సమీక్ష : ఇంకొక్కడు – ‘స్పీడ్’.. జస్ట్ ఓకే!

Inkokkadu review

విడుదల తేదీ : సెప్టెంబర్ 8, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : ఆనంద్ శంకర్

నిర్మాత : శిబు థమీన్స్

సంగీతం : హరీస్ జైరాజ్

నటీనటులు : విక్రమ్, నయనతార, నిత్యా మీనన్..

సౌతిండియన్ సినిమాలో ఎప్పటికప్పుడు ప్రయోగాత్మక సినిమాలతో మెప్పించే వారిలో హీరో విక్రమ్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన ‘ఇరుముగన్’ పేరుతో మరో ప్రయోగాత్మక సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చారు. తెలుగులో ‘ఇంకొక్కడు’ పేరుతో డబ్ అయిన ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. కొద్దికాలంగా ఓ బలమైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న విక్రమ్‌కు ఈ సినిమా ఆ హిట్ తెచ్చిపెట్టేలానే ఉందా? చూద్దాం..

కథ :

లవ్ (విక్రమ్) అనే ఎవ్వరికీ దొరకని ఒక సైంటిస్ట్, ‘స్పీడ్’ అనే ఓ డ్రగ్‌ను కనిపెడతాడు. ఆ డ్రగ్‌ను తన అవసరాలకు, చెడు మార్గంలో వాడుకోవాలని ప్రయత్నించే అతడు, ఈ క్రమంలోనే మలేషియాలో ఇండియన్ ఎంబసీపై దాడికి పాల్పడతాడు. దీంతో లవ్‌ను పట్టుకునేందుకు ఇండియన్ ఇంటిలిజెన్స్ సంస్థ అఖిల్ (విక్రమ్) అనే ఓ సస్పెండ్ అయిన అధికారిని పిలిపిస్తుంది. అఖిల్‌కి మాత్రమే లవ్‌కి సంబంధించిన చాలా విషయాలు తెలుసని ఇంటిలిజెన్స్ సంస్థ లవ్‌ని పట్టుకునేందుకు అఖిల్‌కి అన్ని అధికారాలూ ఇస్తుంది. ఈ మిషన్‌పై ఆయుషి (నిత్యామీనన్)తో కలిసి మలేషియా వెళ్ళిన అఖిల్, అక్కడ లవ్‌ని పట్టుకునేందుకు ఏమేం చేశాడు? అసలు అఖిల్‌కి, లవ్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో మీరా (నయనతార) ఎవరు? లవ్ కనిపెట్టిన స్పీడ్ అనే డ్రగ్ కథేంటీ? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఇంకొక్కడు సినిమాకి అన్నివిధాలా ప్రధానమైన బలమంటే విక్రమ్ అనే నిస్సందేహంగా చెప్పేయొచ్చు. ప్రయోగాలకు విక్రమ్ ఎప్పుడూ ముందుటాడన్న విషయం ఈ సినిమాతో మరోసారి ఋజువైంది. అఖిల్, లవ్ అనే రెండు విభిన్న పాత్రల్లో విక్రమ్ తన నటన స్థాయిని కొత్తగా మళ్ళీ పరిచయం చేశాడు. ముఖ్యంగా లవ్ పాత్రలో విక్రమ్‌ని తప్ప మరొకరిని ఊహించలేమేమో అన్నంతగా ఆ పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించాడు. ఈ రెండు పాత్రలను పరిచయం చేసిన విధానం కూడా అదిరిపోయేలా ఉంది. ఇక స్పీడ్ డ్రగ్ ఎలా పనిచేస్తుందో మొదటి సన్నివేశంలోనే చెప్పేయడం బాగా ఆకట్టుకుంది.

మీరా పాత్రలో నయనతార ఎంత అందంగా కనిపించిందో, అంతే బాగా నటించేసింది. సినిమా పరంగా చూసుకుంటే ఫస్టాఫ్‌లో అఖిల్, లవ్, స్పీడ్ డ్రగ్.. ఇలా కథకు అవసరమైన పాత్రలను, అంశాలను పరిచయం చేసిన విధానం కట్టిపడేసేలా ఉంది. టైటిల్ కార్డ్స్ కూడా అసలు కథలోని అంశాన్ని చెప్పేదిగా ఉండడం బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. అఖిల్, లవ్ పాత్రల మధ్యన సెకండాఫ్‌లో వచ్చే మైండ్ గేం కొన్ని చోట్ల ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

ఒరిజినల్ ప్లాట్ ముందే పూర్తిగా తెలిసిపోయేదిగా ఉండడం ఈ సినిమా విషయంలో పెద్ద మైనస్ పాయింట్. సైన్స్ ఫిక్షన్ అంశాన్ని పక్కనబెడితే, ఇలాంటి కథతోనే చాలా సినిమాలు వచ్చి ఉండడం తేలిపోయే విషయంగానే చెప్పొచ్చు. ఇక సెకండాఫ్‌లో హీరో, విలన్ ఒకసారి ఎదురుపడ్డాక సినిమా అంతా ఒకే ఒక్క అంశం చుట్టూ సాగేది కావడం బోర్ కొట్టించింది. దానికి తోడు ఇదే సమయంలో రెండు పాటలు రావడం కూడా కాస్త విసుగు తెప్పించింది. ఫస్టాఫ్‌లో విక్రమ్, నయనతారల మధ్యన వచ్చే లవ్‌ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. నిత్యా మీనన్ పాత్ర చాలా చిన్నది కావడంతో పాటు ఆమెకు పెద్దగా నటించే ఆస్కారం కూడా లేకపోవడం మైనస్‌గానే చెప్పుకోవాలి.

సైన్స్ ఫిక్షన్ విషయంలో లాజిక్ పక్కనబెడితే, మిగతా చాలా విషయాల్లోనూ లాజిక్ అన్నదాన్ని పట్టించుకున్నట్లు కనిపించలేదు. సినిమా చూస్తున్నంతసేపూ ‘రోబో’, ‘సెవెన్త్ సెన్స్’ లాంటి సినిమాలు, హాలీవుడ్‌లో ఫేమస్ అయిన ‘జేమ్స్‌బాండ్’ సిరీస్ స్టైల్ నెరేషన్ కనిపించింది. వీటన్నింటినీ అతికించి చెప్పినట్లు కొన్ని సన్నివేశాలు తోచాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే దర్శకుడు ఆనంద్ శంకర్ ఒక కొత్త కాన్సెప్ట్‌నే అందరికీ తెలిసిన, కమర్షియల్ సినిమా ఫార్మాట్‌లో చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలోనే ఫస్టాఫ్ విషయంలో బాగానే విజయం సాధించగా, సెకండాఫ్‌లో పక్కదారి పట్టినట్లనిపించింది. స్పీడ్ డ్రగ్ గురించి చెప్పడం, అఖిల్, లవ్‌ల పాత్రలు పరిచయం చేయడం తదితర సన్నివేశాల్లో ఆనంద్ అద్భుతమైన ప్రతిభ చూపాడు. ఇలా సన్నివేశాలుగా కాకుండా పూర్తిగా చూస్తే ఆనంద్, కేవలం ఫర్వాలేదనిపించాడని మాత్రమే చెప్పాలి.

హరీస్ జైరాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి బలంగా నిలిచింది. అయితే పాటల్లో హెలెనా తప్ప వెంటనే ఆకట్టుకునేలా పాటలేవీ లేవు. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. భువన్ శ్రీనివాసన్ ఎడిటింగ్ బాగానే ఉంది. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను తీసేసినా బాగుండేదనిపించింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. లవ్ పాత్రకు కాస్యూమ్స్ పరంగా, మేకప్ పరంగా తీసుకున్న జాగ్రత్తలను అభినందించాల్సిందే!

తీర్పు :

కొత్తదనమున్న ఓ ప్రయోగాత్మక అంశంతో కమర్షియల్ ఫార్మాట్‌లో కథ చెప్పడమన్నది సులువైనది కాదు. ఒక్కసారి అది బాగా కుదిరిందంటే సినిమా ఏ స్థాయి విజయం సాధిస్తుందో చాలా సినిమాలే ఋజువు చేశాయి. తనకు బాగా అలవాటైన ఈ పద్ధతినే నమ్ముకొని విక్రమ్ ఈ సారి కూడా ప్రయోగాన్నే నమ్ముకొని వచ్చారు. అయితే ఆ ప్రయోగం పూర్తి స్థాయి సినిమాగా ఆకట్టుకునేలా లేకపోవడమే ఇక్కడ మైనస్. విక్రమ్ అనితర సాధ్యమైన నటన, ఫస్టాఫ్‌లో డ్రగ్‌ను, హీరో, విలన్‌ పాత్రలను పరిచయం చేసిన విధానం, ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండాఫ్‌లో హీరో, విలన్‌ల మైండ్ గేమ్ ఇలా సన్నివేశాలుగా చూస్తే ఇంకొక్కడులో కట్టిపడేసే అంశాలు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ సరిగ్గా అల్లడంలో పాత కథను ఎంచుకోవడం, దాన్ని కూడా పూర్తి స్థాయిలో బాగుండేలా చెప్పలేకపోవడం నిరాశ పరచే అంశం. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘ఇంకొక్కడు’, విక్రమ్ చేసిన ఇంకొక సాధారణ ప్రయోగంగా మాత్రమే మిగిలిపోయింది!

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :