సమీక్ష : నా బంగారు తల్లి – ఓ తండ్రి కూతుళ్ళ యదార్థ గాధ.!

సమీక్ష : నా బంగారు తల్లి – ఓ తండ్రి కూతుళ్ళ యదార్థ గాధ.!

Published on Nov 21, 2014 3:30 PM IST
 na-bangaru-thalli-review విడుదల తేదీ : 21 నవంబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : N/A
దర్శకత్వం : రాజేష్ టచ్ రివర్
నిర్మాత : సునీత కృష్ణన్ – రాజేష్
సంగీతం : శరత్ & శంతను మొయిత్ర
నటీనటులు : అంజలి పాటిల్, సిద్దిక్…

61వ నేషనల్ అవార్డ్స్ లో తెలుగు నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు స్పెషల్ మెన్షన్ అవార్డ్స్ అందుకున్న సినిమా ‘నా బంగారు తల్లి’. అంతే కాకుండా ఇండోనేషియన్, ట్రినిటీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో కూడా అవార్డ్స్ గెలుచుకుంది. ఈ చిత్ర టీం ఈ రోజు ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నేషనల్ అవార్డ్స్ అయితే గెలుచుకుంది, మరి తెలుగు ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ :

‘నా బంగారు తల్లి’ సినిమా ఓ బ్రోతల్ హౌస్ లో మొదలవుతుంది.. అక్కడి నుంచి దుర్గ(అంజలి పాటిల్) తప్పించుకోవాలని చూస్తుంది. కానీ తప్పించుకోలేక మళ్ళీ వారికి దొరికిపోతుంది. అక్కడి నుంచి కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్..

అది అమలాపురం.. దుర్గ 10వ తరగతి గవర్నమెంట్ స్కూల్ లో చదివి రాష్ట్రంలో 8వ ర్యాంక్ సాధిస్తుంది. దుర్గ అంటే వాళ్ళ నాన్న శ్రీనివాస్(సిద్దిక్)కి ప్రాణం. 10వ తరగతి పూర్తి చేసుకున్న దుర్గ తన తదుపరి చదువును హైదరబాద్ లో చదవాలనుకుంటుంది. కానీ వాళ్ళ నాన్న అస్సలు ఒప్పుకోడు. కానీ దుర్గ వాళ్ళ నాన్నకి తెలియకుండా హైదరబాద్ కాలేజ్ లో సీటు కి అప్లై చెయ్యడం, ఇంటర్వ్యూ కాల్ రావడం చకచకా జరిగిపోతాయి. కట్ చేస్తే దుర్గ హైదరబాద్ లో ఉన్న వాళ్ళ నాన్నని కలిసి కాలేజ్ లో చేరాలని అమలాపురం నుంచి హైదరబాద్ బయలుదేరుతుంది.

కానీ హైదరబాద్ వెళ్ళిన మొదటి రోజే దుర్గ ఓ బ్రోతల్ గ్యాంగ్ కి దొరుకుతుంది. అక్కడి నుంచి పది రోజులు తనని సిటీలోని పలువురు పెద్దలు రోజూ అప్లు రకాలుగా చిత్రవధ చేస్తుంటారు. ఆ పది రోజుల టైంలో దుర్గకి వాళ్ళ నాన్న గురించి ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అసలు దుర్గకి తెలిసిన న్యూస్ ఏమిటి.? ఆ వ్యభిచార కూపంలో నుంచి దుర్గ బయటపడిందా.? ఒకవేళ బయటపడి ఉంటే తన తండ్రి గురించి తెలుసుకున్న తను ఏం చేసింది.? అన్నది మీరు వెండితెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

61వ నేషనల్ అవార్డ్స్ లో 3 అవార్డులు గెలుచుకోవడమే ఈ సినిమాకి ఉన్న మొదటి ప్లస్ పాయింట్. ఇదొక యదార్థ సఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా కావున అందరూ ఆ సంఘటన ఏమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమాకి వస్తారు. సో ఆ పాయింట్ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ గురించి చెబుతా..

నటనలో బెస్ట్ మెన్షన్ గా నేషనల్ అవార్డు అందుకున్న అంజలి పాటిల్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. డైరెక్టర్ రాసుకున్న పాత్రకి తన వంతు న్యాయం చేసింది. ముఖ్యంగా బ్రోతల్ హౌస్ లో వచ్చే సీన్స్ లో తన హావభావాలు చాలా బాగున్నాయి. అలాగే కొన్ని సీన్స్ లో తప్పు జరిగినప్పుడల్లా రౌడీగా బిహేవ్ చేసే యాటిట్యూడ్ కూడా బాగుంది. ఇక ఫాదర్ గా కనిపించిన సిద్దిక్ నటన కూడా కథకు తగ్గట్టుగా ఉంది. రత్నశేఖర్ రెడ్డి చేసింది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో బాగా చేసింది. ఇక సినిమా పరంగా చెప్పాలంటే సెకండాఫ్ లో కొన్ని సీన్స్ ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తిని కలిగిస్తాయి. సినిమా ఇంటర్వల్ లో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది కానీ కొందరు మాత్రం ఈ ట్విస్ట్ ని స్టార్టింగ్ లోనే గెస్ చేసెయ్యగలరు.

మైనస్ పాయింట్స్ :

ఇదొక నేషనల్ అవార్డు సినిమా కాబట్టి మనస్పూర్తిగా ఈ సినిమాలోని తప్పులు చెప్పలేకున్నాం.. ఎందుకంటే నేషనల్ అవార్డు వచ్చిన ఫిల్మ్ కి మీరు తప్పులు చెప్పడం ఏమిటి అని కొందరు అనుకోవచ్చు.. ఇక మైనస్ పాయింట్స్ లోకి వెళితే.. సినిమాలో ఒక యదార్థ సంఘటనని తీసుకొని రాసుకున్నారు కానీ ఇందులో ఆ ఒక్క ఇన్సిడెంట్ గురించి తప్ప మరే విషయాన్నీ చెప్పకపోవడంతో సినిమా అంతా అయిపోయాక కేవలం ఈ ఇన్సిడెంట్ ని విజువల్ గా చూపించడానికే ఈ సినిమా తీసాడా అని ఆడియన్స్ నిరాశకి గురవుతారు. కథ – స్క్రీన్ ప్లే ఆడియన్స్ ని ఏ కోశానా ఆకట్టుకోలేదు.

రియల్ ఇన్సిడెంట్ నుంచి కథని రాసుకుంటే ఆ ఇన్సిడెంట్ లోని బాధని లేదా పెయిన్ ని ఆడియన్స్ ఫీలయ్యేలా డైరెక్టర్ తీయగలిగినప్పుడే ఆ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది కానీ డైరెక్టర్ అది మిస్ చేసాడు. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది.. అస్సలు ఆసక్తికరంగా సాగదు. మళ్ళీ సెకండాఫ్ లో చూపించే చాలా సీన్స్ కూడా ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కాకపోవడంతో ఆడియన్స్ చాలా నీరసంగా సినిమా చూస్తారు. క్లైమాక్స్ లో కూడా సరైన ముగింపు లేకుండా ఫినిష్ చేసినట్టు ఫీలవుతున్నారు. ఇకపోతే రెగ్యులర్ మూవీ లవర్స్ కోరుకునే, కామెడీ గానీ, పాటలు గానీ(అంటే పాటలు ఉన్నాయి కానీ మీరు కోరుకునేలా ఉండవని నా ఉద్దేశం), యాక్షన్ సీన్స్ గానీ ఉండవు. ఓవరాల్ గా ఆడియన్స్ వావ్ ఇది బాగుంది ఈ సినిమాలో అని చెప్పుకునేలా ఏమీ లేవు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో చెప్పుకోదగిన అంశాలు ఏమీ లేవు. సినిమాటోగ్రాఫర్ రామ తులసి రియలిస్టిక్ గా ఉండాలని చాలా చోట్ల లైటింగ్ సరిగా వాడలేదు. మిగతా చోట్ల కూడా పెద్ద చెప్పుకునే స్థాయిలో అతని విజువల్స్ లేవు. ఇక డాన్ మాక్స్ చేసిన ఎడిటింగ్ సరిగాలేదు. చాలా చోట్ల లాజికల్ గ్యాప్ లు ఉండడమే కాకుండా బాగా సాగదీసినట్టుగా సినిమా ఉంటుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు పనిచేసారు. అందులో శరత్ అందించిన పాటలు సినిమా పరంగా పెద్దగా హెల్ప్ కాలేదు. అలాగే శాంతను మొయిత్ర అందిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్ కి కి సినిమాని పెద్దగా కనెక్ట్ చేయలేకపోయింది. కానీ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని నేషనల్ అవార్డు వచ్చింది అంది ఎందుకు వచ్చిందో నాకైతే తెలియడం లేదు, మీరు కూడా అడగకండి. రీ రికార్డింగ్, డబ్బింగ్ అన్నీ చాలా నాశిరకంగా ఉన్నాయి. సురేష్ రాసిన డైలాగ్స్ బాగున్నాయి.

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వ బాధ్యతలను రాజేష్ టచ్ రివర్ డీల్ చేసాడు. కథ – అతనికి తెలిసిన ఓ రియల్ ఇన్సిడెంట్ ని మాత్రమే కథ అనుకున్నాడు, దాని ద్వారా ఏమీ చెప్పలేదు, చెప్పాలనికూడా అనుకున్నట్టు లేడు. కథనం – వెరీ స్లో, అంతకు మించి మీ ఊహకు మించి అక్కడ ఏమీ జరగదు. దర్శకత్వం – ఒక డైరెక్టర్ గా మాత్రం నటీనటుల నుంచి మంచి నటనని రాబట్టుకున్నాడు. ఈ సినిమా నిర్మాణ విలువలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.

తీర్పు :

3 నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న ‘నా బంగారు తల్లి’ సినిమా అక్కడ నేషనల్ అవార్డు బోర్డు మెంబర్స్ మనసు గెలుచుకున్నట్టే, మన తెలుగు వారి ప్రేక్షకులను కూడా మెప్పించింది. ఎందుకంటే ఇది ఓ స్త్రీ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా కావున ప్రతి ఒక్కరూ మనం ఏమైనా తప్పు చేస్తే ఆ తప్పు వల్ల జరిగే అనర్ధాలను మన పిల్లలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే పాయింట్ మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను కోరుకునే ఆడియన్స్ ని పెద్దగా మెప్పించక పోవచ్చు కానీ యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలను ఇష్టపడే వారికి, ఆర్ట్ సినిమాలు ఇష్టపడేవారికి మాత్రం ఈ సినిమా బాగా నచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా నటీనటుల పెర్ఫార్మన్స్, అక్కడక్కడా మీ మనసుని కలిచి వేసే సన్నివేశాలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి కావున ‘నా బంగారు తల్లి’ సినిమాని మీరు ఓ సారి చూస్తే మీ పిల్లల భవిష్యత్తుకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ :  ఇప్పటికే 3 నేషనల్ అవార్డ్స్ గెలుచుకుని, పలువురు నుంచి ప్రశంశలు అందుకున్న సినిమా ‘నా బంగారు తల్లి’. ఇదొక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడం వలన అన్ని రెగ్యులర్ సినిమాలకు రేటింగ్ ఇచ్చినట్టు ఈ సినిమాకు 1 నుంచి 5 లోపు రేటింగ్ ఇవ్వలేము. ‘అందుకే మేము ‘నా బంగారు తల్లి’ సినిమాకి రేటింగ్ ఇవ్వడం లేదు.

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు