సమీక్ష : “ఫ్యామిలీ డ్రామా” – తెలుగు చిత్రం సోనీ లివ్‌లో ప్రసారం

సమీక్ష : “ఫ్యామిలీ డ్రామా” – తెలుగు చిత్రం సోనీ లివ్‌లో ప్రసారం

Published on Oct 30, 2021 7:00 AM IST
 Family Drama Movie Review

విడుదల తేదీ : అక్టోబర్ 29, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: సుహాస్, తేజ కాసరపు, పూజా కిరణ్‌, అనూష నూతుల, శ్రుతి మెహర్‌, సంజయ్‌ రథా తదితరులు

దర్శకుడు: మెహెర్ తేజ్

నిర్మాతలు: చష్మా ఫిల్మ్స్, నూతన భారతి ఫిల్మ్స్

సంగీత దర్శకుడు: అజయ్‌, సంజయ్‌

డి ఓ పి: వెంకట్ ఆర్ శాకమూరి

ఎడిటర్: రామకృష్ణ అర్రం

షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించి హీరోగా తొలి చిత్రం “కలర్ ఫోటో” ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న హీరో సుహాస్ తాజాగా “ఫ్యామిలీ డ్రామా”తో వచ్చాడు. నేడు “సోనీ లివ్‌”లో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఓ తండ్రి (సంజయ్)కి రామ, లక్ష్మణ్ ఇద్దరు కుమారులు. ఉద్యోగం లేకుండా జులాయిగా తిరుగుతుండడంతో రామ (సుహాస్)ను ఇంటి నుండి బయటకు గెంటేస్తాడు. ఇక లక్ష్మణ్ (తేజ కాసరపు) యామిని(పూజా కిరణ్)ని ప్రేమ వివాహం చేసుకుని ఇంట్లో తెచ్చి పెడతాడు. లక్ష్మణ్ వ్యాపారం చేసుకోవాలని తండ్రిని డబ్బులు అడిగితే ఇవ్వనని, ఏదైనా ఉద్యోగం చేసుకోమని, రెండు రోజుల్లో ఉద్యోగం సంపాదించుకోకపోతే భార్యాభర్తలు ఇద్దరిని బయటకు గెంటేస్తానని తండ్రి తెగేసి చెప్పేస్తాడు. అయితే తన ఇంట్లో జరుగుతున్న గొడవలను తెలుసుకున్న రామ ఓ పథకంతో తమ్ముడు ల‌క్ష్మ‌ణ్‌ను కలుస్తాడు. మరీ రామ ఎలాంటి ప్లాన్ వేశాడు? అది ఎవరితో ఇంప్లిమెంట్ చేయించాడు. బ్లేడుతో గొంతుకోసి వరుస హత్యలకు పాల్పడుతున్న సీరియల్ కిల్ల‌ర్లకు వీరికి సంబంధం ఏమిటీ? చివరకు వీరి జీవితాల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? అనేదే మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే అది సుహాస్‌ నటన అనే చెప్పాలి. శాస్త్రీయ సంగీతం వింటూ, చిత్రంగా ప్రవర్తించే క్యారెక్టరైజేషన్‌లో సుహాస్ ఒదిగిపోయిన విధానం, మంచి వాడిగా నటిస్తూ సైకో కిల్లర్‌గా ప్రవర్తించే తీరు ఒకింత ఆసక్తిగా అనిపిస్తాయి.

ఇక అతడితో పాటు ప్రధాన పాత్రలో కనిపించిన తేజ కాసరపు కూడా చక్కటి నటననే కనబరిచాడు. పూజా కిరణ్, అనూషా నూతుల, సంజయ్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. తల్లి పాత్రలో కనిపించిన శృతి మెహర్ నటన కాస్త సహజంగా ఉంటే బాగుండేది అనిపించింది.

ఇకపోతే దర్శకుడు మెహర్ తేజ్‌కు ఇది తొలి సినిమా. పెద్దగా ట్విస్టులు లేకుండా కథలోకి తీసుకెళ్ళి తర్వాత చిన్నపాటి ట్విస్టులను తీసుకొచ్చి నెక్స్ట్ ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠను ప్రేక్షకుడిలో తీసుకురాగలిగాడు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఓ ఫ్యామిలీలోని ఆరుగురు కుటుంబసభ్యులతో సినిమా మొత్తాన్ని నడిపించిన తీరు బాగుంది కానీ కొన్ని సన్నివేశాలు పదే పదే చూపించడంతో బోరింగ్‌గా అనిపిస్తాయి. సినిమా ప్రారంభించిన తీరు, ఫస్ట్ హాఫ్ తీసిన విధానం ఒకే అనిపించినా ఓ మేజర్ ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత కథనం కాస్త నెమ్మదించినట్టు అనిపించింది. సెకండాఫ్‌లో కథను మరింత గ్రిప్పింగ్‌గా రాసుకుని ఉంటే బావుండేది.

ఇకపోతే నగరంలో జరుగుతున్న వరుస హత్యలకు గల కారణాలను పెద్దగా చూపించలేకపోయారు, వరుస హత్యలు జరుగుతున్నా వారి కుటుంబ సభ్యులు, పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం కొసమెరుపు. ఇక తల్లి పాత్రలో నటించిన శృతి మెహర్ నటన నేచురల్‌గా లేదనిపించింది.

 

సాంకేతిక విభాగం :

 

దర్శకుడు మెహర్ తేజ్ తక్కువ పాత్రలతో చక్కటి కథను రాసుకున్నాడు. ముఖ్యంగా సుహాస్‌ క్యారెక్టరైజేషన్‌ను కొత్తగా చూపించాడని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ స్లోగా ప్రారంభమైనప్పటికీ విరామ సమయానికి సినిమాపై ఆసక్తిని రేకెత్తించాడు. కొన్ని సన్నివేశాలు రిపీట్ అవుతున్నాయని అనిపించినా క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్టుతో సినిమాని ముగించడం బాగుందని చెప్పాలి.

ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రధాన బలమని చెప్పాలి. రెగ్యులర్ రొటీన్ మ్యూజిక్ కాకుండా అజయ్, సంజయ్ కొత్తగా ప్రయత్నించడం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే డిఫరెంట్ థ్రిల్లర్‌గా తెరక్కించిన ‘ఫ్యామిలీ డ్రామా’లో సుహాస్ నటన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బూస్టప్ ఇచ్చింది. మధ్య మధ్యలో కొన్ని ట్విస్టులు పర్వాలేదనిపించాయి. కానీ స్లోగా సాగే కథనం, లిమిటెడ్ పాత్రలు, రిపీటెడ్ సన్నివేశాలు ఎక్కువవ్వడంతో కాస్త బోరింగ్‌గా ఫీలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది కానీ మిగతా వర్గాల ప్రేక్షకులను మాత్రం “ఫ్యామిలీ డ్రామా” మెప్పించదనే చెప్పాలి.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

 

Click Here For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు