సమీక్ష : రచయిత – ఇంప్రెస్ చేయలేకపోయాడు

Rachayita movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 17, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : విద్యాసాగర్ రాజు, సంచిత పదుకొనే

దర్శకత్వం : విద్యాసాగర్ రాజు

నిర్మాత : కళ్యాణ్ ధూళిపాళ్ల

సంగీతం : జెబి, షాన్ రెహమాన్

సినిమాటోగ్రఫర్ : సాయి శ్రీరామ్

ఎడిటర్ : ప్రవీణ్ పూడి

నటుడు విద్యాసాగర్ రాజు హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించిన చిత్రం ‘రచయిత’. సీనియర్ నటుడు జగపతిబాబు ప్రత్యేక శ్రద్ద తీసుకుని ప్రమోట్ చేసిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ప్రముఖ రచయిత ఆదిత్య వర్మ (విద్యాసాగర్ రాజు) చిన్నతనంలో ప్రేమించిన అమ్మాయి పద్మావతి (సంచిత పదుకొనే)ని పెళ్లి చేసుకోవడానికి ఆమె ఇంటికి వెళ్లి ఆమె తండ్రిని అడుగుతాడు. అప్పటికే భాధాకరమైన గతంతో భాదపడుతున్న పద్మావతికి నచ్చజెప్పి పెళ్ళికి ఒప్పించాలని ప్రయత్నిస్తుంటారు ఆమె తల్లిదండ్రులు.

అదే సమయంలో ఆదిత్య వర్మ కొత్త కథ రాయడానికి ప్రశాంతత కోసం దూర ప్రాంతంలో ఉన్న తన ఇంటికి వెళుతూ పద్మావతిని కూడా తీసుకెళతాడు. కానీ అక్కడ కూడ పద్మావతిని ఆమె గతం వెంటాడుతుంటుంది. ఆ గతమేమిటి, ఆ గతం నుండి ఆమెను ఆదిత్య వర్మ ఎలా బయటికి తీసుకొచ్చాడు, చివరికి పద్మావతి ఆదిత్య ప్రేమను అంగీకరించిందా లేదా అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని ప్రధాన ప్లస్ పాయింట్ కథా నాయకుడు విద్యాసాగర్ రాజు పోషించిన రచయిత పాత్ర. కొన్ని దశాబ్దాల క్రితం రచయితలు ఎలా ఉండేవారు, వారి విలువలు ఎలా ఉంటాయి అనే అంశాల్ని వేషధారణ, బాడీ లాంగ్వేజ్, మాటలతో బాగా చూపించారు విద్యాసాగర్ రాజు. అంతేగాక ఆ పాత్రలో ఆయన నటన కూడా బాగుంది. బరువైన, అర్థవంతమైన డైలాగ్స్ పలుకుతూ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారాయన.

అలాగే హీరోయిన్ సంచిత పదుకొనే కూడ పద్మావతిగా మంచి నాటన కనబర్చింది. ద్వితీయార్థంలో ఆదిత్య వర్మ పాత్రపై వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ప్రీ క్లైమాక్ లో రివీల్ అయ్యే పద్మావతి గతం కూడ కొంత ఆసక్తికరంగా అనిపించింది. కొన్ని చోట్ల నైపథ్య సంగీతం, సినిమా మొత్తం వినిపించే ఒక రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో రెండు ప్రధాన పాత్రలు, వాటి నైపథ్యాలు, వాటిలో నటీ నటుల నటన బాగానే ఉన్నా సరైన కథ అనేది లేకపోవడంతో ఫలితం దెబ్బతింది. కథానాయికను వెంటాడే గతం నుండి ఆమెను బయటకు తీసుకొచ్చే కథానాయకుడి ప్రయత్నం అనే అంశం ప్రధానంగా కలిగిన ఈ సినిమా చాలా చోట్ల వేరే వేరే అంశాల మీదికి మళ్ళి ప్రేక్షకుడికి ప్రధాన అంశమే గుర్తులేకుండా చేసింది.

మొదటి అర్థ భాగాన్ని ఎలాంటి కథా రివీల్ చేయకుండా లెంగ్తీ సన్నివేశాలతో లాగించేసిన దర్శకుడు ఇంటర్వెల్ బ్యాంగ్ కూడ ఏమంత గొప్పగా ఇవ్వలేదు. ద్వితీయార్థంలో అనవసరమైన సన్నివేశాలు ఎక్కువయ్యాయి. హీరో, హీరోయిన్లు మాట్లాడే మాటలు అర్థవంతంగానే ఉన్నా మరీ పొడవుగా ఉండటంతో కొన్ని సెకన్లలోనే వాటిని మర్చిపోతారు ప్రేక్షకులు.

ఇక సెకండాఫ్ కామెడీ కోసం అన్నట్టు ప్రవేశపెట్టిన శిష్యుడి పాత్ర ఒకటి అప్పటి వరకు ఉన్న కాస్త సీరియస్ నెస్ ను కూడ చంపేసింది. ఆ పాత్ర చేసిన నటుడు వేషధారణ, మాటలు, హావభావాలు చిరాకు పెట్టాయి. ఇక క్లైమాక్స్ కూడ చిన్నపాటి ట్విస్ట్ మినహా ఎక్కడా ఎగ్జైట్ చేయలేకపోయింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు విద్యాసాగర్ రాజు తను పోషించిన రచయిత పాత్రను బాగానే రాసుకుని, స్క్రీన్ మీద కూడా అంతే బాగా పండించినా కథలో బలం, కథనంలో ఆసక్తి కలిగించే అంశాలను చేర్చుకోలేకపోయారు. దీంతో చిత్రం చాలా వరకు బోర్ కొట్టేసింది. జెబి, షాన్ రెహమాన్ ల సంగీతం పర్వాలేదని స్థాయిలో మాత్రమే ఉంది.

ప్రవీణ్ పూడి తన ఎడిటింగ్ ద్వారా ఫస్టాఫ్, సెకండాఫ్ లలో కొన్ని అనవసరమైన సన్నివేశాల్ని తొలగించాల్సింది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే అనే స్థాయిలో మాత్రమే ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ పనితనం చల్ తక్కువ స్థాయిలో ఉంది. కళ్యాణ్ ధూళిపాళ్ల పర్వాలేదనిపించాయి.

తీర్పు :

టైటిల్ తో ఆసక్తిని కలిగించిన ఈ ‘రచయిత’ చిత్రంలో ఏమంత ఆసక్తికరమైన విషయం లేదు. కథలో కీలకమైన హీరో హీరోయిన్ల పాత్రల చిత్రీకరణ, వాటిలో విద్యాసాగర్ రాజు, సంచిత పదుకొనేల నటన, రెండు సన్నివేశాలు, ఒక చిన్నపాటి ట్విస్ట్ ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా సంతృప్తి పరచలేకపోయిన కథ, కథనాలు, అనవసరమైన సన్నివేశాలు ఎక్కువవడం, ముఖ్యమైన ఇంటర్వెల్, క్లైమాక్స్ రెండూ పేలవంగానే ఉండటం నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ‘రచయిత’ ప్రేక్షకుడ్ని పెద్దగా ఇంప్రెస్ చేయదు.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

 
Like us on Facebook