సమీక్ష : మాస్టర్ – విజయ్ ఫ్యాన్స్ కు మాత్రమే !

Master movie review

విడుదల తేదీ : జనవరి 13, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.75/5

నటీనటులు : విజయ్, విజయ్ సేతుపతి, మాలవికా మోహనన్, ఆండ్రియా జెరెమియా

దర్శకత్వం : లోకేష్ కనగరాజ్

నిర్మాత‌లు : గ్జావియర్ బ్రిట్టో

సంగీతం : అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫర్ : సత్యన్ సూర్యన్

ఎడిట‌ర్‌ : ఫిలోమిన్ రాజ్

తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘మాస్టర్’. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో నటించాడు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

జేడీ (విజయ్) కాలేజీ ప్రొఫెసర్. ఆ కాలేజీ స్టూడెంట్స్ అంతా జేడీ ఫాలోవర్స్ గా ఉంటారు. అది కాలేజీ మేనేజ్మెంట్ కి నచ్చదు. దానికితోడు వ్యక్తిగతంగా కూడా జేడీ ఫుల్ గా తాగుతూ టైం పాస్ చేస్తుంటాడు. ఈ క్రమంలో కాలేజీ ఎలెక్షన్స్ రావడం.. వాటిల్లో జేడీ సపోర్ట్ తో జేడీ మనిషి గెలవడం, మరోపక్క భవానీ(విజయ్ సేతుపతి) జీవితంలో ఎదురైన కొన్ని పరిస్థితులు కారణంగా అతను రాక్షసుడుగా మారతాడు. పైగా పిల్లలను అడ్డు పెట్టుకుని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతూ ఉంటాడు. ఈ క్రమంలో కొన్ని ఊహించని సంఘటనల మధ్య భవానీకి అడ్డుగా జేడీ నిలుస్తాడు ? భవానీ నుండి పిల్లలను సేవ్ చేయడానికి జేడీ ఎలాంటి ప్రయత్నం చేస్తాడు. దాంతో జరిగే కొన్ని నాటకీయ పరిణామాలు ఏమిటి ? ఈ మధ్యలో అలాగే చివరకు ఏమి జరిగింది అనేదే మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంతో విజయ్ మళ్ళీ పాత విజయ్ ను గుర్తుకుతెచ్చాడు. మాస్టర్ పాత్రలో నటించిన ఆయన, తన పాత్రకు తగ్గట్లు తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవడం చాలా బాగుంది. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఆయన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో, తన మార్క్ యాక్టింగ్ తో స్టయిల్ తో సినిమాకి హైలెట్ గా నిలచారు. అలాగే తన కామెడీ టైమింగ్ తోనూ విజయ్ అక్కడక్కడ నవ్విస్తారు.

మరో కీలక పాత్రలో నటించిన విజయ్ సేతుపతి ఎప్పటిలాగే తన గంభీరమైన నటనతో పాటు తన కామెడీ టైమింగ్ తోనూ ఆకట్టుకున్నారు. ఇక సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటించిన ఆండ్రియా తన పాత్ర పరిధిలో కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపించినా తమ నటనతో ఆకట్టుకుంటుంది.

మిగిలిన నటీనటులు కూడా బాగా చేశారు. ముఖ్యంగా విలన్ గా నటించిన విజయ్ సేతుపతి చాలా బాగా చేశాడు. క్రూరత్వంతో కూడుకున్న ఒక బలమైన విలన్ గా ఆయన నటన బాగుంది. ఇక డైరెక్టర్ విజయ్ స్టైల్ ని, మ్యానరిజం ను పూర్తిగా వాడుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దాంతో ఈ చిత్రం విజయ్ అభిమానులను బాగానే అలరిస్తోంది.

 

మైనస్ పాయింట్స్ :

 

దర్శకుడు లోకేష్ కనకరాజ్ పరిస్థితులను బట్టి మారిపోయే మనిషికి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. చాలా సన్నివేశాలను ఆయన నెమ్మదిగా నడిపి బోర్ కొట్టించారు. హీరో, విలన్ల మధ్యన వచ్చే పగ తాలూకు సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా ఉండవు. దీనికి తోడు సినిమాలోని సెకెండ్ హాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాలు చాలా సాగతీతగా అనిపిస్తాయి.

మొదటి భాగంలో విజయ్ కాలేజీ ప్రొఫెసర్ ట్రాక్ సరదాగా సాగినప్పటికీ.. సినిమాలో అసలుయూ లవ్ ట్రాక్ కూడా లేదు. లవ్ యాంగిల్ ను ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా, దర్శకుడు మాత్రం ఎందుకో అసలు లవ్ ట్రాక్ ను పూర్తిగా వదిలేశాడు. అలాగే కామెడీ కూడా యాక్షన్ ప్లో కి అడ్డు అనుకున్నాడేమో సెకండ్ హాఫ్ లో కనీసం ఆ కామెడీ కూడా సరిగ్గా వాడుకోలేదు.

పైగా సినిమాలో అక్కడక్కడ తమిళ నేటివిటీ కూడా ఎక్కువుగా కనిపిస్తోంది. ఆర్టిస్ట్ ల దగ్గరనుంచి వారి హావాభావాలు దాకా తమిళ వాసనలు స్పష్టంగా కనిపిస్తాయి. మొత్తానికి దర్శకుడు కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. లోకేష్ కనకరాజ్ మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.

 

సాంకేతిక విభాగం :

 

దర్శకుడు లోకేష్ కనకరాజ్ కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన కథా కథనాలని రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు అందించిన పాటలు మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకున్నే విధంగా లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాలో కాలేజ్ ప్రొఫెసర్ గా విజయ్ చాలా బాగా ఆకట్టుకున్నాడు. అలాగే విలన్ గా విజయ్ సేతుపతి మరోసారి మెప్పించాడు. అయితే సినిమా మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. చిత్రంలో కొన్ని మెప్పించే అంశాలు ఉన్నప్పటికీ, ముఖ్యమైన కథనం నెమ్మదిగా సాగడం, సినిమాలో మెయిన్ థీమ్ కు తగట్లు ట్రీట్మెంట్ లేకపోవడం, ఆకట్టుకునే విధంగా సన్నివేశాలను రూపొందించలేకపోవడం, సినిమాలో కొన్ని సన్నివేశాలు తెలుగు నేటివిటీకి కొంచెం దూరంగా అనిపించడం.. వంటి అంశాలు సినిమాకు బలహీనతలుగా నిలుస్తాయి.

అయితే, విజయ్ మార్క్ యాక్టింగ్, యాక్షన్ సన్నివేశాలు అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కానీ దర్శకుడు కేవలం విజయ్ అభిమానులను మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమా చేసినట్లు అనిపిస్తోంది. ఓవరాల్ గా ఈ సినిమా మాములు ప్రేక్షకుల్ని పూర్తిగా మెప్పించదు. విజయ్ అభిమానులకు మాత్రమే ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.

123telugu.com Rating :  2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :