సమీక్ష : కుమారి 21F – యూత్ మనసు దోచే కుమారి.!

సమీక్ష : కుమారి 21F – యూత్ మనసు దోచే కుమారి.!

Published on Nov 22, 2015 5:30 PM IST
Cheekati Rajyam review

విడుదల తేదీ : 20 నవంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : పల్నాటి సూర్య ప్రతాప్

నిర్మాత : సుకుమార్

సంగీతం : దేవీశ్రీ ప్రసాద్

నటీనటులు : రాజ్ తరుణ్, హేభ పటేల్..

టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో ఒకరైన సుకుమార్ సరికొత్త కథలని ప్రేక్షకులకు అందించాలని సుకుమార్ రైటింగ్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించి, అందులో మొదటి సినిమాకి తన కథ – స్క్రీన్ ప్లేని అందించి చేసిన సినిమా ‘కుమారి 21F’. ప్రస్తుతం ప్రేమ విషయంలో యువత ధోరణి ఎలా ఉంది అన్న బోల్డ్ పాయింట్ ని టార్గెట్ చేస్తూ చేసిన ఈ సినిమాలో రాజ్ తరుణ్, హేభ పటేల్ హీరో, హీరోయిన్స్ గా నటించారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ :
కెజిబి కాలనీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జీవనం సాగించే ఓ కుర్రాడి ప్రేమకథే ఈ ‘కుమారి 21F’. సిద్దు(రాజ్ తరుణ్) కుకింగ్ లో డిగ్రీ కంప్లీట్ చేసి స్టార్ క్రూస్ షిప్ లో చెఫ్ గా వెళ్ళాలని తెగ ట్రై చేస్తుంటాడు. సిద్దుకి ముగ్గురు ఫ్రెండ్స్.. వాళ్ళే శంకర్(నోయెల్), ఫోటోల సురేష్(నవీన్), సొల్లు శీను(సుదర్శన్). వీరు ముగ్గురూ దొంగతనాలు చేస్తూ బయటకి బిల్దప్స్ ఇచ్చుకొని బతుకుతూ ఉంటారు. అదే కాలనీలోకి ముంబై నుంచి వచ్చిన మోడల్ కుమారి(హేభ పటేల్) మొదటి చూపులోనే మన హీరో సిద్దుని చూసి ప్రేమలో పడుతుంటుంది. కుమారికి ఉన్న క్వాలిటీ తను అందరితోనూ ఫ్రెండ్ లా ఉంటూ, ఓపెన్ గా మాట్లాడటం. కొద్ది రోజులకి హీరో కూడా కుమారి ప్రేమలో పడతాడు. కానీ సిద్దు ఫ్రెండ్స్ మాత్రం తను మంచిది కాదని తనొక మోడల్ అని వాళ్ళు అవసరానికి వాడుకుంటారే తప్ప ప్రేమించరని చెప్తుంటారు.

దాంతో లేని పోనీ అనుమానాలు పెంచుకుంటూ వచ్చిన సిద్దు ఓ రోజు వేరే ఎవరి బైక్ మీదో వెళ్తుంటే నిలదీస్తాడు. దాంతో కుమారి తనని అర్థం చేసుకునే మెచ్యూరిటీ తనకు లేదని తన ప్రేమకి నో చెప్పి వెళ్లిపోతుంది. అదే టైంలో సిద్దు ఫ్రెండ్స్ కూడా కుమారిపైన కన్నేస్తారు. అక్కడి నుంచి సిద్దు తన ప్రేమని దక్కించుకోవడానికి, తన ప్రేమని తెలియజేయడానికి ఏమేమి చేసాడు? అసలు కుమారి ఎందుకు అంతలా బోల్డ్ గా ఉండటానికి కారణం ఏమిటి? అసలు ముంబై నుంచి కుమారి హైదరాబాద్ ఎందుకు వచ్చింది? అసలు కుమారి ముంబై కథ ఏమిటి? అలాగే సిద్దు ఫ్రెండ్స్ కుమారిని ఏమన్నా చేసారా? లేదా? అన్నది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిన కథ.

ప్లస్ పాయింట్స్ :

సుకుమార్ ఇప్పటివరకూ సున్నితమైన యూత్ఫుల్ కథలను చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. అదే తరహాలోనే ఒక యూత్ఫుల్ కథని మరింత బోల్డ్ గా చెప్పడానికి ట్రై చేసి, యూత్ ని మెప్పించిన సినిమానే ‘కుమారి 21F’. ఇప్పుడే యవ్వనంలోకి వచ్చిన నేటితరం యువతలోని భావాలను బేస్ చేసుకొని సుకుమార్ రాసిన ఈ ప్రేమకథ నేటి యువతను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కానీ సుకుమార్ దీనిలో ఎక్కువ భాగం అడల్ట్ కంటెంట్ మీద ఆధార పడ్డాడు. అడల్ట్ కంటెంట్ సినిమాకి ఎక్కువ అయినప్పటికీ ముందు బెంచ్ వారిని ఆకట్టుకొని థియేటర్స్ కి రప్పిస్తుంది. అలాగే సుకుమార్ ఓవరాల్ గా ఈ కథ ద్వారా చెప్పాలనుకున్న రెండు పాయింట్స్ మాత్రం సూపర్బ్ అనిపిస్తాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. రాజ్ తరుణ్ మొదటి రెండు సినిమాల్లో బాగా ఎనర్జిటిక్ గా కనిపించాడు. కానీ ఇందులో ఫస్ట్ హాఫ్ పరంగా సైలెంట్ గా కనిపించిన రాజ్ తరుణ్ సెకండాఫ్ లో తన మార్క్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రాజ్ తరుణ్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది. ఇకపోతే కుమారిగా కనిపించిన హేభ పటేల్ నటనతో బాగానే చేసింది అనిపించుకుంది. కానీ మోడ్రన్ అమ్మాయిగా మాత్రం సినిమా స్టార్ట్ టు ఎండ్ అందరినీ తన స్కిన్ షోతో ఆకట్టుకుంది. చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం హేభ పటేల్ స్కిన్ షో మీదే నడిపించారు అంటే మీరు ఏ రేంజ్ గ్లామర్ ట్రీట్ ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇక మెయిన్ రోల్స్ చేసిన వారిలో నవీన్, సుదర్శన్ లు తమ పంచ్ డైలాగ్స్ తో కాస్త నవ్విస్తూ వచ్చారు. నోయెల్ నెగటివ్ షేడ్స్ ని బాగా చూపించాడు.

కుమారి 21F అనే సినిమాకి బాగా హెల్ప్ అయిన పాయింట్స్ విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్ లో యూత్ ని ఆకట్టుకునే స్కిన్ షో, అడల్ట్ కంటెంట్ సినిమాకి హెల్ప్ అయితే సెకండాఫ్ లో మెయిన్ కథని నడిపించడం, చాలా విషయాలకు క్లారిటీ ఇవ్వడం మరియు క్లైమాక్స్ జస్టిఫికేషన్ ఇచ్చిన విధానం చాలా బాగుంది. అలాగే రాజ్ తరుణ్ – హేభ పటేల్ ల మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ బాగా నవ్విస్తాయి. సుకుమార్ బోల్డ్ కథని రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో మెట్టు పైకి తీసుకెళ్లాయని చెప్పాలి.

మైనస్ పాయింట్స్ :

కుమారి 21F అనేది ఓ బోల్డ్ కాన్సెప్ట్ అని ముందు నుంచి చెప్పుకొని వచ్చారు. కానీ చెప్పాలంటే ఈ సినిమాలో బోల్డ్ కానేప్ట్ ఏమీ లేదు, కానీ ఉన్న కాన్సెప్ట్ ని చెప్పడానికి బోల్డ్ సీన్స్ ని రాసుకున్నారు. హీరోయిన్ స్కిన్ షో అనేది ఎప్పుడూ అందంగా ఉండాలి కానీ ఇందులో హేభ ని చూపిన విశానం కొన్ని చోట్ల బాగా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అలాగే కథలో మరీ ఇంతలా ఎక్స్ పోజింగ్ సీన్స్ అవసరం లేదనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ పరంగా ఒరిజినల్ కథలోకి వెళ్ళలేదు, అలాగే హీరో, హీరోయిన్ పాత్రలు ఇవి, ఇలా బిహేవ్ చేస్తాయి అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు. సెకండాఫ్ లో సెకండ్ హీరోయిన్ ని పరిచయం చేసి నడిపించే సీన్స్ చాలా రెగ్యులర్ గా అనిపిస్తాయి.

ఇకపోతే సినిమా నేరేషన్ మొదటి నుంచి చివరి దాకా చాలా స్లోగా ఉంటుంది. ఎక్కడా స్పీడ్ గా వెళ్తున్నట్లు అనిపించదు. అలాగే సుకుమార్ కథనం విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. ఎందుకు అంటే సినిమాలో ట్విస్ట్ లు అనేవి ఏమీ లేవు, ట్విస్ట్ లు అనుకున్నవి సినిమా చూడడం మొదలు పెట్టిన కొద్ది సేపటికే ఆడియన్స్ ఊహించేయగలరు. ఇక ఈ సినిమాలో పాటలకి పెద్ద ఆస్కారం లేదు అనిపిస్తుంది. ఒకటి రెండు పాటలు తప్ప మిగతావి ఏవీ సినిమాకి అస్సలు అవసరం లేదు. మొదట్లో వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్, ఐటెం సాంగ్ లు సినిమాకి అవసరం లేదు. అలాగే రాజ్ తరుణ్ గత సినిమాల ఎఫెక్ట్ వలన ఈ సినిమాలో సూపర్బ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని అనుకుంటారు, కానీ ఆడియన్స్ ని బాగా నవ్వించే కామెడీ లేకపోవడం మైనస్.

సాంకేతిక విభాగం :

కుమారి 21F అనే సినిమాకి మెయిన్ సూత్రధారి సుకుమార్ కావున అక్కడి నుంచి మొదలు పెడతా.. సుకుమార్ ఈ సినిమా కోసం నేటి యువతరం భావాలను బేస్ చేసుకొని రాసుకున్న స్టొరీ లైన్ చాలా బాగుంది. అలాగే దానిని పూర్తి కథగా డెవలప్ చేసుకున్నప్పుడు కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ ని కూడా రాసుకున్నాడు. కానీ ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ అడల్ట్ కంటెంట్ ని రాసుకోవడం బాలేదు. అది కూడా కథని పక్కన పెట్టి ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ రొమాంటిక్ సీన్స్ మీదే దృష్టి పెట్టడం అంత బాలేదు. ఇకపోతే ఆయన రాసుకున్న కథనం బాగుంది, కానీ సూపర్బ్ అనేలా లేదు. అలా రాసుకొని ఉంటే సినిమా కూడా సూపర్బ్ అని అందరూ అనేవారు. స్క్రీన్ ప్లే లో లాగ్స్ ఉండడం వలన గుడ్ అనే రేంజ్ లోనే మిగిలిపోయింది. సుకుమార్ కథ – కథనాన్ని చాలా బాగా ప్రెజంట్ చేసాడు డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్. తను పేపర్ పై రాసుకున్న కొన్ని కీలక సన్నివేశాలను చాలా బాగా డీల్ చేసాడు. మెయిన్ గా క్లైమాక్స్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే నేరేషన్ విషయంలో కాస్త కేర్ తీసుకోవాల్సింది.

ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీతో మేజిక్ చేసాడని చెప్పాలి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండే కాలనీని చాలా రియలిస్టిక్ గాచూపిస్తూనే, విజువల్స్ ని చాలా బ్యూటిఫుల్ గా ఉండేలా చూసుకున్నాడు. చాలా సీన్స్ లో వాడుకున్న ఒర్జినల్ లైటింగ్ సినిమా మోద కి బాగా హెల్ప్ అయ్యింది. ఇక దేవీశ్రీ ప్రసాద పాటలు హిట్ అయ్యాయి, సినిమాలో చూడటానికి కూడా బాగున్నాయి, కానీ చాలా పాటలకి సందర్భం సింక్ అవ్వలేదు. పాటలను పక్కన పెడితే రత్నవేలు విజువల్స్ కి రీ రికార్డింగ్ తో ఓ అందమైన, వినసొంపైన రూపాన్ని తెప్పించాడని చెప్పాలి. ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. ఎడిటర్ అమర్ రెడ్డి ఇంకాస్త సినిమా కోసం వర్క్ చేసి కొన్ని అనవసర పాటలని, సీన్స్ ని కట్ చేసి ఉండాల్సింది. పొట్లూరి వెంకీ డైలాగ్స్ బాగున్నాయి. విజయ ప్రసాద్ – థామస్ రెడ్డి – సుకుమార్ కలిసి నిర్మించిన ఈ సినిమా నిర్మాణ విలువలు మాత్రం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఓ భారే బడ్జెట్ సినిమాకి ఉన్నట్టు ఈ సినిమా నిర్మాణ విలువలు ఉన్నాయి.

తీర్పు :

ప్రేమకథలను డిఫరెంట్ పంథాలో ప్రెజంట్ చేసే సుకుమార్ రచయితగా, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ హీరోగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కుమార్ 21F’ సినిమా నేటితరం యువతని అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా, యువతని థియేటర్స్ కి క్యూ కట్టేలా చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటి యువతకి ప్రేమపై ఉన్న ఒపీనియన్ ని బేస్ చేసుకొని తీయడం మరియు సినిమా ఫస్ట్ హాఫ్ లో అడల్ట్ సీన్స్ ఎక్కువగా ఉండడం యువతని ఆకర్షించే విషయం. ఫస్ట్ హాఫ్ లోని అడల్ట్ కంటెంట్, సెకండాఫ్ లో చెప్పిన స్టొరీ, క్లైమాక్స్ మరియు హేభ పటేల్ స్కిన్ షో సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ అయితే ఫస్ట్ హాఫ్ లో శృతి మించినట్టు అనిపించే స్కిన్ షో సీన్స్, కథనం, అక్కడక్కడా డ్రాగ్ చేసిన సీన్స్ మరియు సాంగ్స్ ప్లేస్ మెంట్ సినిమాకి మేజర్ మైనస్. ఓవరాల్ గా ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని చూడటానికి చాలా ఇబ్బడ్ని పడతారు కావున వారి నుంచి ఈ సినిమాకి ఆదరణ ఉండదు. కానీ యువతకి నచ్చే అంశాలు ఉన్న సినిమా కావడం వలన ఈ ‘కుమారి 21F’ ఈ వారం బాక్స్ ఆఫీసు వద్ద బాగానే కాసులను రాల్చుకుంటుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు