సమీక్ష : మిస్టర్ హోమానంద్ – ఇతన్ని కలవకపోవడమే మంచిది

సమీక్ష : మిస్టర్ హోమానంద్ – ఇతన్ని కలవకపోవడమే మంచిది

Published on Jun 29, 2018 3:50 PM IST
Mr Homanand movie review

విడుదల తేదీ : జూన్ 29, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

నటీనటులు : హోమానంద్, పావ‌ని, ప్రియాంక శర్మ త‌దిత‌రులు

దర్శకత్వం : జై రామ్ కుమార్

నిర్మాత : ఎం.ఇంద్ర సేనారెడ్డి

సంగీతం : భోలే షావళి

సినిమాటోగ్రఫర్ : మురళీ వై కృష్ణ

స్క్రీన్ ప్లే : జై రామ్ కుమార్

హోమానంద్, పావ‌ని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిస్టర్ హోమానంద్’. జై రామ్ కుమార్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ :

హోమానంద్ (హోమానంద్) తన తండ్రి ఆఖరి కొరిక మేరకు ఎంతో కష్టపడి డ‌బ్బులు పోగుచేసి ఓ ఇల్లు కొంటాడు. కానీ ఆ ఇంట్లో ఓ దెయ్యం ఉంటుంది. హోమానంద్ ని ఇంట్లో నుండి వెళ్లగొట్టడానికి దెయ్యం అతన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ ఉండగా, హోమానంద్ ఇంట్లో నుంచి ఆ దెయ్యాన్నే వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతని ప్రేయసి కూడ అతడ్ని అపార్థం చేసుకుంటుంది.

మరి హోమానంద్ ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడా ? అసలు ఆ దెయ్యం ఆ ఇంట్లోనే ఎందుకు ఉంది ? హోమానంద్ ఇల్లు కొనడానికి ఎంత కష్టపడ్డాడు ? చివరకి ప్రేమించిన పావనిని దక్కించుకున్నాడా ? అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్:

మొదటి సారి హీరోగా నటించిన హోమానంద్ లుక్స్ పరంగా బాగానే ఉన్నాడు. అసలు హీరో పిసినారిగా మారి ఒక్కో రూపాయి కూడబెట్టి తండ్రి కోరిక మేరకు ఇల్లు కొనడం అనే కాన్సెప్ట్ కొంత ఎమోషనల్ గా టచ్ చేస్తుంది. హీరో తండ్రిగా సుమన్ నటన కొంత మెప్పించింది.

కమెడియన్ రఘు కారుమంచి తన కామెడీ టైమింగ్‌ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. అలాగే దెయ్యంగా నటించిన ప్రియాంక శర్మ అటు భయపెడుతూ ఇటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. హీరోయిన్ గా చేసిన పావని కూడా తన గ్లామర్ తో ఎంటర్టైన్ చేసింది. హీరోకి, హీరోయిన్ కుటుంబానికి మధ్య నడిచే కొన్ని కామెడీ సీన్స్ నవ్వించాయి.

మైనస్ పాయింట్స్:

సినిమాలో అడుగడుగునా ఒక లోపం కనిపిస్తుంది. చిన్నపాటి లైన్ ను పట్టుకుని దాని చుట్టూ రచయిత
శ్రీ హరి చీమలమర్రి రాసిన కథ, దానికి దర్శకుడు తయారుచేసుకున్న కథనం, ఆయన సృష్టించిన పాత్రలు కొంచెం కూడ ఎంటర్టైన్ చేయలేకపోయాయి. ఓపెనింగ్ సీన్ నుండే సినిమా వ్యవహారం అవగతమైపోతుంది. మొదటి అర్థ భాగం మొత్తాన్ని సంబంధంలేని సన్నివేశాలతో నింపిన డైరెక్టర్ ద్వితీయార్థాన్ని మరీ కష్టంగా తయారుచేశారు.

కారణాలు ఏవైనా దర్శకుడి పనితీరు మాత్రం సినిమా మొదలుపెట్టాం ఎలాగోలా పూర్తిచేస్తే పనైపోతుంది అనేలా ఉంది. చిత్రంలో ఎక్కడా ఇదిగో ఈ షాట్ బాగా తీశారు, ఫలనా సన్నివేశాన్ని, పాత్రని ఎంటెర్టైనింగా రాశారు అని చెప్పడానికి వీలు దొరకలేదు. హీరో ఇంట్లో ఉండే దెయ్యం అతన్ని భయపెట్టడం, ఆ సన్నివేశాల తాలూకు కెమెరా వర్క్, గ్రాఫిక్స్ థ్రిల్ ఇవ్వకపోగా తలనొప్పి పుట్టేలా చేశాయి. మధ్యలో వచ్చే పాటలైతే సినిమాపై ఇంకాస్త విసుగును పెంచాయి.

హీరో లుక్స్ పరంగా బాగానే ఉన్నా నటనలో మాత్రం చాలా చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఫైట్స్, డ్యాన్సుల్లో మ్యానరిజం ఎలా మైంటైన్ చేయాలి, కెమెరా ముందు తడబడకుండా, ఎలాంటి బాడీ లాంగ్వేజ్ చూపాలో తెలుసుకోవాలి.

సాంకేతిక విభాగం :

దర్శకుడు జై రామ్ కుమార్ దర్శకుడిగా పెద్దగా ప్రతిభ కనబర్చలేకపోయారు. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కారణాన్ని రాయలేకపోయిన ఆయన కనీసం సన్నివేశాలనైనా సరిగ్గా రాసుకుని ఉండాల్సిందే. దానికి తోడు టేకింగ్ కూడ కనీస స్థాయిలో లేకపోవడంతో తుది ఫలితం తలకిందులైంది.

ఇక రచయితా శ్రీహరి రాసిన కథలో సహజత్వంతో పాటు కనీస విషయం కూడా లేదు. మురళీ వై కృష్ణ కెమెరా పనితనం ఏమాత్రం ఇంప్రెస్ చేయలేకపోయింది. వెంకటేష్ అద్దంకి అందించిన నేపధ్య సంగీతం, భోలే షావళి పాటల సంగీతం కొంచెం కూడ ఆకట్టుకోలేదు. ఎడిటర్ పనితరం సరిగా లేదు. నిర్మాతలు చిత్రంపై ఇంకాస్త శ్రద్ద వహించి ఉండాల్సింది.

తీర్పు:

ఈ వారం పలు చిత్రాలతో పోటీ పడుతూ విడుదలైన ఈ చిత్రం పోటీలో ఏమాత్రం నిలబడే స్థాయిలో లేదనే చెప్పాలి. అక్కడక్కడా నవ్వించిన కామెడీ మినహా ఈ చిత్రం నుండి పొందడానికి ఏమీ లేదు. ఆకట్టుకోలేకపోయిన కథనం, కనీస స్థాయిలో కూడ లేని దర్శకత్వం, ఇంప్రెస్ చేయలేకపోయిన సన్నివేశాలు, పాత్రలు అన్నీ కలిసి ప్రేక్షకుడ్ని ఇబ్బందిపెట్టేలా సినిమాను తయారుచేశాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ వారాంతంలో ఈ హోమానంద్ ను కలవకపోవడమే మంచిది.

123telugu.com Rating : 1.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు