సమీక్ష : మ్యాడీ – బోరింగ్ అండ్ బోల్డ్ లవ్ స్టోరీస్ !

Mad movie review

విడుదల తేదీ : ఆగస్టు 06, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2/5

నటీనటులు : రజత్ రాఘవ్, స్పందన పల్లి, మాధవ్ చిలుకూరి, శ్వేత వర్మ

దర్శకుడు: లక్ష్మణ్ మేనేని

నిర్మాతలు : టి. వేణుగోపాల్ రెడ్డి, బి. కృష్ణా రెడ్డి & మిత్రులు
సంగీత దర్శకుడు : మోహిత్ రెహ్మానియాక్

ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “మ్యాడ్”. మోదెల టాకీస్ బ్యాన‌ర్ పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి మరియు మిత్రులు నిర్మాత‌లుగా లక్ష్మణ్ మేనేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

కథ :

మ్యాడీ (మాధవ్ చిలుకూరి) ఒక ప్లే బాయ్. అమ్మాయిలతో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మాధురి (స్పందన పల్లి) ప్రేమ అంటే రెండు మనసులు కలవాలి, శరీరాలు కాదు అని నమ్మే అమ్మాయి. పూర్తి వ్యతిరేక భావజాలం ఉన్న వీరిద్దరికీ పెళ్లి అవుతుంది. ఆపోజిట్ ఆలోచనలు మరియు భావజాలం ఉన్న వీరిద్దరి కాపురం ఎలా సాగింది ? మాధురి ఆలోచనలు ఎందుకు అలా ఉన్నాయి ? అసలు రాహుల్ అనే వ్యక్తితో ఆమె గతం ఏమిటి ? ఈ మధ్యలో మ్యాడీ ఫ్రెండ్ అరవింద్ (రజత్ రాఘవ్), అఖిలా (శ్వేతవర్మ) బోల్డ్ ప్రేమ కథ ఎలా సాగింది ? చివరకు ఈ రెండు జంటల ప్రేమకథలు ఎలా ముగిశాయి ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో హీరోగా నటించిన మాధవ్ చిలుకూరి ఈజ్ తో సెటిల్డ్ గా నటించాడు. ముఖ్యంగా మొదటి భాగంలో సాగే కీలక సన్నివేశాల్లో గాని, హీరోయిన్ తో సాగే ప్రేమ సన్నివేశాల్లో గాని, అతని నటన బాగుంది. సెకండ్ హాఫ్ లో భావోద్వేగాలను కూడా ఎమోషనల్ గా బాగా పండించాడు. ఇక మరో హీరోగా నటించిన రజత్ రాఘవ్ నటన చాలా బాగుంది. అతని టైమింగ్ కూడా మంచి ఫన్ ను జనరేట్ చేసింది.

ఇక హీరోయిన్స్ గా నటించిన స్పందన పల్లి, శ్వేతవర్మల నటన సినిమాకి ప్లస్ అయింది. శ్వేతవర్మ తన నటనతోనూ అలాగే తన గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఫాదర్ పాత్రలో నటించిన నటుడు కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోయినా ప్రతిభావంతమైన కొందరు నటీనటులు ఉన్న ఈ చిత్రంలో వాళ్ళు తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

సినిమా పేరులో ఉన్న కొత్తదనం సినిమాలో లేదు. యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలు పెడుతున్నామనుకొని దర్శకుడు ఓవర్ గా ఎక్స్ పోజ్ చేయించి, అనవసరమైన రొమాన్స్ ను ఇరికించాడు. కొన్ని షాట్స్ మినహా అవి కూడా బోర్ గానే సాగాయి. హ్యాపీగా ఎంజాయ్ చేసే హీరోకి, పెళ్లి అనేది శృంగారానికి లైసెన్స్ కాదు అని నమ్మే హీరోయిన్ కి మధ్య సీన్స్ చాలా బాగా రాసుకోవచ్చు.

హీరోయిన్ క్యారెక్టర్ కు పూర్తి ఆపోజిట్ లో ఉండే హీరో క్యారెక్టర్.. ఈ కాన్ ఫ్లిట్ చాలు, సన్నివేశాలను ఆసక్తికరంగా రాసుకొని సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ పుట్టించడానికి, కానీ దర్శకుడు ఈ పాయింట్ ను బలంగా ఎలివేట్ చేసే సీన్స్ ను రాసుకోకుండా విషయం లేని మరియు ఇంట్రెస్ట్ గా సాగని సీన్స్ తో సినిమాని చాలా బోర్ గా మలిచాడు.

దీనికి తోడు బలం లేని కథలో బలహీన పాత్రలను సృష్టించి సినిమా మీద కలిగే కనీస ఇంట్రెస్ట్ కూడా కలగకుండా చేశారు. నటుల నటన బాగున్నా వాళ్ళ పాత్రల్ని తీర్చిదిద్దిన తీరు సినిమాని బలహీనపరిచింది. హీరో పాత్ర ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ కాకపోగా చిరాకు కలిగిస్తుంది. ఇక ప్రతి సన్నివేశం రొటీన్ వ్యవహారాలతోనే చాలా ఊహాజనితంగా సాగుతుంటుంది.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు లక్ష్మణ్ మేనేని దర్శకుడిగా కొన్ని చోట్ల పర్వాలేదనిపించినా.. రచయితగా పరిపూర్ణంగా విఫలం అయ్యాడు. ఆయన రాసుకున్న స్క్రిప్ట్ లో ఏ మాత్రం విషయం లేదు. కాకపోతే మెయిన్ పాయింట్ బాగుంది. సంగీత దర్శకుడు మోహిత్ రెహ్మానియాక్ అందించిన సంగీతం బాగాలేదు. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాలా వరకు బోర్ తగ్గేది. సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కొన్ని విజువల్స్ ను చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఇక నిర్మాతలు టి. వేణుగోపాల్ రెడ్డి, బి. కృష్ణా రెడ్డి పాటించిన నిర్మాణ విలువలు పర్వాలేదు.

తీర్పు:

‘పెళ్లి, సహజీవనం’ మధ్య నలిగిపోయే రెండు జంటల కథతో వచ్చిన ఈ “మ్యాడ్”లో ఆకట్టుకునే అంశాలు పెద్దగా లేవు. ప్రేమ కథలని డీల్ చేసేటప్పుడు కథ, కథనం, పాత్రలు, సన్నివేశాలు ప్రేక్షకుల్ని సినిమాలో లీనమయ్యేలా చేయాలి, సీన్స్ నడిచే కొద్దీ ఫీల్ ఎలివేట్ అవడం ప్రేమ కథల కనీస బాధ్యత. కానీ ఈ సినిమా వ్యవహారం అలా సాగ లేదు. కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఓకే అనిపించినా బలహీనమైన కథాకథనాలు, ఇంట్రెస్ట్ గా సాగని ప్లే, కనెక్ట్ కానీ సీన్స్ ఈ సినిమాని బలహీన పరిచాయి. మొత్తమ్మీద ఈ రెండు జంటల ప్రేమకథ ప్రేమికులకు కూడా నచ్చదు.

123telugu.com Rating :  2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :