సమీక్ష : పిశాచి 2 – ఈ పిశాచికి పిల్లలు కూడా భయపడరు

Pisachi 2 movie review

విడుదల తేదీ : ఏప్రిల్ 21, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

దర్శకత్వం : దేవా రాజ్ కుమార్

నిర్మాత : సాయి వెంకట్

సంగీతం : సతీష్ ఆర్యన్

నటీనటులు : రూప్ శెట్టి, రమ్య

2016 లో కన్నడలో విడుదలైన ‘డేంజర్ జోన్’ చిత్రానికి తెలుగు రీమేక్ గా వచ్చిన చిత్రమే ఈ ‘పిశాచి 2’. హారర్ జానర్లో రూపొందిన ఈ సినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియన్స్ ను ఏమాత్రం మెప్పించిందో ఇప్పుడు చూద్దాం..

కథ :

సిటీలోని ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లో పనిచేసే నైన సిటీకి కొద్ది దూరంలో ఉన్న రామా పురం అనే ఊరి అడవిలో మనుషులు వరుసగా చనిపోతుండడాన్ని గమనించి అసలక్కడ ఏముందో తెలుసుకుందామని తన స్నేహితులతో కలిసి డాక్యుమెంటరీని తీయడానికి బయలుదేరుతుంది.

అలా రామా పురం అడవిలోని డేంజర్ జోన్ కు వెళ్లిన నైన, ఆమె ఎనిమిది మంది స్నేహితులు తెలుసుకున్న సంగతులేమిటి ? వారక్కడ ఎలాంటి ఆపదలో పడ్డారు ? చివరికి వారిలో ఎంతమంది మిగిలారు ? ఆ మిగిలిన వాళ్ళు ఎలా బయటపడ్డారు ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే పెద్దగా ఏమీ లేవు. బాగా ఆలోచిస్తే కొన్ని మాత్రం దొరికాయి. హర్రర్ జానర్లో తీసిన సినిమా కాబట్టి ఆరంభంలో ఎలాంటి సుత్తీ లేకుండా నేరుగా హర్రర్ సన్నివేశాలతోనే సినిమాను ప్రారంబించడం బాగుంది. అలాగే హీరోయిన్ ఫ్రెండ్స్ లో నాగ అనే పాత్ర ద్వారా చేయించిన కామెడీ కాస్త ఓవర్ అయినా కూడా కొన్ని చోట్ల మాత్రం నవ్వించింది.

సెకండాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కాస్తంత పర్వాలేదనిపించింది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో కనిపించే హీరోయిన్ శిప్రా గౌర్ హాట్ పెర్ఫార్మెన్స్ మాస్ ఆడియన్సుకు కొంచెం కనెక్టవుతుంది. క్లైమాక్స్ లో వచ్చే పిశాచి తాలూకు సన్నివేశం ఒకదాన్ని మాత్రం బాగానే తీశారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ అడుగడునా కనిపిస్తాయి. ఆరంభంలోనే దర్శకుడు పూర్తి స్వేచ్ఛను తీసుకుని తనకు ఏదనిపిస్తే దాన్నే సన్నివేశాలలో ఇరికించేయడంతో సినిమా చాలా చోట్ల లాజిక్ లేకుండా తయారైంది. హర్రర్ సినిమా అంటే ఎఫెక్టులు ఎక్కువగా ఉండాలనే ఆత్రంలో ప్రతి సీన్లోనూ ఏదో ఒక ఎఫెక్ట్ ను పెట్టి ప్రేక్షకుల్ని భయపెట్టి తీరాలన్న దర్శకుడి ప్రయత్నం పూర్తిగా దెబ్బతిని సినిమాను చాలా వరకు చెడగొట్టింది.

ఇక హీరోయిన్ స్నేహితులపై నడిచే కథనం చాలా చోట్ల ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా నటులు ఒక్కరిలో కూడా నటనా ప్రతిభ లేకపోవడంతో సన్నివేశాలు చాలా వరకు తేలిపోయాయి. అలాగే అడవిలోకి వెళ్లిన అందరూ ఒక్కొక్కరూ వరుస పెట్టి ఒకే విధంగా చనిపోయే సీన్లు ఏమాత్రం ఆకట్టుకోలేదు. కథలో నాగ అనే పాత్ర ద్వారా చేయించిన కామెడీ తక్కువ సందర్భాల్లో బాగున్నా ఎక్కువ చోట్ల చిరాకు పెట్టించింది.

సినిమా క్లైమాక్స్ సయమం ఆసన్నమయ్యాక దర్శకుడు నడిపిన కథనం చూస్తే మరీ సిల్లీగా అనిపించింది. అందులోని కొన్ని విషయాలను చూస్తే ఇలా కూడా జరుగుతుందా అనిపించింది. చివరగా క్లైమాక్స్ సన్నివేశాన్ని సాగదీసి సాగదీసి ఎప్పుడెప్పుడు శుభం కార్డు పడుతుందా లేచి వెళ్లిపోదామా అనుకునేలా చేశారు

సాంకేతిక విభాగం :

దర్శకుడు దేవరాజ్ కుమార్ రాసుకున్న కథ కాస్తలో కాస్త పర్వాలేదనిపించినా దాన్ని సినిమాగా తీసేందుకు కావాల్సిన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఆరంభం నుండి చివరి దాకా ఎక్కడా ఆకట్టుకునే కథనాన్ని, భయపెట్టే సన్నివేశాల్ని అందివ్వలేకపోయారు.

సతీష్ ఆర్యన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలకు ఇచ్చిన సంగీతం రెండూ వినదగ్గవిగా లేవు. శివ వై ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకోలేదు. ఇంకా కొన్ని అనవసరపు సీన్లను కట్ చేసి ఉండాల్సింది. వినాష్ మూర్తి సినిమాటోగ్రఫీ కూడా ఎక్కడా ఒక హర్రర్ సినిమాకు ఉండవలసిన రీతిలో లేదు. ఇకపోతే నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు పర్వావాలేదనిపించే స్థాయిలో మాత్రమే ఉన్నాయి.

తీర్పు :

దర్శకత్వం, కథన రచనలో లోపాలుంటే సినిమా ఎంత దారుణంగా తయారవుతుందో ఈ సినిమాను చూస్తే అర్థమైపోతుంది. అక్కడక్కడా పర్వాలేదనిపించిన కామెడీ, కాస్తంత బాగున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఒకే ఒక హార్రర్ సీన్ ఇందులో ప్లస్ పాయింట్స్ కాగా ఎక్కడా ఆకట్టుకోని కథనం, విసిగించిన లాజిక్ లేని సన్నివేశాలు, పరిణితి లేని నటీనటుల నటన వంటి బలహీన అంశాలు సినిమాను పూర్తిగా చెడగొట్టాయి. మొత్తం మీద చెప్పాలంటే ఏమాత్రం విషయంలేని ఈ పిశాచికి పిల్లలు కూడా భయపడరు.

123telugu.com Rating : 1.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :