Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : అ ! – ఆశ్చర్యపోవడం ఖాయం

AWE movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 16, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : కాజల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, రెజినా కసాండ్రా, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళీ శర్మ, దేవ దర్శిని

దర్శకత్వం : ప్రశాంత్ వర్మ

నిర్మాత : ప్రశాంతి త్రిపురనేని

సంగీతం : మార్క్.కె. రాబిన్

సినిమాటోగ్రఫర్ : కార్తీక్ ఘట్టమనేని

ఎడిటర్ : గౌతమ్ నెరుసు

నాని నిర్మాతగా తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మించిన తొలి చిత్రం ‘అ!’. ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మొదటి నుండి ఇది కమర్షియల్ సినిమా కాదు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రమని నాని చెబుతున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ:

రకరకాల మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు రాధ ( ఈషా రెబ్బ ), క్రిష్ (నిత్యా మీనన్), శివ (శ్రీనివాస్ అవసరాల), మీర (రెజినా), నలభీమ (ప్రియదర్శి) అందరూ ఎవరి వ్యక్తిగత సమస్యలతో వాళ్ళు బిజీగా, సతమవుతూ ఉంటారు.

వాళ్ళ మధ్యలో కాలి (కాజల్ అగర్వాల్) అనే అమ్మాయి అందరికన్నా తీవ్రమైన సమస్యతో బాధపడుతూ, విముక్తి కోసం మాస్ మర్డర్స్ చేయాలనుకుంటుంది. అసలు రాధ, క్రిష్, నలభీమ.. వీళ్లంతా ఎవరు, ఒకరికొకరికి మధ్యన సంబంధం ఏంటి, కాలి ఎవర్ని చంపాలనుకుంది, చివరికి వీళ్లందరి కథ ఎలా ముగిసింది అనేదే తెరపై నడిచే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన బలం క్లైమాక్స్. అవును ఆరంభం నుండి చూపించిన అనేక పాత్రలకి, వాటి చర్యలకి, సన్నివేశాలకి, మాటలకి జస్టిఫై చేసేలా ఉన్న ఈ ముగింపు చాలా థ్రిల్లింగా ఉంటుంది. ఏమాత్రం ఊహకందని ఈ ముగింపు చూశాక సినిమా అర్థమైన ప్రేక్షకుడు ఎవరైనా దర్శకుడ్ని మెచ్చుకోకుండా ఉండడు.

మొదటి అర్థ భాగం మొత్తాన్ని పాత్రల పరిచయానికే వాడుకున్న దర్శకుడు ముఖ్యమైన నిత్యా మీనన్, ఈషా రెబ్బ, కాజల్ అగర్వాల్, రెజినా వంటి పాత్రల్ని చాలా ఆసక్తికరంగా పరిచయం చేశాడు. ముఖ్యంగా కాజల్, రెజినా పాత్రలు తీవ్రంగా, మురళీ శర్మ, ప్రియదర్శి పాత్రల్లో మంచి ఫన్ మూమెంట్స్ దొరుకుతాయి. చేప (నాని), బోన్సాయ్ చెట్టు (రవితేజ)ల మధ్యన జరిగే సంభాషణలు నవ్వించాయి.

ఇక ఇంటర్వెల్ సన్నివేశాన్ని భలేగా ఉంది అనేలా ఇచ్చి సెకండాఫ్లో ప్రేమ, కొన్ని సోషల్ ఎలిమెంట్స్, హర్రర్ వంటి జానర్లను సమపాళ్లలో మిక్స్ చేసిన దర్శకుడు మీగుంపుని మాత్రం ఊహించని రీతిలో ఇచ్చాడు. మార్క్.కె. రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరొక పెద్ద బలం. కీలకమైన ప్రతి సన్నివేశాన్ని ఎఫెక్టివ్ గా తయారుచేశారాయన.

మైనస్ పాయింట్స్ :

సినిమా మొదటి సగ భాగంలో పాత్రల పరిచయం బాగున్నా అసలు కథేమిటి అనేది రివీల్ కాకపోవడంతో అన్ని పాత్రలు ఎందుకనే సందేహం కలుగుతుంది. శ్రీనివాస్ అవసరాల పాత్ర మీద నడిచే కొన్ని సీన్స్ సాగదీసినట్టు ఉంటాయి. పైగా అతని ట్రాక్ కొంత కన్ఫ్యూజన్ కు గురిచేస్తుంది కూడ.

ద్వితీయార్థంలో ముంగింపుకు ముందు జరిగే కొన్ని సన్నివేశాలు కొంత కన్ఫ్యూజన్ కు గురిచేస్తాయి. కొత్తదనాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఫలితంతో సంబంధం లేకుండా ఒకడుగు ముందుకేసి నాని చేసిన ఈ సినిమా కొత్తదనాన్ని కోరుకునే వారికి నచ్చినా ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కేవలం కాన్సెప్ట్ ఆధారంగా తీయడంతో బి, సి సెంటర్ల ప్రేక్షకులకి అంతగా నచ్చకపోవచ్చు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆలోచన, ఎగ్జిక్యూషన్ ను మెచ్చుకుని తీరవలసిందే. పేపర్ మీదే తికమకగా అనిపించే ఈ కథను కొన్ని చిన్న చిన్న లోపాలున్నా తెర మీద సాద్యమైనంత వరకు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా తీయడానికి ప్రయత్నించిన అతని ప్రయత్నం బాగుంది.

కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా మొత్తని సింగిల్ లొకేషన్లో తీసినా ఎక్కడా సన్నివేశాలు బోర్ కొట్టకుండా చిత్రీకరించాడు. మార్క్.కె. రాబిన్ నైపథ్య సంగీతం చాలా బాగుంది. సన్నివేశాలకు అదనపు బలాన్ని చేకూర్చింది. గౌతమ్ నెరుసు ఎడిటింగ్ బాగానే ఉన్నా సెకండాఫ్లో ఇంకాస్త క్లారిటీ మైంటైన్ చేసుండాల్సింది. నిర్మాతగా నాని ఒక ప్రయోగాత్మక చిత్రానికి కావల్సిన మంచి నటీనటుల్ని, మంచి బడ్జెట్ ను కేటాయించి తన వంతు న్యాయం చేసి కొత్తదనానికి సరైన పోరుత్సాహన్ని అందించారు.

తీర్పు :

ఈ ‘అ !’ చిత్రం మొదటి నుండి నిర్మాత నాని, దర్శకుడు ప్రశాంత్ వర్మలు చెబుతున్నట్టే రెగ్యులర్ సినిమాల కోణం నుండి చూడాల్సిన సినిమా కాదు. దర్శకుడు సింపుల్ లైన్ కు తెలివైన కథనాన్ని, బలమైన పాత్రల్ని, సన్నివేశాల్ని, థ్రిల్ చేసే ఇంటర్వెల్, ఆశ్చర్యపరిచే ముగింపును జోడించడంతో సినిమా కొత్తగా, ఆశ్చర్యపోయే విధంగా తయారైంది. కానీ ద్వితీయార్థంలోనే కొన్ని సీన్స్ తికమకపెట్టాయి. మొత్తం మీద సినిమా బి, సి సెంటర్ల ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోకవచ్చు కానీ కొత్తదనాన్ని స్వాగతించే వారికి మాత్రం తప్పకుండా నచ్చుతుంది.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review


సంబంధిత సమాచారం :