చేసే సినిమాలు బాక్స్ వద్ద విజయాన్ని అందుకోకపోయినా రకరకాల జానర్స్ లో సినిమాలు చేస్తూనే ఉన్నారు. అలా రామ్ గోపాల్ వర్మ తన కెరీర్లో మొట్ట మొదటిసారిగా చేసిన రొమాంటిక్ లవ్ స్టొరీ ‘365 డేస్’.. నందు – అనైక సోఠి జంటగా నటించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిసారి వర్మ చేసిన రొమాంటిక్ లవ్ స్టొరీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి, బాక్స్ ఆఫీసు వద్ద విజయాన్ని అందుకుందా.? లేక ఎప్పటిలానీ మరోసారి వర్మ నిరాశాపరిచాడా.? అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :

చదువు పూర్తి చేసుకొని ఓ పెద్ద కంపెనీలో పనిచేసే కుర్రాడు అపూర్వ్(నందు). తనకి నచ్చినట్టు లైఫ్ ని ఎంజాయ్ చేసే స్వభావం కలవాడు అపూర్వ్. ఒక రోజు తన ఫ్రెండ్ ప్రశాంత్(కృష్ణుడు) ఇచ్చిన ఫ్యామిలీ పార్టీలో అనైక సోఠిని చూసి ప్రేమలో పడతాడు. ప్రేమలో ఎంతో సిన్సియర్ గా ఉన్న నందుతో అనైక కూడా ప్రేమలో పడుతుంది. ఇలా రొమాంటిక్ గా సాగిపోతున్న వీరి ప్రేమకి పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. అంటే వీరి పరిచయం మొదలయిన 100వ రోజు పెళ్లి చేసుకుంటారు. అక్కడి నుంచి 46 రోజులు బాగానే ఉంటాయి.. 47వ రోజు అనగా 147 వ రోజు నుంచి పలు సమస్యలు మొదలవుతాయి.. పెళ్ళికి ముందు నువ్వు లేకపోతే నాకు లైఫ్ లేదనుకున్న ఇద్దరూ పెళ్ళయ్యాక పెళ్ళికి ముందే లైఫ్ బాగుందనుకోవడం.. నువ్వు లేకుండా బ్రతలేను అనుకున్నవాళ్ళు నీతో బ్రతలేను అని అనుకునే స్థాయికి వెళ్ళిపోతారు.. అంతలా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిద్దరి మధ్యా దూరం ఎందుకు పెరిగింది.? పెళ్ళయ్యాక వారి లైఫ్ లో నచ్చని విషయలు ఏం జరిగాయి.? ఎందుకోసం ఒకరితో ఒకరు బతకలేము అనుకున్నారు.? అలా అనుకున్న వారు విడిపోయారా.?లేదా.? పెళ్ళైన ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదేనా.? అనే విషయాలను మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

రామ్ గోపాల్ వర్మ చేసిన మొట్ట మొదటి రొమాంటిక్ లవ్ స్టొరీ ఇదని చెప్పుకోవడమే మొదటి పాయింట్. ఈ ట్యాగ్ లైన్ వల్ల ప్రేక్షకులను థియేటర్స్ కి రాబట్టుకోగలిగారు. ఇక సినిమాలో మేజర్ హైలైట్ అంటే అది ఒక్క పోసాని కృష్ణమురళి మాత్రమే.. పోసానికి ఇందులో నాలుగు సీన్స్, ఒక్క పాట ఉంది. పాటని పక్కన పెట్టేస్తే సినిమాలో ఉన్న బెస్ట్ సీన్స్ పోసాని చేసిన చేసిన నాలుగు సన్నివేశాలే అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆ సీన్స్ బాగా నవ్విస్తాయి మరియు ఆ పాయింట్స్ చాలా నిజం కూడా.. ఇక మిగతా నటీనటుల విషయానికి వస్తే.. నందు ఫస్ట్ హాఫ్ లో ప్రేమలో ఉన్న కుర్రాడిగా, సెకండాఫ్ లో ఒక ఇర్రిటేటెడ్ భర్తగా మంచి నటనని కనబరిచాడు. చూడానికి కూడా స్టైలిష్ గా ఉన్నాడు. అనైక సోఠి నటిగా ఓకే అనిపించుకుంది. కానీ పాటల్లో అందాల ఆరబోత మరియు సినిమా మొత్తం గ్లామర్ అట్రాక్షన్ గా నిలవడంలో మాత్రం 100కి 100 మార్కులు తెచ్చుకుంది.

ఇకపోతే సినిమా పరంగా ఆకట్టుకునే విషయానికి వస్తే.. సినిమా ఫస్ట్ హాఫ్ ఇప్పటి యువతకి బాగా నచ్చిన ప్రేమ అనే పాయింట్ తో కాస్త రొమాంటిక్ గా తీయడం వలన బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లెంగ్త్ తక్కువ కావడం కూడా హెల్ప్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో చూపించిన రొమాంటిక్ ట్రాక్ యువతకు బాగానే కనెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే రియల్ లైఫ్ లో వాళ్ళు చేస్తోంది, అట్రాక్ట్ అవుతోంది దానికే కాబట్టి.. సినిమాలో ముఖ్య పాత్రలు చేసిన కృష్ణుడు, సత్య కృష్ణ, సురేఖ వాణి, గీతాంజలి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు. సినిమా మొదట్లో ‘సాండ్(ఇసుక) ఆర్ట్’తో వర్మ కాన్సెప్ట్ ని వివరించే విధానం, అదే ఆర్ట్ తో టైటిల్స్ ని వేయడం బాగుంది.

మైనస్ పాయింట్స్ :

రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో చేస్తున్న సినిమాలలానే ఇందులో కూడా చెప్పుకోదగిన స్టొరీ లైన్ ఏమీ లేదు. ఒక అమ్మాయి – అబ్బాయి మధ్య ఉండే ప్రేమ పెళ్ళికి ముందే ఉంటుంది, పెళ్ళికి తర్వాత ఉండదు అని చెప్పాలనుకోవడమే ఈ సినిమా కథ. కథ సింపుల్ పాయింట్ అయినా కథనంలో రాసుకున్న సీన్స్ లో ఎమోషన్స్ ని, ప్రేమలో ఉన్న ఫీలింగ్ ని పర్ఫెక్ట్ గా చూపగలిగితే ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు. కానీ కథనంలో ఆ మేజిక్ కనిపించలేదు. కథనం మరియు నేరేషన్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్. ఇక కథలో గానీ, కథనంలో గానీ ఆడియన్స్ ని థ్రిల్ చేసే అంశం, వారు ఊహించలేని అంశం అంటూ ఏదీ లేదు. అందుకే ఆడియన్స్ కి బాగా బోర్ కొడుతుంది.

సినిమా పరంగా సెకండాఫ్ పెద్ద మైనస్.. ఫస్ట్ హాఫ్ అలా అలా సాగిపోయినా సెకండాఫ్ లో మాత్రం అస్సలు ముందుకు వెళ్ళదు.. సినిమాని మరీ సాగదీసేసారు. మరీ ఊహాజనితంగా సాగుతుంది. తను చెప్పాలనుకున్న పాయింట్ చాలా సింపుల్ కావడం వలన వర్మ డైరెక్టర్ గా కూడా ఏమీ మేజిక్ చేయలేకపోయాడు. ఎంతసేపు పెళ్ళైన వారి మధ్య గొడవలు తప్ప ఇంకేమీ ఉండవు అని చూపించే ప్రయత్నమే తప్ప వేరే ఏమీ చూపించకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. అలాగే ఆ గొడవలలో పెద్ద లాజిక్ ఏమీ ఉండదు. సినిమాలో హీరో – హీరోయిన్ మధ్య ఎక్కడా ఎమోషనల్ బాండింగ్ ని చూపలేదు. సినిమాలో పాటలు ఎక్కువగా ఉన్నాయి.. సినిమానే స్లోగా వెళ్తుందని ఆడియన్స్ డల్ గా ఉంటే అదే టైంలో వరుసగా పాటలు వస్తుంటాయి. ఆ పాటలు సినిమాకి స్పీడ్ బ్రేకర్స్ గా మారాయి. ఇక రెగ్యులర్ సినిమాలలో ఉండే ఎంటర్టైన్మెంట్ అస్సలే లేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో కొన్ని డిపార్ట్ మెంట్స్ వర్క్ బాగుంది. అనిత్ సినిమాటోగ్రఫీ చూడటానికి కలర్ఫుల్ గానే ఉంది. కానీ చాలా చోట్ల స్లో మోషన్ షాట్స్ పెట్టడం ప్రేక్షకులకు కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. అదే సీన్స్ ని రెగ్యులర్ గానే షూట్ చేసి ఉంటే బాగుండేది. నాగ్ శ్రీ వత్స – ఎల్.ఎమ్ ప్రేమ్ అందించిన పాటలు డీసెంట్ గా ఉన్నాయి, కానీ సినిమాలో ఎక్కువ పాటలు అయిపోవడం వలన ఆడియన్స్ బోర్ కొడుతుంది. శేషు కె.ఎం.ఆర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టుగా ఉంది. అన్సర్ అలీ ఎడిటింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలోలేదు. సెకండాఫ్ పరంగా ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. రఘు కులకర్ణి ఆర్ట్ వర్క్ బాగుంది. ఇక చెప్పుకోవాల్సింది ఈ సినిమాకి కెప్టెన్ అయిన రామ్ గోపాల్ వర్మ గురించి.. ఆయన కథ కోసం ఎంచుకున్న పాయింట్ చాలా చిన్నది, అలాంటి స్టొరీ లైన్ ని స్క్రీన్ ప్లే మరియు సీన్స్ తో ఆకట్టుకోవాలి. కానీ సీన్స్ చాలా రెగ్యులర్ గా ఉండడంతో ఓవరాల్ గా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఇకపోతే దర్శకుడిగా నటుల నుంచి కాస్త పెర్ఫార్మన్స్ రాబట్టుకోగలిగినా, ఆద్యంతం ఆడియన్స్ ని కూర్చో బెట్టగలిగే సినిమా ఇవ్వలేకపోయాడు.

తీర్పు :

మన సొసైటీలో మనం రోజూ చూస్తున్న యువత ప్రేమలు, ఆ ప్రేమల తాలుకా పెళ్ళిళ్ళు ఎలా ఉంటున్నాయి అనేది చెప్పడమే ఈ ‘365 డేస్’ సినిమా. స్టొరీ లైన్ చిన్నదే అయినా ఇప్పుడు సొసైటీలో ఎక్కువగా కనపడుతోంది ఇదే కావున స్టొరీ పాయింట్ అందరినీ ఆకర్షిస్తుంది. కానీ ఆ పాయింట్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చెయ్యడంలో, ఆడియన్స్ సీట్లలో కూర్చోబెట్టడంలో మాత్రం వర్మ మరోసారి ఫెయిల్ అయ్యాడు. యువతని ఆకర్షించే పాయింట్, పోసాని సీన్స్, నందు పెర్ఫార్మన్స్, అనైక సోటి గ్లామర్ ట్రీట్, పరవాలేదనిపించే ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకి సేవింగ్ పాయింట్స్అయితే బోరింగ్ సెకండాఫ్, చివరిదాకా కూర్చోలేకపోవడం, రెగ్యులర్ ఆడియన్ కోరుకునే కనీస ఎంటర్టైన్మెంట్ లేకపోవడం, కనెక్ట్ కావాల్సిన ఎమోషన్స్ ఇందులో లేకపోవడం, స్పీడ్ బ్రేకర్స్ గ మారిన సాంగ్స్ సినిమాకి హెల్ప్ కాని పాయింట్స్. ఓవరాల్ గా వర్మ 365 డేస్ తో ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పింలేకపోయాడు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :