Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : చిన్నారి – భయపెట్టింది కానీ.. ఎక్కువగా బోర్ కొట్టించింది !

Chinnari review

విడుదల తేదీ : డిసెంబర్ 16, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : లోహిత్. హెచ్

నిర్మాత : కె. రవి కుమార్

సంగీతం : అంజనీష్ లోకనాథ్

నటీనటులు : ప్రియాంక ఉపేంద్ర, యువిన పార్థవి

ఇతర భాషల్లో విజయం సాధించిన హర్రర్ సినిమాలు వెంటనే తెలుగులోకి డబ్ అవడం అనే ఆనవాయితీ ప్రకారం కన్నడలో విడుదలై విజయవంతంగా నడుస్తున్న ‘మమ్మీ’ అనే చిత్రం తెలుగులో ‘చిన్నారి’ పేరుతో ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి కన్నడ ప్రేక్షకుల్ని అంతలా ఆకట్టుకున్న ఈ హర్రర్ థ్రిల్లర్ తెలుగు వారిని ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం..

కథ :

చనిపోయిన తన భర్త కోరిక మేరకు గర్భవతి అయిన ప్రియా (ప్రియాంక ఉపేంద్ర) తన 6 ఏళ్ల కూతురు క్రియ(యువిన పార్థవి), ఇంకో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి గోవాలోని తన విల్లాకి వెళుతుంది. అక్కడకు వెళ్లిన కొద్ది రోజుల తరువాత విల్లాలో జరిగే విచిత్రమైన కొన్ని సంఘటనలు వాళ్లకు భయాన్ని కలిగిస్తాయి.

ఆ ఇంట్లో ఉన్న ఏదో అదృశ్య శక్తి ప్రియను, ఆమె కూతురు క్రియను, ఇతర కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు ? అది ప్రియను, ఆమె కూతురు క్రియను ఎందుకు ఇబ్బంది పెడుతోంది ? ఆ అదృశ్య శక్తి బారి నుండి ప్రియ, క్రియలు తప్పించుకున్నారా లేదా ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఇందులోని ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది దర్శకుడు లోహిత్ గురించి. ఆయన హర్రర్ సినిమాకి ఉండవలసిన భయపెట్టడం అనే మొదటి లక్షణాన్ని పక్కాగా పాటించారు. ఈ సినిమాలో మొదటి నుండే దెయ్యం యొక్క ఆనవాళ్లను తెలియజేస్తూ చాలా చోట్ల భయపెట్టే ప్రయత్నం బాగానే చేశారు. ఉన్నట్టుండి దెయ్యం కనిపించడం వంటి కొన్ని సన్నివేశాల్లో నిజమైన భయం కలిగింది.

అలాగే ఇంటర్వెల్ సన్నివేశం బాగా కుదిరింది. ఊహించని ఆ సీన్ భయంతో పాటు థ్రిల్ ని కూడా కలిగించింది. అలాగే సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో ఒక 12, 13 నిముషాల పాటు నడిచే సన్నివేశం కూడా బాగా ఆకట్టుకుంది. ఇక క్లైమాక్స్ అన్ని హర్రర్ సినిమాలలాగా మంత్రాలు, మాయలతో ముగియకుండా సెంటిమెంట్ తో ముగియడం కాస్త డిఫరెంట్ గా బాగుంది. సినిమా కథ, క్లైమాక్స్, కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ సినిమా నుండి అడాప్ట్ చేసుకున్నా వాటిని ప్రాంతీయ వాతావరణానికి తగ్గట్టు బాగానే మార్చుకున్నాడు డైరెక్టర్. ఇక బ్యా గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ ఈ సినిమాకి అదనపు బాలలుగా నిలిచాయి. క్రియ పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ యువిన పార్థవి చాలా సహజంగా నటించింది.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది ఫస్టాఫ్, సెకండాఫ్ లలో నడిచే బోరింగ్ కథనం గురించి. ఫస్టాఫ్ ఇంట్రడక్షన్, కథ బాగానే ఉన్నా దాని నిడివి పెంచటానికి అన్నట్టు చాలా అనవసరమైన సన్నివేశాల్ని బలవంతంగా మధ్యలో ఇరికించారు. చాలా సేపు మంచి హర్రర్ సన్నివేశాలు, కథ ముందుకు వెళ్లడం వంటివి ఎప్పుడు జరుగుతాయా అని ఎదురుచూడాల్సి వచ్చింది. ఒక దశలో ఆ అనవసరపు సీన్లు విసుగు తెప్పించాయి కూడా. దాంతో మధ్య మధ్యలో కలిగే హర్రర్ ఫీలింగ్ కూడా అక్కడక్కడా మిస్సయింది.

ఇక సెకండాఫ్ లో ప్రీ క్లైమాక్స్, అక్కడక్కడా వచ్చే కొన్ని హర్రర్ సన్నివేశాలు తప్ప మిగతా కథనం అంతా బోరింగ్ గా సాగింది. అసలు ఆ అదృశ్య శక్తి వాళ్ళ ఇంట్లోకి ఎలా ప్రవేశించింది అనే విషయాన్ని పూర్తి క్లారిటీగా చెప్పలేదు. సినిమా కొంత గడిచాక దాని ఒరిజినల్ హాలీవుడ్ సినిమా గుర్తుకురావడం, తరువాత ఏం జరగబోతోంది అనేది చాలా సులభంగా ఊహించగలగడంతో సినిమాలో థ్రిల్ చాలా వరకూ మిస్సయింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ భిన్నంగా బాగానే ఉన్నా మరోవైపు కాపీ అనే భావన నిరుత్సాహాన్ని కలిగించింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ముందుగా ప్రస్తావించాల్సింది దర్శకుడు లోహిత్ హర్రర్ సన్నివేశాలను రాసుకున్న తీరును గురించి. ఈ సీన్లు చాలా వరకూ రొటీన్ గా ఉండకుండా కాస్త కొత్తగా ఉండి బాగానే బయపెట్టాయి. అలాగే వాటికి అంజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా కుదిరి సన్నివేశాల్ని మరింత భయపెట్టేలా చేసింది. హెచ్. సి. వేణు సినిమాటోగ్రఫీ కూడా హర్రర్ సినిమాలకు ఉండాల్సిన విధంగానే ఉంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా బాగున్నాయి.

తీర్పు :

తెలుగు ప్రేక్షకులకు హర్రర్ సినిమాలు మీదున్న ఇష్టాన్ని నమ్ముకుని వచ్చిన ఈ చిన్నారి చిత్రంలో కాస్త కొత్తగా అనిపించే కథ, చాలా చోట్ల భయపెట్టే హర్రర్ సన్నివేశాలు, మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, చైల్డ్ ఆర్టిస్ట్ యువిన పార్థవి, ఆమె తల్లి ప్రియాంక ఉపేంద్ర నటన, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లు మంచి ప్లస్ పాయింట్స్ కాగా బోర్ కొట్టించే ఫస్టాఫ్, సెకండాఫ్ కథనాలు, అనవసరపు, ఊహాజనితమైన సన్నివేశాలు మైనస్ పాయింట్స్ గా ఉన్నాయి. మొత్తం మీద ఈ ‘చిన్నారి’ భయపెట్టడంతో పాటు, ఎక్కువగా బోర్ కొట్టించింది కూడా.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review


సంబంధిత సమాచారం :