Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : ఊపిరి – తెలుగు సినిమాకు కొత్త ‘ఊపిరి’!

Oopiri review

విడుదల తేదీ : 25 మార్చ్ 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.75/5

దర్శకత్వం : వంశీ పైడిపల్లి

నిర్మాత : పరమ్. వి. పొట్లూరి

సంగీతం : గోపీ సుందర్

నటీనటులు : నాగార్జున, కార్తి, తమన్నా..

ఎప్పటికప్పుడు ప్రయోగాత్మక సినిమాలను చేసుకుంటూ ఈతరం ప్రేక్షకుల్లోనూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నాగార్జున, తమిళ స్టార్ హీరో కార్తిల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘ఉపిరి’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి విడుదలకు ముందు ఈ సినిమాకు అంతటా కనిపించిన పాజిటివ్ బజ్‌ను సినిమా నిజంగానే కొనసాగించిందా? చూద్దాం..

కథ :

ఓ ప్రమాదం బారిన పడి పూర్తిగా కాళ్ళు, చేతులు పనిచేయకుండా వీల్‌చైర్‌కే అతుక్కుపోయిన కోటీశ్వరుడైన విక్రమ్ ఆదిత్య (నాగార్జున), తన బాగోగులను చూసుకునేందుకు ఒక సరైన వ్యక్తి కోసం వెతుకుతుంటాడు. ఇక అదే క్రమంలో జైలు నుంచి బయటకొచ్చిన శీను (కార్తి), విక్రమ్ దగ్గర ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళతాడు. రోజూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండే ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన శీను, విక్రమ్‌కి నచ్చడంతో అతడి బాగోగులను చూసుకునే ఉద్యోగం సంపాదిస్తాడు.

డబ్బుంటేనే సంతోషం ఉంటుందనుకునే శీను, తాను కోరే సంతోషాన్ని ఎవరిస్తారా? అని ఎదురుచూసే విక్రమ్.. ఈ ఇద్దరూ ఆ తర్వాత చేసే ప్రయాణమే ‘ఊపిరి’. ఈ ప్రయాణంలో ఏమేం జరిగాయి? ఎవరెవరి జీవితాలు ఎలా మారాయి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసే తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

ఫ్రెంచ్‌లో క్లాసిక్ అనిపించుకున్న ‘ది ఇన్‌టచబుల్స్’ అనే సినిమాను.. తెలుగులో, ఇక్కడి ఆలోచనా విధానానికి, పరిస్థితులకు, నేపథ్యానికి అనుగుణంగా మార్చుకొని, అసలు కథను, ఆత్మను ప్రేక్షకులకు పరిచయం చేయాలన్న ఆలోచనకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇక ఆ ఆలోచనను నూటికి నూరు శాతం విజయవంతంగా పూర్తి చేయగలగడం ఈ సినిమా విషయంలో అసలైన ప్లస్ పాయింట్. నాగార్జున కార్తీల జర్నీని సినిమా మొత్తం అలా చూస్తూండిపోయేలా సన్నివేశాలను రూపొందించిన తీరు అబ్బురపరుస్తుంది. కార్తీ పాత్రలోని చలాకీతనం, అల్లరి; నాగార్జున పాత్రలోని స్వచ్ఛమైన నిండుతనం.. ఈ రెండింటినీ ప్రతిబింబించేలా వీరి ప్రయాణంలో వచ్చే సన్నివేశాలు నవ్విస్తూ, ఏడిపిస్తూ, ఒక అద్భుతమైన అనుభూతినిస్తూ సాగిపోతూ కట్టిపడేస్తాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే, ముందుగా ఇలాంటి ఒక ప్రయోగాత్మక పాత్రను ఒప్పుకొని, దాన్ని పూర్తిస్థాయిలో సొంతం చేసుకొని చేసిన నాగార్జున గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! నాగార్జునకు ఈ సినిమాలో ఎక్కువగా క్లోజప్ షాట్స్ ఉన్నాయి. ఆయన ఏ స్థాయి నటుడో ఈ సినిమా చూస్తే ఇట్టే అర్థమైపోయేంత అద్భుతంగా ఈ పాత్రలో ఒదిగిపోయారు. ఇక శీను పాత్రలో కార్తీని తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా కార్తీ కట్టిపడేశాడు. అతడి కామెడీ టైమింగ్, పాత్రను సొంతం చేసుకున్న విధానం, ఎమోషనల్ సన్నివేశాల్లో మెప్పించిన తీరు.. అన్నివిధాలా అబ్బురపరుస్తాడు. తమన్నా తన పాత్రలో బాగా నటించడంతో పాటు అందంగా కూడా ఉంది. సొంతంగా తమన్నాయే చెప్పిన డబ్బింగ్ కూడా బాగుంది. జయసుధ, ప్రకాష్ రాజ్.. ఇలా ప్రధాన పాత్రల్లో నటించినవారంతా చాలా బాగా చేశారు. శ్రియ, అనుష్కల స్పెషల్ అప్పియరన్స్ మరో హైలైట్.

మైనస్ పాయింట్స్ :

కట్టిపడేసే ఫస్టాఫ్ తర్వాత సినిమా కొద్దిసేపు నెమ్మదించినట్టు అనిపిస్తుంటుంది. పారిస్ నేపథ్యంలో ఈ సమయంలో వచ్చే కొన్ని సన్నివేశాలు కాస్త డల్ అనిపిస్తాయి. అదేవిధంగా కార్తీ-తమన్నాల మధ్యన వచ్చే ఓ పాట అప్పటికి అవసరం లేనిదనిపించింది. కథ రీత్యా వచ్చేదే అయినా స్పెషల్ సాంగ్ కాకుండా ఆ ప్లేస్‌లో మరింకేదైనా అంశం జత చేసుంటే బాగుండేదనిపించింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే ఈ సినిమా అన్ని విధాలా ది బెస్ట్ అని చెప్పొచ్చు. ముందుగా దర్శకుడు వంశీ పైడిపల్లి గురించి ప్రస్తావించుకుంటే.. ఒక ఫ్రెంచ్ కథలోని బేసిక్ ఎమోషన్‌ను ఎక్కడా మార్చకుండా దాన్ని తెలుగు సినిమాకు, పద్ధతికి మార్చుకొని రాసుకున్న స్క్రీన్‌ప్లే కట్టిపడేసేలా ఉంది. దర్శకుడిగానూ వంశీ పైడిపల్లి ప్రతిభను, మేకింగ్ పరంగా చేసిన మ్యాజిక్‌ను ప్రతి పదినిమిషాలకొసారి చూడొచ్చు. చిన్న చిన్న ఎమోషన్స్‌ని కూడా వంశీ కథలో చెప్పుకొచ్చిన విధానానికి ఎంత అభినందించినా తక్కువే! సెకండాఫ్‍ మొదట్లో ఇంకొంచెం జాగ్రత్తగా సినిమాను నడిపి ఉండే బాగుండేదనిపించింది. ఇవన్నీ పక్కనబెడితే.. ఇలాంటి ఒక సినిమాను తెరకెక్కించాలన్న ఆలోచనకు, దాన్ని సినిమాగా తీర్చిదిద్దడంలో చూపిన ప్రతిభను చూశాక దర్శకుడికి హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తుంది.

గోపీ సుందర్ సంగీతం అద్భుతంగా ఉంది. సినిమా అయిపోయాక కూడా ‘నువ్వేమిచ్చావో’ అన్న పాట, పతాక సన్నివేశాల్లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వెంటాడతాయి. పీ.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అదిరిపోయిందనే చెప్పాలి. ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్‌కి వచ్చేసరికి కథలో మారుతున్న ఎమోషన్‌ను నటీనటులంతా ఎలా క్యారీ చేశారో, వినోద్ సినిమాటోగ్రఫీ కూడా అలాగే క్యారీ చేసింది. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని ఇంటర్‌కట్స్ దగ్గర ఎడిటింగ్ మ్యాజిక్ చూడొచ్చు. అబ్బూరి రవి రాసిన డైలాగ్స్ సినిమాకు మరింత అర్థాన్ని తెచ్చిపెట్టేలా ఉన్నాయి. ఆర్ట్ వర్క్ బాగుంది. పీవీపీ సినిమా నిర్మాణ విలువలను, సాహసాన్ని మెచ్చుకోకుండా ఉండలేం!

తీర్పు :

ఒక ఆలోచనను, ఆనందాన్ని, బాధని, భావాన్ని, భావోద్వేగాన్ని.. ఇలా ఎన్ని చెప్పాలన్నా సినిమా అనే మాధ్యమానికి అవధుల్లేవన్నది సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకొని నవ్విస్తూ, ఏడిపిస్తూ, కదిలిస్తూ, ఎక్కడికో తీసుకెళ్ళి వదిలేసి వచ్చే ఓ అందమైన వేడుక లాంటి సినిమా ‘ఊపిరి’. కథ ద్వారా చెప్పాలనుకున్న ఆలోచన, బలమైన భావోద్వేగం, నవ్విస్తూనే ఏడిపించే బలమైన సన్నివేశాలు, నాగార్జున, కార్తీల అద్భుతమైన నటన, కట్టిపడేసే సాంకేతిక విలువలు.. ఇలా ఒక సినిమా అనే మాధ్యమం ఇచ్చే చాలా అనుభూతులను వెంటేసుకొని వచ్చిన ఈ సినిమాలో రెండో భాగంలో మొదటి ఇరవై నిమిషాలు కాస్త నెమ్మదించడం అన్నది మాత్రమే ప్రతికూలాశం. ఒక్క మాటలో చెప్పాలంటే… సినిమా అయిపోయాక మొహంపై ఓ చిరునవ్వు మిగిల్చి, కళ్ళనుంచి చిన్నగా నీళ్ళు తెప్పించే సినిమాలు ఎప్పటికో గానీ రావు. ‘ఊపిరి’.. తెలుగు సినిమాకు కొత్తగా ఊపిరినిచ్చే అలాంటి అందమైన సినిమా.

123telugu.com Rating : 3.75/5
Reviewed by 123telugu Team

CLICK HERE FOR ENGLISH REVIEW


సంబంధిత సమాచారం :