సమీక్ష: “అష్మీ” – బోరింగ్‌గా సాగే రివేంజ్ డ్రామా

Asmee Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 03, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: రుషిక రాజ్, రాజ నరేంద్ర, కేశవ్ దీపక్, ఇందు కుసుమ, హేమంత్ వర్మ
దర్శకుడు: శేష్ కార్తికేయ
నిర్మాత‌లు: స్నేహ రాకేశ్, రాకేశ్
సంగీత దర్శకుడు: శాండీ అద్దంకి
సినిమాటోగ్రఫీ: శేష్ కార్తికేయ
ఎడిటర్: ప్రవీణ్ పూడి


తక్కువ బడ్జెట్ చిత్రాల ధోరణిను కొనసాగిస్తూ, ఈ రోజు థియేటర్లలో విడుదలైన ఫీమేల్ ఓరియంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ “అష్మీ” చిత్రాన్ని నేటి మా ఎంపికగా తీసుకున్నాం. మరీ ఈ చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ:

అష్మీ (రుషిక రాజ్) ఓ గదిలో నాలుగేళ్లుగా నిర్బంధించబడి ఉంటుంది. ఆమెకు కనీసం త్రాగడానికి నీరు, తినడానికి ఆహారం కూడా ఇవ్వకుండా చిత్రహింసలకు గురిచేయడంతో మానసికంగా, శారీరకంగా తీవ్ర క్షోభకు గురవుతుంది. అయితే ఆ నరకం నుంచి బయటపడ్డాక తనను చిత్రహింసలకు గురిచేసింది రాజేశ్ మిశ్రా (కేశవ్ దీపక్) అని నమ్మి అతడిని తన చేతులతో చంపేస్తుంది అష్మీ. ఆ తర్వాత తనను చిత్రహింసలకు గురిచేసింది శివ (రాజ నరేంద్ర) అని తెలుసుకుంటుంది. అయితే అసలు అష్మీకి, శివకు మధ్య ఉన్న సంబంధం ఏమిటీ? ఎందుకోసం శివ అష్మీనీ బంధించి చిత్రహింసలకు గురిచేశాడు? చివరకు అష్మీ శివపై ఏ విధమైన రివేంజ్ తీర్చుకుంది అనేది తెలియాలంటే ఈ సినిమాను స్క్రీన్‌పై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఓ అమ్మాయిని నాలుగేళ్లుగా గదిలో బందించగా, ఆమె ఎలాంటి నరకయాతన అనుభవించింది, ఆ తర్వాత ఆమె ఎలా రివేంజ్ తీర్చుకుంది అనే కోణంలో రాసుకున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కథలో అష్మీ పాత్రలో రుషిక రాజ్ చాలా చక్కగా నటించింది. ఆమె కొత్తే అయినప్పటికీ కూడా తన నటనలో చక్కటి హావాభాలను చూపించింది. ఇక రాజ నరేంద్ర, కేశవ్ దీపక్ కూడా తమదైన నటనతో ఆకట్టుకున్నారు.

ఇక దర్శకుడు శేష్ కార్తికేయ ఓ మంచి కాన్సెప్టును కథగా రాసుకుని దానిని బాగానే ఎగ్జ్‌క్యూట్ చేసే ప్రయత్నం చేశాడని చెప్పాలి. క్లైమాక్స్‌ని కూడా బాగానే చూపించాడు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాకి కనీసం చెప్పుకోదగ్గ తారగణం లేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పాలి. కేవలం ముగ్గురు క్యారెక్టర్లతోనే సినిమా మొత్తాన్ని ముగించారు. సస్పెన్స్ థ్రిల్లర్ కనుక దర్శకుడు తాను రాసుకున్న కథను ఇంకా బాగా ఎలివేట్ చేసి చూపించి మరిన్ని హంగులు దిద్ది ఉంటే అవుట్ పుట్ మరింత బాగుండేదేమో అనిపించింది. అంతేకాకుండా ఒకటి రెండు చోట్ల వాడిన బోల్డ్ సీన్స్‌ని కూడా తగ్గించి ఉంటే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా బాగా నచ్చేది.

ఇక కిడ్నాప్ సీన్ కూడా బాగా సాగదీశారన్న ఫీలింగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ బాగా ప్లాన్ చేసి మంచి ట్విస్ట్ ఇచ్చినా కూడా లాజిక్ కాస్త మిస్ అవ్వడంతో అది సిల్లీగా అనిపించింది. స్క్రీన్‌ప్లే కూడా నిరాశపరిచింది.

సాంకేతిక విభాగం:

ఓ మంచి కాన్సెప్ట్‌ను దర్శకుడు కథగా రాసుకున్నాడు కానీ దానిని సరైన సస్పెన్స్ థ్రిల్లర్‌గా మలచలేకపోయాడు. సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్‌కి చేరుకునే వరకు రెండే సీన్లను సాగదీసి చూపించడం బోరింగ్‌గా అనిపించింది. దీనిపై కాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ఇక ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన బలమని చెప్పాలి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే లేడీ ఓరియంటెడ్ రివేంజ్ సస్పెన్స్ థ్రిల్లర్ “అష్మీ” సినిమా క్లైమాక్స్ ఒక్కటే కాసింత పర్వాలేదనిపించింది. మిగతాదంతా సాగదీతలా అనిపించడంతో వీక్షకుడు ఒకింత బోరింగ్‌గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ సస్పెన్స్ థ్రిల్లర్‌లను కోరుకునే వారు పెద్దగా ఊహించుకోకుండా ఈ సినిమాను జస్ట్ చూడొచ్చు, ఇక మిగతా వారిని మాత్రం ఈ సినిమా ఏ మేరకు కూడా ఆకట్టుకోదనే చెప్పాలి.

123telugu.com Rating :  2/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం :