Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : ఇట్లు ప్రేమతో – ప్రేక్షకుల సహనానికి పరీక్షె ఈ ప్రేమ.!

etlu-prematho విడుదల తేదీ : 17 అక్టోబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 1/5
దర్శకత్వం : వసంత్
నిర్మాత : బద్రకాళి, పెదబాబు
సంగీతం : యువన్ శంకర్ రాజా
నటీనటులు : అర్జున్, సుర్విన్ చావ్లా…

‘ప్రేమంటే తీసుకోవడం కాదు, ఇవ్వడం’ అనే కాన్సెప్ట్ తో రూపొందిన తమిళ సినిమా ‘మూండ్రు పేర్ మూండ్రు కాదల్’. తమిళంలో గత ఏడాది మే నెలలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో గురు బ్రహ్మ ఆర్ట్స్ పతాకంపై ‘ఇట్లు ప్రేమతో’ టైటిల్ తో డబ్బింగ్ చేశారు. బద్రకాళి, పెదబాబు నిర్మాతలు. వసంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత వరకూ అలరించిందో ఒకసారి చూద్దాం.

కథ :

మూడు ప్రేమకథల సమాహారంగా ఈ సినిమా రూపొందింది. వరుణ్ (విమల్) ఒక ఛార్టర్డ్ అకౌంటెంట్. తను ప్రేమించిన అమ్మాయి అంజన(లాసిని)కి తన ఫాదర్ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చేలా చేస్తాడు. వరుణ్ అంజనతో ప్రేమలో పడతాడు . కానీ అప్పుడే వరుణ్ కి అప్పటికే అంజన ఒక అబ్బాయిని ప్రేమించిందని, చిన్న గొడవతో విడిపోయారని తెలుస్తుంది. దీనిని అడ్వాంటేజ్ గా తీసుకున్న వరుణ్, ఆమెకు బాగా దగ్గరవుతాడు. అంజన వరుణ్ తో ప్రేమలో పడుతుంది. ఆ సమయంలో వరుణ్ కు విశాఖలో జరిగిన గుణ(చేరన్) – మల్లిక (ముక్తా భాను)ల ప్రేమ కథ తెలుస్తుంది.

గుణ – మల్లికల ప్రేమ కథ స్ఫూర్తితో అంజనకు దూరమవుతాడు వరుణ్. తన ప్రేయసికి దూరమైన వరుణ్ చచ్చిపోవాలనుకుంటాడు. అప్పుడు తన బాల్య స్నేహితురాలు దివ్య ( సుర్విన్ చావ్లా) – హారిస్ (అర్జున్)ల ప్రేమ కథ చూసి మనసు మార్చుకుంటాడు.

దివ్య – హారిస్ ల ప్రేమకథ వరుణ్ లో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది..? దర్శకుడు ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకున్నాడు..? ఈ మూడు ప్రేమకథలలో చివరికి జరిగిందేంటి..? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ అర్జున్, సుర్విన్ చావ్లాల నటన. హారిస్ పాత్రలో అర్జున్ బాగా నటించాడు. సుర్విన్ చావ్లా స్క్రీన్ పై మెరిసింది కాసేపే అయినా తన గ్లామర్ గా ఆకట్టుకుంది. స్విమ్ సూట్, చీరలలో అందాలు ఆరబోసింది. చివరి 35 నిముషాలలో వచ్చే వీరిద్దరి ప్రేమకథ ప్రేక్షకులను ఒక మోస్తరుగా ఆకట్టుకుంది. అర్జున్ – సుర్విన్ చావ్లాల ప్రేమకథలో మాత్రమే లవ్, ఎమోషన్ బాగా ఎలివేట్ అయ్యాయి.

మైనస్ పాయింట్స్ :

మూడు ప్రేమకథల సమాహారంగా రూపొందిన ఈ సినిమాలో తొలి రెండు ప్రేమకథలలో టైటిల్ లో ఉన్న ప్రేమ మిస్ అయ్యింది. అలాగే ఎమోషన్స్, సెంటిమెంట్ కూడా వర్క్ అవుట్ అవ్వలేదు. ముఖ్యంగా అర్జున్ ఒక్కడిని మినహాయిస్తే ఈ సినిమాలో నటించిన మిగతా ఆర్టిస్టులు తెలుగు ప్రేక్షకులకు కొత్త ముఖాలే. వాస్తవిత కథలు, సినిమాలతో తమిళ ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చేరన్ ఈ సినిమాలో గుణ పాత్రలో నటించాడు. ఈ ప్రేమకథను తమిళనాడులో జరిగిన ఒక యధార్ధ సంఘటన ఆధారంగా రూపొందించారు. ఖైదీలలో మార్పు తీసుకురావాలి అనే ఆశయంతో జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన ఒక వ్యక్తి కథ. ఈ కథలో తమిళ నేటివిటీ ఎక్కువైంది. తర్వాత చేరన్, మల్లికల నటన కూడా అంతంత మాత్రంగానే ఉంది.

అర్జున్ కథను ఎమోషనల్ గా, చేరన్ కథను రియాలిటీకి దగ్గరగా రాసుకున్న దర్శకుడు వసంత్, మొదటి ప్రేమకథలో ప్రేక్షకులను నవ్వించడానికి వినోదాత్మకంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాడు. ఆదిలోనే హంసపాదు ఎదురైనట్లు ఈ కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వించకపొగా, వారి సహనాన్ని పరీక్షిస్తాయి. ఈ ప్రేమకథలో నటించిన విమల్, లాసినిలు నటనలో బేసిక్స్ నేర్చుకుంటున్నట్లు నటించారు. ఇలా ఎన్ని ఉన్నా కథ మరియు కథనం ఆసక్తిగా ఉంటె ఆడియన్స్ సినిమాకి కనెక్ట్ అవుతారు. కానీ అవే మిస్ అవ్వడంతో ఈ ప్రేమకథలు ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్షగా మారాయి.

సాంకేతిక విభాగం :

సినిమాలో సినిమాటోగ్రఫీ మరియు సంగీతం బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ దినేష్ ప్రతి ఫ్రేమ్ ను అందంగా తీర్చిదిద్దాడు. చెన్నై, ఊటీ లొకేషన్స్ ను అద్బుతంగా చిత్రీకరించాడు. తర్వాత సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా తన పాటలతో, నేపధ్య సంగీతంతో సినిమాను మరో మెట్టు ఎక్కించడానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. అనువాద సాహిత్యం పాటల్లో మాధుర్యాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించలేకపోయింది. ఎడిటర్ ప్రతి సన్నివేశాన్ని సాగదీయంతో నేపధ్య సంగీతం సినిమాకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేకపోయింది.

కథ, స్రీన్ ప్లే, దర్శకత్వ విభాగాలను నిర్వర్తించిన వసంత్, మూడు విభాగాలలోనూ ఫెయిల్ అయ్యాడు. మూడు కథలను ఒకే సినిమాలో చెప్పాలనుకున్నప్పుడు పకడ్బంది స్క్రీన్ ప్లే రాసుకోవాలి. ప్రతి కథలో వైవిధ్యం ఉండాలి. ఒక కథ వెంట మరొక కథ వస్తుంది తప్పితే, స్క్రీన్ ప్లేతో మేజిక్ చేయడానికి దర్శకుడు అస్సలు ప్రయత్నించలేదు. తర్వాత ప్రతి సన్నివేశాన్ని సాగదీశాడు. ఒక్క ప్రేమకథలో కూడా దర్శకుడు హ్యాపీ ఎండింగ్ ఇవ్వలేదు. ప్రేమ విఫలం అయితే చావు పరిష్కారం కాకూడదు అని చెప్పడానికి మూడు కథలు ఎంచుకోవడం ఎందుకు..? ఒక్క కథలో చెప్తే సరిపోతుంది కదా..!

తీర్పు :

తమిళ నేటివిటీ ఎక్కువైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే. భిన్నమైన మనస్తత్వాలు కల వ్యక్తుల ప్రేమను ఈ సినిమాలో ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. తెలుగులో ఈ తరహా కథాంశాలతో చాలా సినిమాలు వచ్చాయి. ప్రేమ విఫలం అయితే చావు పరిష్కారం కాకూడదు అని దర్శకుడు ఎంచుకున్న పాయింట్ మంచిందే. కాకపోతే, దానిని ప్రేక్షకులకు చేరువయ్యేలా చెప్పడంలో ఘోరంగా విఫలమయ్యాడు. తమిళంలో ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అక్కడ కొద్ది శాతం మంది ప్రేక్షకులు సినిమాను ఆదరించడానికి ముఖ్య కారణం యువన్ సంగీతం, వారి అభిరుచులకు తగ్గట్టు ఉన్న కథలు. తమిళ వాసన ఎక్కువ అవ్వడం, యువన్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేకపోవడంతో థియేటర్ కి వెళ్ళిన ప్రేక్షకుడు తల భారంతో బయటకు రావలసిన పరిస్థితి వస్తుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5

123తెలుగు టీం


సంబంధిత సమాచారం :