ఓటీటీ సమీక్ష: “ప్రియురాలు” – తెలుగు చిత్రం సోని లివ్‌లో ప్రసారం

Priyuraalu Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 17, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: పృథ్వీ మేడవరం, కౌశిక్ రెడ్డి, కలపల మౌనిక, సాయి కామాక్షి భాస్కర్ల తదితరులు

దర్శకుడు: రామరాజు
నిర్మాతలు: అజయ్ కార్లపూడి, రామరాజు
సంగీత దర్శకుడు: సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫీ: మహి పి రెడ్డి

ఎడిటర్: సాయి రేవంత్


ప్రస్తుతం మేము కొనసాగిస్తున్న పలు డైరెక్ట్ స్ట్రీమింగ్ షోస్ మరియు సినిమాలు, సిరీస్‌ల సమీక్షల పరంపరలో భాగంగా తాజాగా ఎంచుకున్న చిత్రం “ప్రియురాలు”. ఈ చిత్రం నేడు “సోనీ లివ్‌లో విడుదల అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ:

హైదరాబాద్‌లోని ఓ న్యూస్ ఛానల్‌లో మాధవ(పృథ్వీ మేడవరం) పనిచేస్తుంటాడు. దివ్య (మౌనిక) జీఆర్ఈ కోచింగ్ కోసం సొంతూరు వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తుంది. దివ్య ఫ్రెండ్స్ ఉన్న అపార్ట్‌మెంట్‌లోనే మాధవ కూడా ఉంటాడు. అయితే అనుకోకుండా దివ్య మాధవను చూడడం, వీరిద్దరి మధ్య ప్రేమ మొదలై అది హద్దులు దాటే వరకు వెళ్లడం జరుగుతుంది. ఈ సమయంలో మాధవ తనకు పెళ్లి అయ్యిందని దివ్యకు చెబుతాడు. ఇదే తరహాలో అదే అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న కౌశిక్ రెడ్డికి అదే అపార్ట్‌మెంట్‌లో పని కోసం వచ్చే సరిత (కామాక్షి)తో రిలేషన్ ఏర్పడుతుంది. ఈ క్రమంలో వీరిద్దరి జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి? చివరి వరకు వారి వారి రిలేషన్ షిప్ కొనసాగుతుందా? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాను సోని లివ్‌లో చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన నటీనటుల నటన చాలా బాగుందనే చెప్పాలి. అందరికి ఇది డెబ్యూ మూవీ అయినా కూడా నేచురల్ నటనతో ఆకట్టుకున్నారు. దర్శకుడు రాసుకున్న కథనానికి ఎమోషనల్ టచ్ జోడించడం బాగా కలిసొచ్చింది. ఈ తరం జనరేషన్‌లో జరుగుతున్న సెన్సిటివ్ రియాలిటీని ఎంతో అందంగా, రొమాంటిక్‌ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. క్లైమాక్స్ బాగా ముగించారు.

ఫుల్ ఎమోషనల్ రొమాంటిక్ సినిమా అయినప్పట్టికీ ఓ మీడియా ఛానల్ ద్వారా కాసేపు హాస్యాన్ని జనరేట్ చేయడం నవ్వులు పూయించింది. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ ఇచ్చిన సంగీతం ఆకట్టుకుంది. ఎడిటింగ్, కెమెరా పనితీరు కూడా బాగుంది.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమా దర్శకుడు తను రాసుకున్న రొమాంటిక్ కథనానికి ఎమోషన్ జోడించడం బాగుంది కానీ ఫస్టాఫ్ మొత్తం కేవలం రొమాంటిక్ సన్నివేశాలనే చూపించడం సాగదీతలా అనిపించింది. రొమాంటిక్‌ని తగ్గించి కాస్త లవ్ యాంగిల్‌ని బెటర్‌గా చూపించి ఉంటే బాగుండేదని అనిపించింది. కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయ్యాయి. పెద్దగా సాంగ్స్ కూడా లేకపోవడం సినిమాకి ఓ డ్రా బ్యాక్ అనే చెప్పాలి.

సాంకేతిక విభాగం:

దర్శకుడు రామరాజు గారు రాసుకున్న చక్కటి రొమాంటిక్ కథనానికి క్లైమాక్స్‌లో ఇచ్చిన ఎమోషనల్ టచ్ బాగుంది కానీ కాస్త రొమాంటిక్ సన్నివేశాలను తగ్గించి తాను చెప్పాలనుకున్న పాయింట్‌పై దృష్టి పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది. స్క్రీన్ ప్లే కూడా డల్‌గా అనిపించింది. మహి పి రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. సునీల్ కశ్యప్ కూడా చక్కటి సంగీతాన్ని అందించారు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన “ప్రియురాలు” సినిమా రొమాంటిక్ ఎక్కువయ్యిందన్న విషయం పక్కన పెడితే చివరలో ఎమోషనల్ టచ్ మాత్రం పర్వాలేదనిపించింది. ఇక కొన్ని లాజిక్‌లు మిస్ అయ్యింది కూడా మినహాయిస్తే రొమాంటిక్ సినిమాలను కోరుకునే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :