ఓటీటీ రివ్యూ : మా వింత గాధ వినుమా – ఆకట్టుకోలేకపోయిన కొత్త ప్రేమ కథ !

విడుదల తేదీ: నవంబర్ 13, 2020

123telugu.com Rating : 2.5/5

నటి నటులు : సిద్ధు జోన్నలగడ్డ, సీరత్ కపూర్, తనీకెల్లా భరణి

దర్శకత్వం : ఆదిత్య మండ‌ల

సంగీతం : శ్రీచరణ్ పాకాల

నిర్మాతలు :సంజయ్ రెడ్డి – అనిల్ పల్లాల- జి. సునీత- కీర్తి చిలుకూరి.

 

 

 

సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, శీర‌త్‌క‌పూర్ జంటగా ఆదిత్య మండ‌ల ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన `మా వింత గాధ వినుమా` సినిమా `ఆహా` వేదికగా తాజాగా విడుదల అయింది.
పెరిగాయి. సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ప్రేమ‌క‌థ‌ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

సిద్ధూ (సిద్ధు జోన్నలగడ్డ) లాంటి నిర్లక్ష్య స్వభావం ఉన్న అబ్బాయి వినీత (సీరత్ కపూర్)ను కొన్ని సంవత్సరాలు ప్రేమిస్తూ ఉంటాడు. అలాగే ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాడు. చివరికి వినీతా అతనికి యస్ చెబుతోంది. ఆ తరువాత కొన్ని సంఘటనల అనంతరం సిద్ధుతో కలిసి వినీత తన సోదరుడి (కమల్ కామరాజు) ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం గోవాకు వెళ్తుంది. అక్కడ కొన్ని విషయాలు అకస్మాత్తుగా మారతాయి. సిద్ధూ వినీత తాగిన మత్తులో వివాహం చేసుకుంటారు. ఆ పెళ్లి వీడియో వైరల్ అవుతుంది. దీంతో వీరి ప్రేమకథలో వీరి మధ్య చీలిక ఏర్పడి ఇద్దరు విడిపోతారు. అసలు వీళ్ళు ఎందుకు విడిపోయారు ? మరి సిద్ధు తన ప్రేమను తిరిగి ఎలా గెలుచుకున్నాడు ? అనేది మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో హీరోగా నటించిన సిద్ధు జొన్నలగడ్డ తన టైమింగ్‌ తో బాగానే ఆకట్టుకున్నాడు. ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేస్తూనే.. కొన్ని సన్నివేశాల్లో తన ఈజ్ యాక్టింగ్ తో బాగా ఆకట్టుకున్నాడు. ఇక కథానాయకిగా నటించిన శీర‌త్‌క‌పూర్ తనను తానూ ప్రూవ్ చేసుకోవడానికి అవసరం లేకపోయినా కాస్త ఎక్కువే పెర్ఫార్మెన్స్ చేసింది. అయితే ఆమె తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రం ఆకట్టుకుంది. సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి ఎప్పటిలాగే తన పాత్రలో బాగా నటించి ఈ చిత్రానికి కాస్త అదనపు ఆకర్షణ అయ్యాడు.

ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే మెయిన్ సాంగ్ బాగుంది. అలాగే మొదటి భాగంలో వచ్చే కొన్ని రొమాంటిక్ ఎపిసోడ్లు యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. సినిమాలో శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయింది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన హర్ష నవ్వించడానికి చాల కష్టపడ్డాడు. ఇక మరో ముఖ్యమైన పాత్రలో కనిపించిన ప్రగతి తన పాత్రలో ఎప్పటిలాగే ఎక్కువగా ఇన్ వాల్వ్ అయిపోయి మరీ నటించేసింది. ఫిష్ వెంకట్ బాగానే నవ్విస్తాడు. ఇక కమల్ కామరాజ్, కల్పిక గణేష్ సహాయక పాత్రలలో బాగా నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ప్రేమ‌క‌థ‌లో సరైన ఆకట్టుకునే కథే లేదు. దానికితోడు సిల్లీ కాన్ ఫ్లిక్ట్.. బలహీనమైన పాత్రలతో బోరింగ్ ట్రీట్మెంట్ తో ఈ సినిమా చాలా భాగం సాగుతోంది. ప్రథమార్ధంలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు బాగానే ఉన్నప్పటికీ, మిగిలిన చాలా సన్నివేశాలు బాగా నిస్తేజంగా అనిపిస్తాయి. దర్శకుడు కొన్ని లవ్ సీన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా.. సినిమా మాత్రం పెద్దగా ఆసక్తికరంగా సాగలేదు.

మెయిన్ గా సినిమాలో స్టోరీ చాలా వీక్ గా ఉండటం, దీనికి తోడు స్క్రీన్ ప్లే పరంగా కూడా సినిమాకి ఎక్కడా ప్లస్ కాకపోవడం.. స్క్రిప్ట్ లో బలం లేని సీన్స్ ఎక్కువైపోవడం.. అలాగే కథకు కొన్ని అనవసరమైన సీన్స్ ను ఇరికించడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. ఈ చిత్రం మొదటి అరగంట బాగా బోరింగ్.

కథానాయికను పార్టీకి తీసుకెళ్ళి, ప్రేమకథలోకి తీసుకువెళ్లడానికి దర్శకుడు అరగంటకు పైగా టైం తీసుకున్నాడు. మొత్తానికి దర్శకుడు కంటెంట్ పరంగా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం సినిమాని ఆ దిశగా నడిపలేకపోయారు. స్క్రిప్ట్ పై ఇంకా బాగా వర్క్ చేయాల్సింది. కనీసం టార్గెట్ ఆడియన్స్ కైనా సినిమా కనెక్ట్ అయ్యేది.

 

సాంకేతిక విభాగం :

సమకాలీన ప్రేమకథలలో వాస్తవ సంఘటనలకు తన శైలి ట్రీట్మెంట్ ఇచ్చి సినిమాని తీయాలనుకున్న దర్శకుడు ఉద్దేశం మంచిదే కానీ, కాకపోతే ఆయన అనుకున్న పాయింట్ కి తగ్గ సరైన కథాకథనాలను రాసుకోవడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కీలక దృశ్యాలతో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా అందంగా చూపించారు. ఇక సంగీత విషయానికి వస్తే.. రెండు పాటలు బాగున్నా… నేపధ్య సంగీతం పర్వాలేదనిస్తోంది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఇక ఈ చిత్రానికి నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.

 

తీర్పు :

‘మా వింత గాధ వినుమా` అంటూ వచ్చిన ఈ సినిమాలో కథ కంటే కూడా.. గాథే ఎక్కువ ఉంది. ఓవరాల్ గా ఆదిత్య మండ‌ల దర్శకత్వంలో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, శీర‌త్‌క‌పూర్ లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే హీరోహీరోయిన్ల ట్రాక్ లో వచ్చే నేటి ప్రేమ తాలూకు కొన్ని బోల్డ్ సన్నివేశాలు, ప్రధానంగా సిద్ధు నటన బాగున్నాయి. కానీ, కథా కథనాలు ఆసక్తి కరంగా సాగక పోవడం, సినిమాలో సరైన ప్లో మిస్ అవ్వడంతో సినిమా బోర్ కొడుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోలేక పోయినా.. ఇలాంటి సినిమాలను ఇష్టపడే వర్గం ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ కలిగిస్తోంది.

123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team

 

Click Here For English Review

సంబంధిత సమాచారం :