Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : నాన్నకు ప్రేమతో – ఎమోషనల్ రివెంజ్ డ్రామా.!

Killing Veerappan review

విడుదల తేదీ : 13 జనవరి 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : సుకుమార్

నిర్మాత : బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

నటీనటులు : ఎన్.టి.ఆర్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్..

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్.. ఇండస్ట్రీకి వచ్చి 15ఏళ్ళ కెరీర్ ని పూర్తి చేసుకోవడమే కాకుండా, 25 సినిమాలు చేసిన మెయిలు రాయిని కూడా చేరుకున్నాడు. ఎన్.టి.ఆర్ చేసిన 25వ సినిమానే ‘నాన్నకు ప్రేమతో’. వైవిధ్యభరిత కథలని, మోస్ట్ ఇంటెలిజెంట్ వేలో ప్రెజంట్ చేయడానికి ఇష్టపడే సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండ్రి – కొడుకుల మధ్య అనుబంధాన్ని ఒక రివెంజ్ స్టొరీగా మార్చి చేసిన ఈ ‘నాన్నకు ప్రేమతో’ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

మన హీరో అభిరామ్ (ఎన్.టి.ఆర్) ఒక లండన్ బేస్డ్ ఎన్ఆర్ఐ. తన ఇద్దరు అన్నయ్యలు, తండ్రి అయిన రమేష్ చంద్ర ప్రసాద్(రాజేంద్ర ప్రసాద్) లండన్ లో ఉంటారు. ఓసారి తను ఆఫీసు పనిమీద స్పెయిన్ లో ఉండగా అభిరామ్ తండ్రి రమేష్ చంద్ర ప్రసాద్ కి ఆరోగ్యం బాలేదని తెలియగానే ఉన్నపళంగా బయలుదేరి వస్తాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రాజేంద్ర ప్రసాద్ ద్వారా తను ఆ పరిస్థితికి రావడానికి కారణమైన కృష్ణమూర్తి (జగపతిబాబు) గురించి తెలుసుకుంటాడు. అప్పుడే రమేష్ చంద్ర ప్రసాద్ తన పిల్లలని ఓ కోరిక కోరతాడు.

అలా తండ్రి కోరికను నెరవేర్చడానికి తిరిగి లండన్ బయలుదేరుతాడు అభిరామ్. అక్కడ కృష్ణమూర్తి గురించి తెలుసుకొని, తన కూతురు దివ్యాంక (రకుల్)ను ప్రేమలో పడేస్తాడు. దివ్యాంక ద్వారా ఎలా అభిరామ్ కృష్ణమూర్తిని రీచ్ అయ్యాడు. అలాగే కృష్ణమూర్తికి – అభిరామ్ కి మధ్య జరిగిన డిష్కషన్ ఏంటి.? వీరిద్దరూ ఒకరితో ఒకరు మొదలు పెట్టిన గేమ్ ఏంటి? ఆ గేమ్ లో గెలవడానికి ఎవరెవరు ఏం చేసారు? ఫైనల్ గా ఈ గేమ్ లో ఎవరు గెలిచారు? ఈ గేమ్ గెలిచే ప్రక్రియలో అభిరామ్ ఏం కోల్పోయాడు? కృష్ణమూర్తి రమేష్ చంద్ర ప్రసాద్ కు చేసిన ద్రోహం ఏమిటి? తండ్రి కోరిన కోరికను అభిరామ్ తీర్చాడా లేదా? అన్నది వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

మొదటి నుంచీ ఈ చిత్ర టీం గంటాపదంగా చెప్పిన ఒకే ఒక మాట ‘తండ్రి కోరికను తీర్చడం కోసం ఓ కొడుకు ఏం చేసాడు అనే ఎమోషనల్ జర్నీనే నాన్నకు ప్రేమతో’ అని అన్నారు. చెప్పినట్టుగానే సుకుమార్ ఇందులో చూపిన ఎమోషనల్ జర్నీనే సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఒక గేమ్ ఎపిసోడ్ సూపర్బ్ గా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే క్లైమాక్స్ సీన్ మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ప్రధానంగా ఆ సీన్స్ లో ఎన్.టి.ఆర్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ మీ చేత కంటతడి పెట్టిస్తుంది. సుకుమార్ తను అనుకున్న తండ్రి – కొడుకుల ఎమోషన్ ని ఆన్ స్క్రీన్ ప్రెజంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.

నటన పరంగా ప్రతి ఒక్కరూ అదిరిపోయే నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. అందులో ప్రధమంగా ఎన్.టి.ఆర్ – రాజేంద్ర ప్రసాద్ – జగపతి బాబుల అద్భుత నటన గురించే చెప్పుకోవాలి.. మొదటగా ఓ మాస్ ఇమేజ్ ఉన్న హీరో అయ్యుంది ఇలాంటి ఓ కాన్సెప్ట్ ని అటెంప్ట్ చేసినందుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. సినిమా అయ్యాక ఎన్.టి.ఆర్ అద్భుతమైన నటనని కనబరిచాడు అనే మాట ఎక్కువ వినిపిస్తుంది. మొదటగా ఎన్.టి.ఆర్ లుక్ చూసి అందరూ స్టన్ అయ్యారు. ఆన్ స్క్రీన్ ఎన్నారై పాత్రకి తగ్గట్టుగా లుక్ అండ్ స్టైలింగ్ మార్చేశాడు. ఎన్.టి.ఆర్ ఇంతకముందు అలా కనిపించలేదు, ఇక మీద కనిపిస్తాడని చెప్పలేం. ఇక నటన పరంగా ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టొరీతో ఆకట్టుకుంటే, విలన్ ని ఢీ కొట్టే సీన్స్ లో మెచ్యూరిటీ చూపడంలో, ఎమోషనల్ సీన్స్ లో అద్భుతమైన హావ భావాలను పలికించాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ సినిమాకి కీలకమైన తండ్రి పాత్రలో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ అండ్ సపోర్ట్ ఇచ్చారు. ఇక పైకి కనిపించని నెగటివ్ షేడ్స్ ని చూపించడంలో, కళ్ళతోనే క్రూరత్వాన్ని ప్రకటించడంలో జగ్గుభాయ్ వావ్, ఏం చేసాడురా అనిపించుకున్నాడు. విలనిజంని చాలా క్లాస్ గా చూపినా, ఆడియన్స్ కి కావాల్సిన విలనిజంని చూపించడంతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.

రకుల్ ప్రీత్ సింగ్ జస్ట్ గ్లామర్ అని కాకుండా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలో మెప్పించింది. ఎన్నారై పాత్ర కావడంతో మోడ్రన్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించడమే కాకుండా, చాలా కష్టపడి తన పాత్రకి తను డబ్బింగ్ చెప్పుకొని తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఇక ఎన్.టి.ఆర్ కి సపోర్ట్ గా రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల తమ పాత్రలకి న్యాయం చేసారు. తాగుబోతు రమేష్, నవీన్ లు ఓకే అనిపించారు. నటుల విషయం పక్కన పెడితే సినిమా మొదలవ్వడం చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆ ఆ తర్వాత కథలో వచ్చే లవ్ ట్రాక్, పాటలతో చాలా జాయ్ఫుల్ ఫీల్ ని కలిగిస్తూ, సడన్ గా మొదలయ్యే హీరో-విలన్ మైండ్ గేమ్ ని స్టార్ చేసే ఇంటర్వల్ బాంగ్ జబర్దస్త్ అనిపిస్తుంది. నాన్నకు ప్రేమతోకి మేజర్ హైలైట్స్ అని చెప్పాల్సి వస్తే.. హీరో – విలన్ మైండ్ గేమ్ మరియు తండ్రి – కొడుకుల ఎమోషనల్ జర్నీ.

మైనస్ పాయింట్స్ :

నాన్నకు ప్రేమతో సినిమా కోసం ఎంచుకున్న సింపుల్ స్టొరీ లైన్ మొదటి మైనస్ గా చెప్పుకోవాలి. హుస్సేన్ షా కిరణ్ – సుకుమార్ లు కథలో చెప్పిన పాయింట్ ‘మోసపోయిన తండ్రి చివరి కోరిక తీర్చడమే కొడుకు లక్ష్యం’. దానివలన సినిమా అంతా అయిపోయి బాగున్నప్పటికీ స్టొరీ లైన్ మాత్రం చాలా రెగ్యులర్ అండ్ రొటీన్ గా అనిపిస్తుంది. కథ ఇదే అని తెలిసిపోవడం వలన సినిమా ఇలానే ఉంటుంది అని ఆడియన్స్ ఆశిస్తారు. ప్రేక్షకులు అనుకున్న ఊహాల మాదిరిగానే కథనం జరగడం కూసింత బోర్ కొడుతుంది. ముఖ్యంగా సెకండాఫ్ ని ఎక్కువ సేపు నడపడం వలన, కథనంలో కొత్తగా చెప్పేది ఏమీ లేక, హీరోయిన్ ట్రాక్ ని ఎక్కువ పెట్టడం వలన బాగా సాగదీస్తున్నారు అనే ఫీలింగ్ ఆడియన్స్ కి ఎక్కువ కలుగుతుంది. ఇలా కథ – కథనం – నెరేషన్ విషయాల్లో సుకుమార్ ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది.

సుకుమార్ ఎప్పటిలానే లాంగ్ రన్ టైం పెట్టి ప్రేక్షకులకు కాసేపు బోర్ కొట్టించాడు. చెప్పాలంటే ఈ సినిమాని 150 నిమిషాల్లో చెప్పాలి, కానీ సెకండాఫ్ ని ఎక్కువ డ్రాగ్ చేయడం వలన అది కాస్తా 168 నిమిషాలయ్యింది. దాని వలన ప్రీ క్లైమాక్స్ వరకూ సినిమా పెద్ద ఆసక్తికరంగా నడిపించలేదు. సూపర్ అనిపించే ఇంటర్వల్ బ్లాక్ తర్వాత సెకండాఫ్ చాలా బెటర్ గా ఆడియన్స్ ఆశిస్తారు. కానీ అంతలా సినిమా మాత్రం లేదు. ఇకపోతే సెకండాఫ్ లో పాటలు సినిమా వేగాన్ని మరింత చెడగొడతాయి. అలాగే రెగ్యులర్ మాస్ ఆడియన్స్ కోరుకునే కామెడీ, సీరియస్ యాక్షన్ ఎపిసోడ్స్ లేకపోవడం మైనస్.

సాంకేతిక విభాగం :

నాన్నకు ప్రేమతో టీంకి నటీనటులు ఎంతలా కష్టపడి బెస్ట్ వర్క్ ఇచ్చారో అంతకు మించిన బెస్ట్ వర్క్ టెక్నికల్ టీం నుంచి కూడా లభించింది. దర్శకుడి ఊహాల్లోని విజువల్స్ ని తెరపైన ఒక ఫీల్ గుడ్ పెయింటింగ్ లా ఆవిష్కరించడంలో విజయ్ కె చక్రవర్తి పనితనం అదరహో అనేలా ఉంది. ఇక నటీనటులను ప్రెజంట్ చేసిన విధానం, లొకేషన్స్ ని చూపిన విధానం, ఎమోషనల్ సీన్స్ లో మూడ్ ఇన్వాల్వ్ మెంట్ ని కాప్చ్యూర్ చేసిన విధానం నేత్రానందాన్ని కలిగిస్తుంది. ఇక అలాంటి విజువల్స్ కి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ శ్రవణానందాన్ని అందించిది. దేవీశ్రీ పాటలు మంచి హిట్ అయ్యాయి కానీ ఆన్ స్క్రీన్ అన్ని పాటలు అంతలా బెటర్ గా పిక్చరైజ్ చేయలేదు. ఇక ఎమోషనల్ మరియు ఎలివేషన్ సీన్స్ లో తను అందించిన మ్యూజిక్ అదుర్స్. ఎస్. రవీందర్ ఆర్ట్ వర్క్ బాగుంది. లండన్ లో వేసిన స్పెషల్ ఆఫీస్ సెట్ సందర్భాలకు సింక్ అయ్యేలా ఉంది. ఇక నవీన్ నూలి ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా భలే ఉంది అనిపిస్తే, సెకండాఫ్ ని మాత్రం బాగా సాగదీసాడు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ చివరి ప్రీ క్లైమాక్స్, ఎమోషనల్ సీన్స్ ని మాత్రం బాగా ఎడిట్ చేసి కనెక్ట్ చేసాడు.

ఇక కథలో సుకుమార్ తో పాటు హుస్సేన్ షా కిరణ్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. కథ పరంగా ఓకే ఎమోషనల్ కంటెంట్ తప్ప మిగతా అంతా రెగ్యులర్ రివెంజ్ డ్రామా లైన్ అవ్వడంతో ఉన్న ఎమోషనల్ సీన్స్ ని సూపర్బ్ గా రాసుకున్నారు. సుకుమార్ ఆ సీన్స్ తో కథనంలో మేజిక్ చేయాలని అనుకున్నాడు. కానీ అది పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. కొంతభాగం సక్సెస్ అయినా కొంతభాగం సక్సెస్ కాలేదు. దానికి ప్రధాన కారణం నెరేషన్ ఊహాజనిత ఫార్మాట్ లో ఉండడం, అలాగే సెకండాఫ్ లో సాగదీయడం ఎక్కువ కావడం. సో కథ కథనంలో ఇంకాస్త బెటర్ మెంట్ ఉండాల్సింది. ఇక డైరెక్టర్ గా సుకుమార్ మరోసారి తన సత్తా చాటుకున్నాడు. తను రాసుకున్న కథలో ఉన్న పవర్ఫుల్ సీన్స్ ని చాలా బాగా తీసాడు. నటీనటుల నటన నుంచి తను అనుకున్న ఎమోషన్ ని ప్రేక్షకులకి రీచ్ అయ్యేలా చేసేంత వరకూ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ విలువలు మాత్రం అద్భుతః అనేలా ఉన్నాయి. గ్రాండ్ విజువల్స్ అనేది సినిమాకి మరో స్పెషల్ అట్రాక్షన్.

తీర్పు :
అందరూ ఊహించినట్టుగానే ఎన్.టి.ఆర్ నుంచి వచ్చిన 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’ థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుల హృదయాలను హత్తుకొనే సినిమా. నాన్నకు ప్రేమతో సినిమాలో ఆకట్టుకునే లవ్ ట్రాక్ తో పాటు అందరూ వావ్ అనేలా కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటినీ ఒక ఎమోషనల్ క్లైమాక్స్ సీన్ కి మిక్స్ చేసి చెప్పడం సినిమాకి హైలైట్. అలాగే వీటన్నిటికీ బోనస్ గా అల్ట్రా స్టైలిష్ ఎన్.టి.ఆర్ ని మీరు ఈ సినిమాలో చూడచ్చు. నాన్నకు ప్రేమతో సినిమా ప్రతి ఒక్కరినీ కదిలించే సినిమా. ఎన్.టి.ఆర్, జగపతి బాబుల సూపర్బ్ పెర్ఫార్మన్స్, సుకుమార్ టేకింగ్, హీరో-విలన్ మైండ్ గేమ్, కంటతడి పెట్టించే ఎమోషన్స్ నాన్నకు ప్రేమతోలో ఆడియన్స్ ని కట్టి పడేసే అంశాలైతే.. సింపుల్ రివెంజ్ డ్రామాగా అనిపించే స్టొరీ లైన్, ఊహాజనితంగా కథనం చెప్పడం, సెకండాఫ్ సాగదీసినట్టు ఉండడం ప్రేక్షకులకు ఇబ్బంది పెట్టే అంశాలు. ఎన్.టి.అర్ అభిమానులు ఆశించే కొన్ని రెగ్యులర్ అంశాలు లేకపోయినా ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. తెలుగులో సెంటిమెంట్ ని మిక్స్ చేస్తూ వచ్చిన టాప్ క్లాస్ థ్రిల్లర్ ‘నాన్నకు ప్రేమతో’. చివరి మాటగా ‘నాన్నకు ప్రేమతో’ కొత్తదనం కోరుకునే ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా. మల్టీ ప్లెక్స్, ఎ సెంటర్స్ ఆడియన్స్ కి బాగా నచ్చే ఈ సినిమా బి, సి సెంటర్స్ వారికి అనుకున్న స్థాయిలో నచ్చకపోవచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW


సంబంధిత సమాచారం :