సమీక్ష : డ్రీమ్ – వెరీ బ్యాడ్ డ్రీమ్

సమీక్ష : డ్రీమ్ – వెరీ బ్యాడ్ డ్రీమ్

Published on Oct 26, 2012 4:45 PM IST
విడుదల తేదీ: 26 అక్టోబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5
దర్శకుడు : భవాని శంకర్
నిర్మాత : సతీష్ మైనం, విజయ మైనం
సంగీతం: రాజేష్.ఎస్
నటీనటులు : రాజేంద్ర ప్రసాద్,పావని రెడ్డి


ఒకప్పుడు కామెడీతో కడుపుబ్బా నవ్వించిన కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య అతిధి పాత్రలు చేస్తూ వస్తున్నారు. కామెడీ సినిమాలు చేసి బోర్ కొట్టిందో ఏమో వెరైటీగా ఒక సినిమా చేయాలనిపించి డ్రీం అనే సినిమా తీసారు. ఈ సినిమాకి భవాని శంకర్ డైరెక్టర్ అయితే సతీష్ మైనం, విజయ మైనం నిర్మాతలు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఒకటుందని కూడా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ సినిమా గురించి తెలిసి ఎలా ఉందొ తెలుసుకునే వారి కోసం …

కథ :

రిటైర్డ్ ఆర్మీ మేజర్ రాజేంద్ర ప్రసాద్ కి ఒక విచిత్రమైన జబ్బు ఉంటుంది. ఆ జబ్బు వల్ల ‘కల’కి వాస్తవానికి మధ్య తేడాని గుర్తించ లేకపోతుంటాడు. తన భార్య తనని చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు అపోహ పడుతుంటాడు. తన కాలనీలో ఉండే వారందరినీ శత్రువులుగా భావించి ఒకరోజు రాత్రి తన ఆర్మీ గన్ తీసుకుని అందరినీ వరసబెట్టి కాల్చి పారేస్తాడు. పోలీసులు అతన్ని ఇంటరాగేషన్ చేస్తే తనకున్న జబ్బు గురించి చెప్తాడు. అసలు జరిగిన వాస్తవం ఏమిటి ఆర్మీ మేజర్ ఆ కాలనీ వాళ్ళని అందరినీ ఎందుకు చంపాడు అన్నది మిగతా.

ప్లస్ పాయింట్స్ :
మనిషికి వచ్చే డ్రీమ్స్ మీద దర్శకుడు ఎంతో రీసెర్చ్ చేసాడు. అయన ఇలాంటి సినిమా చేయాలనుకోవడం అభినందించ తగ్గ విషయం. ఇదొక్కటి తప్ప సినిమాలో చెప్పుకోవాల్సిన విషయం ఇంకొకటి లేదు.

మైనస్ పాయింట్స్ :
దర్శకుడు భవాని శంకర్ ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా చేయాలనుకోవడం అభినందించ తగ్గ విషయమే. కానీ అది తెర మీదకి వచ్చేసరికి కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. ఏ భాషలో సినిమాకి అయినా స్క్రీన్ప్లే అనేది ఒకటి ఉంటుంది. ఈ సినిమాకి ఆ రూల్ లేదు. అసలు సినిమా ఎంత స్లోగా నడుస్తుందంటే రాజేంద్ర ప్రసాద్ కి ఉన్న జబ్బు నుండి రిలీఫ్ కోసం ఐపాడ్లో పాటలు వినమని డాక్టర్ చెప్తాడు. ఆ పాట వింటూ అయన రోడ్ మీద 10 నిముషాలు నడుస్తూ ఉంటాడు. అయన పది నిముషాలు కాలనీలో నడుస్తూ ఉన్న తతంగం అంతా తెర మీద చూపించాడు. పైన చెప్పిన సినిమా కథ అంతా చివరి 15 నిమిషాల్లో చెప్పాడు దర్శకుడు. క్లైమాక్స్ వరకు రాజేంద్ర ప్రసాద్ ఎందుకు ఇంత వింతగా ప్రవర్తిస్తున్నాడో అర్ధం కాదు. సినిమా ఫస్టాఫ్ అంతా రాజేంద్ర ప్రసాద్ కి ఉన్న జబ్బు వల్ల అతను ఎంత విచిత్రంగా ప్రవర్తించేది చూపించాడు. అసలు అయన విచిత్రమైన గెటప్ లతో తిరుగుతుంటే సినిమాకి ఎందుకు వచ్చామా అనిపిస్తుంది. ఒక సన్నివేశంలో కాలనీ లో ఉండే అందరి ఇంటికి వెళ్లి ఒక్కొక్కరినీ చంపుతూ ఇలా చంపుతుంటే థ్రిల్ రావట్లేదు అని అందరినీ వరుసగా నిలబెట్టి కాల్చి పారేస్తాడు. సినిమాకి వచ్చిన వాళ్ళని కూడా అలా వరసబెట్టి కాలుస్తున్నట్లు అనిపించింది.

సాంకేతిక విభాగం :
రాజేష్.ఎస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గుడ్డిలో మెల్ల లాగా కొంత వరకు బెటర్. ఇక రవి కుమార్ సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఆ కెమెరా యాంగిల్స్ చూస్తుంటే ఈయనకి సినిమాటోగ్రఫీలో బేసిక్స్ కూడా తెలుసా అనే అనుమానం వస్తుంది. అసలు ఈ సినిమాకి ఎడిటర్ సమస్యో దర్శకుడి సమస్యో తెలియదు కానీ షూట్ చేసిన ఫూటేజ్ అంతా అలాగే సినిమాలో ఉంచారు. దర్శకుడికి సినిమా మీద కనీస అవగాహన లేకపోవడం ప్రధాన సమస్య.

తీర్పు :
ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. వెంటనే వెళ్లి థియేటర్లో చూడండి  రేపటి వరకు ఉంటుందో లేదో. మాకు ఈ సినిమాకి వెళ్ళే అవకాశం లేదు కనీసం టీవీలో వచ్చినప్పుడు చూస్తాం అనుకుంటున్నారేమో టీవీ వాళ్ళు కూడా మీ ఆశల పై నీళ్ళు చల్లుతారు. ఈ సినిమా క్లైమాక్స్ లో రాజేంద్ర ప్రసాద్ చెప్పే డైలాగ్ ‘నా చావుకి ఈ కాలనీ వాళ్ళే కారణం’ అని సినిమా చుసిన వాళ్ళు కూడా అదే ఫీలయ్యారు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5

అశోక్ రెడ్డి .ఎమ్

Click Here For ‘Dream’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు