Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : ఒక లైలా కోసం – ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్.!

Oka-Laila-Kosamtg విడుదల తేదీ : 17 అక్టోబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకత్వం : విజయ్ కుమార్ కొండ
నిర్మాత : అక్కినేని నాగార్జున
సంగీతం : అనూప్ రూబెన్స్
నటీనటులు : నాగ చైతన్య, పూజ హెగ్డే…

హన్డ్సం లుక్ లో తండ్రికి తగ్గ తనయుడు అన్న మాటని నిలబెడుతూ వస్తున్న అక్కినేని నాగ చైతన్య కూడా నాగార్జునలా రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో పేరు తెచ్చుకున్న నాగ చైతన్య నటించిన మరో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఒక లైలా కోసం’. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేం విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పూజ హెగ్డే హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఇప్పటి వరకూ తన కెరీర్లో రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ తో మంచి హిట్స్ అందుకున్న నాగ చైతన్య ఈ సినిమాతో మరో రొమాంటిక్ హిట్ అందుకున్నాడా.? లేదా.? అలాగే విజయ్ కుమార్ కొండ తన ద్వితీయ ప్రయత్నంతో విజయాన్ని సాధించాడా.? లేదా.? అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :

కార్తీక్ (నాగ చైతన్య) తన గ్రాడ్యువేషన్ ఫినిష్ చేసుకొని జాబ్ తెచ్చుకుంటాడు. కానీ జాబ్ కి నో చెప్పి కొద్ది రోజులు ఫ్రీడం లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలని వరల్డ్ టూర్ ప్లాన్ చేస్తాడు. ఆ ట్రిప్ చివర్లోనే కార్తీక్ నందన అలియాస్ నందు (పూజా హెగ్డే) ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ తర్వాత రోజూ తను ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటాడు.. ఇదే సమయంలో నందు పలు సందర్భాల్లో కార్తీక్ ని దూరం నుంచి చూసి ద్వేషం పెంచుకుంటుంది. ఒకరోజు ఎట్టకేలకు నందుని చూసిన కార్తీక్ తన ప్రేమని వ్యక్త పరుస్తాడు. కానీ నందు కార్తీక్ ని ద్వేషిస్తుంది.

ఒకరోజు నందు మరియు కార్తీక్ ఇళ్ళల్లో వారిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. కార్తీక్ నందుని ప్రేమించడం వల్ల ఆ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడు. అందుకే పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూసి నచ్చలేదని చెప్పలనుకుంటాడు. కానీ పెళ్లి కూతురు ప్లేస్ లో నందుని చూసి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. కానీ నందుకి కార్తీక్ అన్నా.. కార్తీక్ తో పెళ్లి అన్నా అస్సలు ఇష్టం ఉండదు. కానీ తన తండ్రి మాట కాదనలేక అప్పటికి ఒప్పుకుంటుంది.. ఇలా ఒకరికి ఇష్టం ఉండి – ఒకరికి ఇష్టం లేకుండా ఫిక్స్ అయిన వీరి పెళ్లి జరిగిందా.? లేదా.? నిశ్చితార్ధం తర్వాత అయినా నందు కార్తీక్ ప్రేమని అర్ధం చేసుకోగలిగిందా.? లేదా.? అర్థం చేసుకుంటే ఎలా చేసుకుంది.? ఒకవేళ చేసుకోలేకపోతే కార్తీక్ ప్రేమలో ఏమన్నా లోపం ఉందా.? అన్నది మీరు వెండితెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ద్వారా పేరు తెచ్చుకున్న రొమాంటిక్ హీరో నాగ చైతన్య ఈ సినిమాతో తన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని మరింత పెంచుకుంటాడు అనడంలో ఎలాంటి అనుమానమూ లేదు.. ఎందుకంటే గత సినిమా కంటే ఈ సినిమాలో నాగ చైతన్య చాలా స్టైలిష్ లుక్ లో మోస్ట్ హన్డ్సం గా కనిపించాడు. ఇక ఈ సినిమా ఎలాగూ రొమాంటిక్ లవ్ స్టొరీ కావడం వలన తనదైన శైలిలో నటనని కనబరిచి ఆకట్టుకున్నాడు. కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా చేసాడు. కొన్నింటిలో ఇంకాస్త మెచ్యూరిటీ కనిపించి ఉంటే బాగుండేది. ఈ సినిమాలో నాగ చైతన్య ఫైట్స్ తో పాటు సింపుల్ స్టెప్స్ కూడా వేసి కూడా ఆకట్టుకున్నాడు.

ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజ హెగ్డే మొదటి సినిమాతోనే తన పెర్ఫార్మన్స్ తో అందరినీ మెప్పించింది. డైరెక్టర్ ఎంచుకున్న పాత్రకి పూజ హెగ్డే పూర్తి జస్టిఫికేషన్ చేసింది. సినిమా మొత్తం అటు ట్రెడిషనల్ గా, ఇటు గ్లామరస్ గా కనిపిస్తూ మెప్పించింది. ముఖ్యంగా పాటల్లో అందరినీ తనవైపు తిప్పుకుంది. కొన్ని ఎమోషనల్ మరియు సీరియన్స్ సీన్స్ లో చాలా బాగా చేసింది. ఇక ఈ సినిమాకి మరో మేజర్ హైలైట్ కాట్రవల్లి అలీ.. అలీ ఉన్న ఎపిసోడ్ మొత్తం ప్రేక్షకులని బాగా నవ్విస్తుంది. అలీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మరియు పోసాని కృష్ణ మురళి కాంబినేషన్ సీన్స్ మిమ్మల్ని తెగ నవ్విస్తాయి. ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్ అంటే చెప్పుకోవాల్సిన పేరు అలీ మాత్రమే.. నాగార్జున చెప్పినట్టు అలీ కామెడీ ఈ సినిమాకి మేజర్ హైలైట్..

ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్ చాలా పెద్ద ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా, ఫాస్ట్ గా సాగడమే కాకుండా, కథలో ఉన్న ఓ రొమాంటిక్ ఫీల్ తో మీరు ట్రావెల్ అవుతూ ఉంటారు. ఆ ఫీల్ మీ పెదవులపై చిన్న చిరునవ్వుని తెప్పించడం వలన మీరు ఫస్ట్ హాఫ్ కి బాగా కనెక్ట్ అవుతారు. నాగ చైతన్య – పూజ హెగ్డే మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ ని కూడా డైరెక్టర్ చాలా బాగా డీల్ చేసాడు. సుమన్, సాయాజీ షిండే, రోహిణి, సుధ, దీక్ష పంత్, మధు, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు. ఇక అనూప్ అందించిన పాటలు, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి.

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఆడియన్స్ అదే ఫీల్ ని సెకండాఫ్ లో ఆశిస్తారు.. ఆ ఫీల్ ని సెకండాఫ్ లో కంటిన్యూ చేయలేకపోవడమే ఈ సినిమాకి మొదటి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్.. అంతే కాకుండా సెకండాఫ్ బాగా స్లో అయిపోతుంది.. అలాగే ఫస్ట్ హాఫ్ లో కనిపించిన ఫ్రెష్ సీన్స్ సెకండాఫ్ లో కరువైపోవడమే కాకుండా చాలా రొటీన్ సీన్స్ వస్తుంటాయి. సెకండాఫ్ లో ఆడియన్స్ ఆశించే ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యింది. సినిమా మొత్తం హీరోయిన్ హీరోకి నువ్వు నాకు నచ్చలేదు అనడానికి సరైన కారణం చెప్పలేదు. హీరోయిన్ పాత్రలో చాలా చోట్ల సరైన క్లారిటీ ఇవ్వలేదు.

సెకండాఫ్ లో రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా చాలా ఊహాజనితంగా ఉంటుంది. అలాగే డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ చేసిన మరో బిగ్గెస్ట్ మిస్టేక్.. సెకండాఫ్ లో ఎమోషనల్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే రేంజ్ లో పేపర్ మీద రాసుకున్న సీన్స్ ని స్క్రీన్ పైకి ట్రాన్స్ఫర్ చేయలేకపోవడంలో ఫెయిల్ అవ్వడమే. ఈ కథలోని కొన్ని పాయింట్స్ ని మనం ఇదివరకూ ఎప్పుడో చూసామే అన్న ఫీలింగ్ ని కలుగజేస్తాయి.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకి టెక్నికల్ గా చెప్పుకోదగిన అంశాలు చాలానే ఉన్నాయి.. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐ.ఆండ్రూ సినిమాటోగ్రఫీ గురించి.. ఈ మూవీలోని విజువల్స్ చూస్తున్న ఆడియన్స్ కి ఈ కొత్త ప్లేస్ బాగుందే, చాలా ఫ్రెష్ గా ఉందే అనే ఫీలింగ్ కలిగించే రీతిలో తన విజువల్స్ ఉన్నాయి. అలాగే అనూప్ రూబెన్స్ ఇచ్చిన పాటలు బాగా హిట్ అయ్యాయి, ఆండ్రూ తన సినిమాటోగ్రఫీతో చేసిన మేజిక్ వలన పాటలు చూడటానికి ఇంకా బాగున్నాయి. అలాగే అనూప్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ ని చాలా ఫాస్ట్ గా అయ్యేలా ఎడిట్ చేసిన ప్రవీణ్ పూడి సెకండాఫ్ ని కూడా అదే తరహాలో ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. కథకి తగ్గట్టుగా యాక్షన్ సీన్స్ ని బాగా డిజైన్ చేసుకున్నారు. అలాగే సినిమాలో డైలాగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ కి మంచి డైలాగ్స్ పడ్డాయి.

ఇక చెప్పుకోవాల్సింది రెండవ ప్రయత్నంగా మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ని అందించిన డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ గురించి.. ఆయన రాసుకున్న కథ – బాగుంది, కథ ప్రకారం ఆయన సినిమాలో ఎంటర్టైన్మెంట్ – ఎమోషన్స్ ని సమానంగా రాసుకున్నట్టు ఉన్నారు.. ఎంటర్టైన్మెంట్ మరియు ఫ్రెష్ ఫీలింగ్స్ ని పర్ఫెక్ట్ గా డీల్ చేసిన విజయ్ కుమార్ కొండ ఒక్క క్లైమాక్స్ లో తప్ప మిగతా ఎక్కడా ఎమోషన్స్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోయాడు. స్క్రీన్ ప్లే – ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ అండ్ ఫీల్ గుడ్, సెకండాఫ్ లో ఒక్క క్లైమాక్స్ లో తమ్మ మిగతా అంతా మీరు ఊహించినదే జరుగుతుంది. దర్శకత్వం – డైరెక్టర్ గా మాత్రం మంచి మార్కులే కొట్టేసాడు. అనుకున్న కాన్సెప్ట్ తీయడంలో అక్కడక్కడా మిస్ అయినా ఓవరాల్ గా జస్టిఫై చేసాడు. కానీ తన రెండవ ప్రయత్నం కన్నా మొదటి ప్రయత్నమే బెస్ట్ అని చెప్పాలి. అన్నపూర్ణ స్టూడియోస్ పై నాగార్జున నిర్మించిన ఈ సినిమా నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

తీర్పు :

‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో ఓ పర్ఫెక్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని అందించిన విజయ్ కుమార్ కొండ ద్వితీయ ప్రయత్నంగా చేసిన ‘ఒక లైలా కోసం’ కూడా ఓవరాల్ గా ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న నాగ చైతన్య ఈ సినిమాతో మరో డీసెంట్ రొమాంటిక్ హిట్ ని అందుకున్నాడనే చెప్పాలి. తెలుగులో తనలోని టాలెంట్ ని నిరూపించుకోవడానికి పూజ హెగ్డే కి ఈ మూవీ పర్ఫెక్ట్ లాంచ్ అని చెప్పాలి. నటీనటుల పెర్ఫార్మన్స్, ఫీల్ గుడ్ ఫస్ట్ హాఫ్, అలీ ఎంటర్టైన్మెంట్, క్లైమాక్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ అయితే స్లో మరియు ఊహాజనితమైన సెకండాఫ్, సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వడం, కొన్ని ఎమోషనల్ సీన్స్ అనుకున్న స్థాయిలో తీయలేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా ఓ సారి చూడదగిన సినిమా అయితే, యువత మాత్రం తమ లైలాలతో కలిసి చూడదగిన సినిమా ‘ఒక లైలా కోసం’.

123తెలుగు. కామ్ రేటింగ్ : 3.25/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW


సంబంధిత సమాచారం :