సమీక్ష : నా నువ్వే – పూర్తిస్థాయిలో మెప్పించలేదు

సమీక్ష : నా నువ్వే – పూర్తిస్థాయిలో మెప్పించలేదు

Published on Jun 16, 2018 11:55 AM IST
 Naa Nuvve movie review

విడుదల తేదీ : జూన్ 14, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : కళ్యాణ్ రామ్, తమన్నా

దర్శకత్వం : జయేంద్ర

నిర్మాత : కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి, మహేష్ కోనేరు

సంగీతం : శరత్

సినిమాటోగ్రఫర్ : పి.సి. శ్రీరామ్

ఎడిటర్ : టి.ఎస్ సురేష్

స్క్రీన్ ప్లే : జయేంద్ర

కళ్యాణ్ రామ్, తమన్నాలు జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘నా నువ్వే’. జయేంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :
ఆర్జేగా పనిచేసే మీరా (తమన్నా) డెస్టినీ మూలంగా వరుణ్ (కళ్యాణ్ రామ్) అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. వరుణ్ కూడ మీరా తన మీద పెంచుకున్న ప్రేమను చూసి కన్విన్స్ అయి ప్రేమిస్తాడు. కానీ వాళ్ళ ప్రేమకు అనుకోని కష్టం ఎదురవుతుంది. వరుణ్ మీరాకు దూరంగా వెళ్లిపోతాడు.

దాంతో మీరా ఎలాగైనా వరుణ్ ను కలుసుకోవాలని ఏకధాటిగా 36 గంటలపాటు లైవ్ రేడియో షో చేస్తుంది. అసలు వరుణ్, మీరాల ప్రేమ కథ ఏంటి, వాళ్ళ ప్రేమకు ఎవరి వలన కష్టం వచ్చింది, వరుణ్ ను కలుసుకోవడానికి మీరా చేసిన 36 గంటల ప్రయత్నం ఫలించిందా లేదా అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

కథానాయిక వైపు నుండి నడిచే ఈ ప్రేమ కథలో కథానాయిక పాత్రను చేసిన తమన్నా చాలా బాగా నటించింది. ప్రతి ఫ్రేమ్ లోను అందంగా కనిపిస్తూ అలరించింది. డెస్టినీని నమ్మి ఏమాత్రం పరిచయం లేని అబ్బాయిని ప్రేమించే అమ్మాయి పాత్రలో ఆమె ఇమిడిపోయింది. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లో, డ్యాన్సుల్లో తన హావా భావాలతో ఆకట్టుకుంది.

హీరో కళ్యాణ్ రామ్ కొత్తగా ట్రై చేసిన క్లాస్ లుక్ బాగుంది. ఆయన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ కూడ ఆకట్టుకుంది. దర్శకుడు జేయేంద్ర హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ ను డెస్టినీకి లింక్ చేయడం కొంత ఆసక్తికరంగా అనిపిస్తుంది. కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి, మహేష్ కోనేరులు నిర్మాతలుగా సినిమాకు ఎంత చేయాలో అంతా చేశారు. చిత్రాన్ని సాంకేతికంగా, క్వాలిటీ పరంగా ఉన్నత స్థానంలో నిలబెట్టారు. ప్రీ క్లైమాక్స్ లో హీరోయిన్ హీరో కోసం పడే ఆరాటం ఎమోషనల్ గా అనిపిస్తుంది. వెన్నెల కిశోర్, బిత్తిరి సత్తి చేసిన కామెడీ ఓ రెండు మూడు చోట్ల వర్కవుట్ అయింది.

మైనస్ పాయింట్స్ :

డెస్టినీ ఆధారంగా ఒక ప్రేమ కథను నడపడమనే దర్శకుడు జయేంద్ర ఆలోచన బాగున్నా దాన్ని స్క్రీన్ మీద ప్రేక్షకుడ్ని పూర్తిస్థాయిలో సంతృప్తిపరిచే విధంగా ప్రొజెక్ట్ చేయలేకపోయారు. మొదటి అర్ధభాగాన్ని హీరో హీరోయిన్ల పాత్రలను, వాటి స్వభావాల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, డెస్టినీ ద్వారా వాళ్లిద్దరూ కలుసుకునేలా చేయడానికి ఖర్చు పెట్టేసిన దర్శకుడు సన్నివేశాల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ప్రతి సన్నివేశం నామమాత్రంగానే ఉంది. ఆరంభం నుండి చివరి వరకు కథనం నిదానంగానే సాగింది తప్ప వేగం అందుకోలేదు.

ఇక హీరోయిన్ పాత్రను అంత బలంగా రాసుకున్న ఆయన హీరో పాత్రలో మాత్రం క్లారిటీ మైంటైన్ చేయలేదు. హీరో ఇంటిలిజెంట్ గానే కనిపిస్తుంటాడు కానీ కథను, కథనాన్ని మాత్రం నడపలేడు. సినిమా ఆద్యంతం డెస్టినీ చేతుల్లోనే ఉండటంతో ప్రేక్షకులకు ప్రధాన పాత్రలతో ట్రావెల్ చేసే సౌకర్యం లభించక సినిమా కంటెంట్ తో కనెక్ట్ కాలేకపోయారు. ఇక ముగింపుతో సహా కీలకమైన సన్నివేశాలు చాలా నాటకీయంగా అనిపిస్తాయి.

హీరో హీరోయిన్ల జోడీ చూసేందుకు బాగానే ఉన్నా వాళ్లిద్దరూ కలిసి ఉండే సమయం తక్కువగా ఉండటంతో వాళ్ళ మధ్య ప్రేమ కథలకి అవసరమైన రొమాన్స్ పూర్తిగా పండలేదు. పాటలు వినడానికి బాగున్నా ప్లేస్‌మెంట్‌ లేకపోవడంతో సరైన ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి.

సాంకేతిక విభాగం :
దర్శకుడు జయేంద్ర కథను పేపర్ మీద రాసుకున్నంత అందంగా స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. డెస్టినీ పేరుతో సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం చాలా వరకు లోపించింది. పైగా రొమాంటిక్ సినిమాలో రొమాన్స్ కూడ లోపించింది. హీరోయిన్ పాత్ర, ప్రేమ కథకు డెస్టినీని లింక్ చేయడం వంటి అంశాల్లో మాత్రమే ఆయన ప్రతిభ కనబడింది.

పి.సి. శ్రీరామ్ గారి కెమెరా మ్యాజిక్ హీరోయిన్ ను, సన్నివేశాలను అందంగా తయారుచేయగా, శరత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటల సంగీతం ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ బాగానే ఉంది. పైన చెప్పినట్టు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

తీర్పు :

ఈ ‘నా నువ్వే’ పూర్తిగా డెస్టినీ మూలంగా నడవడంతో అనుకున్నంతగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. కథానాయిక పాత్ర, అందులో మిల్కీ బ్యూటీ తమన్నా నటన, ప్రీ క్లైమాక్స్, సెకండాఫ్లో వచ్చే రెండు ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకోగా దర్శకుడు జయేంద్ర విఫలమవడంతో ప్రేమ జంట మధ్య రొమాన్స్ లోపించడం, పాటల ప్లేస్‌మెంట్‌ కుదరకపోవడం వాటికి తోడు నెమ్మదిగా సాగే కథనం, చాలా సన్నివేశాలు మరీ నాటకీయంగా ఉండటంతో ఫలితం దెబ్బతింది. మొత్తం మీద కళ్యాణ్ రామ్ రొమాంటిక్ హీరోగా చేసిన ఈ ప్రయత్నం పూర్తి స్థాయిలో మెప్పించలేదనే చెప్పాలి.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు