సమీక్ష : పెళ్ళికి ముందు ప్రేమ కథ – పెద్దగా అలరించలేదు

Pelliki Mundu Prema Katha movie review

విడుదల తేదీ : జూన్ 16, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : మధు గోపు

నిర్మాత : సుధాకర్ పట్నం, అవినాష్ సలాండ్ర

సంగీతం : వినోద్ యాజమాన్య

నటీనటులు : చేతన్ చీను, సునయన

ప్రేమ కథల నైపథ్యంలో తెరకెక్కే సినిమాలంటే మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఇంకా ఉంది. ఆ నమ్మకాన్ని నమ్ముకునే నూతన దర్శకుడు మధు గోపు ‘పెళ్ళికి ముందు ప్రేమ కథ’ అనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చేతన్ చీను, సునయన జంటగా నటించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి పెళ్ళికి ముందు జరిగిన ఈ ప్రేమ కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ:

సంతోష్ (చేతన్ చీను) తనకు కలలో కనిపించి ఫోన్ నెంబర్ ఇచ్చిన డ్రీమ్ గర్ల్ ను ఎలాగైనా కలవాలని ప్రయత్నించి చివరికి (సునయన) ను కలుస్తాడు. కానీ అను మాత్రం కలిసేటప్పుడు తన ముఖం చూపించను అనే కండిషన్ మీద అతన్ని కలుస్తుంది. సంతోష్ కూడా ఆమెకు తన ముఖం చూపించకుండానే కలుస్తాడు. అలా ముఖాలు చూపించుకోకుండానే ఒకరికొకరు దగ్గరయ్యే ప్రయత్నంలో సంతోష్ ఒక పొరపాటు చేసి ఆమెతో విడిపోతాడు.

అలా ముఖం కూడా చూడకుండా అనుతో విడిపోయిన సంతోష్ ఆమెనే ఫ్రెండ్ పెళ్ళిలో చూసి ప్రేమించి ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. అలా పెళ్ళికి ముందు తాము ప్రేమించిన వ్యక్తితోనే ఇప్పుడు తమ పెళ్లి అయిందన్న విషయం తెలియని ఆ ఇద్దరి వైవాహిక జీవితం ఎలా సాగింది ? పెళ్ళికి ముందు వారి ప్రేమ కథ పెళ్లి తర్వాత ఎలాంటి సమస్యల్ని తెచ్చింది ? చివరికి అన్నీ సర్దుకుని వాళ్ళు ఎలా ఒక్కటయ్యారు ? అనేదే ఈ సినిమా కథ..

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో ఆకట్టుకునే అంశం ఏదైనా ఉంది అంటే అది హీరోయిన్ సునయనే అనాలి. పరిచయమైన మొదటి ఫ్రేమ్ నుండే ఆమె ఆకర్షణీయంగా కనిపిస్తూ అలరించింది. దర్శకుడు మధు గోపు కూడా ఆమెను తెర మీద వీలైనంత అందంగా చూపించడానికి ట్రై చేశాడు. ఇక హీరో హీరోయిన్లిద్దరూ ఒకరి ముఖాలు ఒకరికి చూపించుకోకుండా ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండి కలుసుకోవడం వంటి భిన్నమైన సన్నివేశాలు కొంచెం బాగున్నాయి.

ఇక కథతో ఏమాత్రం సంబంధం లేకపోయినా మధ్యలో వచ్చే తాగుబోతు రమేష్, సత్యల కామెడీ అక్కడక్కడా నవ్వించింది. అలాగే హీరో హీరోయిన్ల మధ్య నడిచే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. హీరో చేతను చీను లుక్స్ పరంగా బాగానే కనిపిస్తూ పెర్ఫార్మెన్స్ లో కూడా గత సినిమాలతో పోలిస్తే బెటర్ అనిపించాడు. ఒక అమ్మాయి, అబ్బాయి పెళ్ళికి ముందు రహస్యంగా నడిపిన ప్రేమ కథ పెళ్ళైన తర్వాత వాళ్ళ జీవితంలో ఎలాంటి అలజడులు తెచ్చిందో చూపాలనే దర్శకుడు ప్రయత్నం అభినందనీయం.

మైనస్ పాయింట్స్ :

సినిమాలోని ప్రధాన బలహీనత ఎలా పడితే అలా రాసిన స్క్రీన్ ప్లే. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నా దానికి ఆయన తయారు చేసుకున్న కథనం అస్సలు బాగోలేదు. ఒక సన్నివేశానికి, మరొక సన్నివేశానికి మధ్య సంబంధమే కనిపించలేదు. తెర మీద నడిచే సన్నివేశాల్ని చూస్తే ఏదో ముందురోజు రాత్రి హడావుడిగా అనుకుని పక్కరోజు పొద్దున్నే షూటింగ్ చేసినట్టు తోచింది. సినిమా పూర్తయ్యాక కూడా కథానాయకుడి పాత్ర స్వభావం ఎటువంటిదో తేలకపోవడమే ఇందుకు ఉత్తమ ఉదాహరణ.

అలాగే సినిమా కాబట్టి కామెడీ అనేది ఖచ్చితంగా ఉండాలనే బలవంతపు ఉద్దేశ్యంతో దర్శకుడు అనవసరమైన కామెడీని, పాత్రల్ని కథనంలో ఇరికించి చాలా చోట్ల చిరాకు తెప్పించాడు. దానికి తోడు ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేని పాటలు కూడా మరింత నీరసం తెప్పించాయి. ఫస్టాఫ్ హీరోయిన్ మీద, రెండు మూడు పర్వాలేదనిపించే సన్నివేశాలతో ఎలాగోలా గడిచిపోయింది అనుకుంటుండగానే సెకండాఫ్ మరీ దారుణంగా తయారై ఎప్పుడెప్పుడు శుభం కార్డు పడుతుందా అనిపించింది.

సాంకేతిక విభాగం :

పి. సి. ఖన్నా సినిమాటోగ్రఫీ కాస్త మెచ్చుకోదగ్గదిగా ఉంది. ఫ్రేమ్స్ పరంగా అతని పనితనం బాగుంది. హీరో పాత్రకు చెప్పిన డబ్బింగ్ కొన్ని చోట్ల సరిగా సెట్ అవ్వలేదు. ఇక వినోద్ యాజమాన్య అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ పాటల సంగీతం కానీ ఏమంత ఆకట్టుకునేదిగా లేదు.

అమర్ రెడ్డి ఎడిటింగ్ కూడా సినిమాకు ఏమాత్రం బలాన్నివ్వలేదు. అనవసరమైన కామెడీ సన్నివేశాల్ని ఇంకాస్త తొలగించి ఉంటే ప్రేక్షకుడిపై భారం తగ్గేది. ఇక దర్శకుడు మధు గోపు విషయానికొస్తే ఆయన చెప్పాలనుకున్న కథాంశం బాగున్నా రాసుకున్న కథనం, తెరకెక్కించిన తీరు పూర్తిగా విఫలమయ్యాయి. నిర్మాతలు సుధాకర్ పట్నం, అవినాష్ సలాండ్ర పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు:

మొత్తం మీద చెప్పాలంటే పెళ్లికి ముందు నడిపిన ప్రేమ కథ పెళ్లి తర్వాత ఎలాంటి కష్టాల్ని తెచ్చిపెట్టిందో చూపాలనే దర్శకుడి ప్రయత్నం పెద్దగా వర్కవుట్ కాలేదు. సునయన స్క్రీన్ ప్రెజెన్స్, అక్కడక్కడా నవ్వించిన కామెడీ ఆకట్టుకోగా ఏమాత్రం ఆకట్టుకొని స్క్రీన్ ప్లే, అనవసరమైన, ఒకదానితో ఒకటి సంబంధంలేని సన్నివేశాల వలన ‘ పెళ్ళికి ముందు ప్రేమ కథ’ పెద్దగా అలరించలేదు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review