సమీక్ష : “అతిథి దేవోభవ” – కథాంశం ఆకట్టుకున్నా కథనం ఆకట్టుకోలేదు!

సమీక్ష : “అతిథి దేవోభవ” – కథాంశం ఆకట్టుకున్నా కథనం ఆకట్టుకోలేదు!

Published on Jan 8, 2022 3:05 AM IST
Atithi Devo Bhava Review In Telugu

విడుదల తేదీ : జనవరి 07, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: ఆది సాయి కుమార్‌, నువేక్ష‌, రోహిణి, స‌ప్త‌గిరి తదితరులు

దర్శకత్వం : పొలిమేర నాగేశ్వర్

నిర్మాత: రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల

సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫీ: అమరనాథ్ బొమ్మిరెడ్డి

ఎడిటర్ : కార్తీక్ శ్రీనివాస్


ఆది సాయి కుమార్ హీరోగా, నువేక్ష హీరోయిన్‌గా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతిధి దేవోభవ’. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రాజాబాబు, అశోక్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ:

 

అభయ్ (ఆది సాయి కుమార్)కు పుట్టుకతోనే మోనో ఫోబియా అనే సమస్య వస్తోంది. మోనో ఫోబియా అంటే ఒంటరితనం భరించలేరు. ఆ భయంలో చనిపోవడానికి కూడా సిద్ధపడతారు. అందుకే, అభి (అభయ్) ఒంటరిగా ఉండలేడు. ప్రతి క్షణం మరో మనిషి తోడు కోరుకునే అతను వైష్ణవి (నువేక్ష) ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అయితే, ఆ ప్రేమకు ఈ మోనో ఫోబియా పెద్ద సమస్య అవుతుంది.

దాంతో తన సమస్యను వైష్ణవికి చెప్పకుండా తనలో తానే బాధపడుతూ ఉంటాడు అభి. మరి చివరకు అభయ్ ఆమెకు అసలు నిజం చెప్పాడా? లేదా? అతని సమస్య విని వైష్ణవి ఎలా రియాక్ట్ అయ్యింది ? చివరకు ఈ జంట కథ ఎలా ముగిసింది ? అనేది మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమా మెయిన్ పాయింట్ బాగానే ఉంది. ఇక ఈ సినిమాలో కాస్త కొత్తగా ట్రై చేసిన ఆది సాయి కుమార్ కూడా తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ వేరియేషన్స్ లో ఫ్రెష్ గా కనిపించాడు. తన మాడ్యులేషన్ అండ్ తన మార్క్ యాక్టింగ్ తో సినిమాకు ప్లస్ అయ్యాడు. అలాగే ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తోనూ అటు అతి భయంతో వణికి పోయే సందర్భాల్లోనూ ఆది తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.

ఇక హీరోయిన్ గా నటించిన నువేక్ష‌ చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది. కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ నువేక్ష‌ నటన చాల బాగుంది. అలాగే తల్లిగా నటించిన రోహిణి నటన, మరో కీలక పాత్రలో నటించిన స‌ప్త‌గిరి నటన చాలా బాగుంది. మిగిలిన నటీనటులు కూడా తమకిచ్చిన పాత్రల్లో బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

కథలోని మెయిన్ థీమ్ పర్వాలేదు అనిపించినా దర్శకుడు కథనం మలచడంలో మాత్రం చాలా నెమ్మదిగా కనిపించాడు. పాత్రలు పరిచయానికి సమయం తీసుకున్నారనుకున్నా.. ఫస్ట్ హాఫ్ స్లోగా బోరింగ్ గా సాగుతుంది. అయినా మోనో ఫోబియా అనే పాయింట్ చుట్టే పూర్తి కథను నడిపాడు తప్ప, కథలో ఎక్కడ టర్నింగ్ పాయింట్లు కూడా లేకుండా.. చివరి వరకూ దర్శకుడు సింగిల్ ప్లాట్ తోనే ప్లేను సాగదీశాడు.

దీనికి తోడు ప్రతి పాత్ర ఒకే ఎమోషన్ తో ఎలాంటి బలమైన సంఘర్షణ లేకుండా చాలా నిస్సహాయతతోటి సాగుతాయి. దీనికితోడు కథలో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యే ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా లేవు. ఇక సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి తప్ప, ఆసక్తిగా అనిపించవు.

నిజానికి సినిమా పాయింట్ ను బట్టి సినిమాను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం ఆ దిశగా సినిమాని మలచకపోగా అనవసరమైన సన్నివేశాలతో సినిమాని బాగా ల్యాగ్ చేశాడు. ఓవరాల్ గా ఈ చిత్రం నెమ్మదిగా సాగుతూ బోర్ కొడుతోంది.

 

సాంకేతిక విభాగం :

 

పొలిమేర నాగేశ్వ‌ర్‌ దర్శకుడిగా ఈ సినిమాకు న్యాయం చేయలేకపోయాడు. అలాగే రచయితలు కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేదు. సినిమా స్క్రిప్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సంగీత దర్శకుడు శేఖ‌ర్ చంద్ర‌ అందించిన సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫర్ అమ‌ర్‌నాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయింది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి. నిర్మాతలు రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల ప్రొడక్షన్ డిజైన్ బాగుంది.

 

తీర్పు :

 

‘మోనో ఫోబియా’ అనే విభిన్న కథాంశంతో వచ్చిన ఈ ‘అతిధి దేవోభవ’ చిత్రం ఆకట్టుకోలేదు. సినిమాలో సాంగ్స్, నటీనటుల నటన బాగున్నా.. స్లో నేరేషన్, బోరింగ్ ట్రీట్మెంట్, లాజిక్ లెస్ ప్లే, మరియు బలమైన కాన్ ఫ్లిక్ట్ మిస్ అవ్వడం, ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం.. వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. దాంతో ఈ సినిమా ఆకట్టుకోదు. కానీ సాంగ్స్, కొన్ని సీన్స్ మాత్రం ఓకే అనిపిస్తాయి.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు