సమీక్ష : లింగ – రజినీకాంత్ అభిమానులకు మాత్రమే.!

సమీక్ష : లింగ – రజినీకాంత్ అభిమానులకు మాత్రమే.!

Published on Dec 13, 2014 1:00 PM IST
Lingaa_telugu-review-1 విడుదల తేదీ : 12 డిసెంబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : కెఎస్ రవికుమార్
నిర్మాత : రాక్ లైన్ వెంకటేష్
సంగీతం : ఎఆర్ రెహమాన్
నటీనటులు : రజినీకాంత్, అనుష్క, సోనాక్షి

‘రోబో’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన డైరెక్ట్ సినిమా ‘లింగ’. రజినీకాంత్ తో ‘ముత్తు’, ‘నరసింహా’ లాంటి బిగ్గెస్ట్ హిట్స్ తీసిన కెఎస్ రవికుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. రజినీకాంత్ కెరీర్లో మొదటిసారిగా తన పుట్టిన రోజు నాడు ‘లింగ’ సినిమా రిలీజ్ అవుతోంది. రెండు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ చుట్టూ తిరిగే ఈ లింగ కథలో రజినీకాంత్ ద్విపాత్రాభినయంలో కనిపించాడు. గ్లామరస్ బ్యూటీస్ అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. మరి రజినీకాంత్ – కెఎస్ రవికుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూడవ సినిమా హ్యాట్రిక్ హిట్ గా నిలిచిందో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :

సింగనూర్ లో ఈ సినిమా కథ మొదలవుతుంది.. ఆ ఊర్లో గత 75 ఏళ్లగా మూసివేసిన శివాలయంని తెరవాలనుకుంటారు..అందుకోసం ఆ గుడి కట్టించిన రాజా లింగేశ్వరన్ (రజినీకాంత్) వారసుడే వచ్చి ఓపెన్ చెయ్యాలి అని ఆ ఊరి పెద్ద అయిన కె. విశ్వనాధ్ చెబుతాడు.. దాంతో ఆ వారసున్ని వెతికే పనిలో పడతాడు..

కట్ చేస్తే లింగ(రజినీకాంత్) హైదరబాద్ లో ఓ బ్యాచ్ తో కలిసి దొంగతనాలు చేస్తుంటాడు. అతనే వారసుడని వెతికి పట్టుకున్న పబ్లిక్ చానల్ రిపోర్టర్ లక్ష్మీ(అనుష్క) లింగని తన ఊరు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది, దానికి లింగ ఒప్పుకోకపోవడంతో ఓ ప్లాన్ వేస్తుంది. అలా లింగ సింగనూర్ కి వస్తాడు. అక్కడికి వచ్చాక లింగకి ఆ ఊరి డామ్ కట్టించిన రాజా లింగేశ్వరన్(రజినీకాంత్) గురించి తెలుస్తుంది. అలాగే ఆ డామ్ త్వరలో చిక్కుల్లో పడనుందని తెలుస్తుంది. అసలు రాజా లింగేశ్వరన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏమిటి.? రాజా లింగేశ్వరన్ ఆ డామ్ కట్టడానికి ఏమేమి చేసాడు.? అసలు లింగకి లింగేశ్వరన్ కి ఉన్న ఒరిజినల్ సంబంధం ఏమిటి.? ఆ ఊరికి వచ్చిన సమస్యను లింగ ఎలా పరిష్కరించాడు.? అన్నది మీరు సిల్వర్ స్క్రీన్ పైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

ముందుగా ‘లింగ’ సినిమా ఓవరాల్ గా ఎలా ఉందనేది పక్కన పెడితే, ఈ సినిమాలో నటీనటులు అంతా స్టార్స్, అలాగే పనిచేసిన టెక్నీషియన్స్ కూడా నేషనల్ లెవల్ టెక్నీషియన్స్.. కానీ ఇంతమంది స్టార్స్ ఉన్నా ఇంత హై క్వాలిటీ సినిమాని 6 నెలల్లో ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి పక్కగా అనుకుంటే అనుకున్న టైంలో సినిమా తీయచ్చు అనే స్ఫూర్తిని ఇచ్చిన ఈ చిత్ర టీంలోని ప్రతి ఒక్కరికి నా సెల్యూట్..

తలైవా సినిమా అన్నాక ఆ సినిమాకి ఫస్ట్ ప్లస్ పాయింట్ సూపర్ స్టార్ రజినీకాంత్ కాక మరెవరు అవుతారు. సూపర్ స్టార్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించాడు. అందులో 1939 ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రజినీకాంత్ పెర్ఫార్మన్స్ సినిమాకి మేజర్ హైలైట్ గా నిలిచింది. ఆ ఎపిసోడ్ లో రజినీ లుక్స్ పరంగా చాలా స్టైలిష్ గా ఉండడమే కాకుండా, అక్కడ చెప్పే కొన్ని పంచ్ డైలాగ్స్ బాగుంటాయి. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ లో వచ్చే ట్రైన్ ఫైట్, ఓ పవర్ఫుల్ పంచ్ లా అనిపించే ఇంటర్వల్ బ్లాక్ సినిమాకి హైలైట్ అయ్యాయి. ఇకపోతే ప్రస్తుతంలో కనిపించే యంగ్ రజినీకాంత్ ఆడియన్స్ ని కాస్త నవ్విస్తాడు. రజినీకాంత్ – సంతానం – అనుష్క కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ఆడియన్స్ ని బాగా నవ్విస్తాయి.

ఇకపోతే హీరోయిన్స్ అనుష్క, సోనాక్షి సిన్హాల గురించి చెప్పాలి. అనుష్క మోడ్రన్ లుక్ లో కనిపిస్తూ గ్లామర్ తో ఆకట్టుకుంది. అలాగే రజినీకాంత్ తో కలిసి చేసిన కొన్ని కామెడీ సీన్స్ బాగా చేసింది. ఇక 1939 ఎపిసోడ్ లో కనిపించే సోనాక్షి సిన్హా అప్పటి లుక్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయినా పాత్రకి మాత్రం పెద్ద ప్రాముఖ్యత లేదు. ఇకపోతే ఈ సినిమాలో కనిపించిన కమెడియన్ సంతానం చెప్పే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ బి, సి సెంటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాగే పోలీస్ ఆఫీసర్ గా ఒక సీన్ లో బ్రహ్మానందం కాసేపు నవ్వించాడు. ఇక కె. విశ్వనాధ్ లాంటి సీనియర్ నటులు తమ పాత్రలకు న్యాయం చేసారు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ ఎపిసోడ్స్, అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఇంటర్వల్ బ్లాక్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా రత్నవేలు విజువల్స్, సబు సైరిల్ – సంజిత్ ఆర్ట్ డిపార్ట్ మెంట్ వర్క్ చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మేజర్ మైనస్ పాయింట్ అంటే ముందుగా చెప్పాల్సింది రన్ టైం. అనుకున్న కథని కనీసం రెండున్నర గంటల్లో అన్నా చెప్పడానికి ట్రై చెయ్యకుండా డైరెక్టర్ కెఎస్ రవికుమార్ అనవసరపు కామెడీ సీన్స్, ట్రాక్స్ పెట్టి మూడు గంటలు చేసాడు. దాంతో చూసే ఆడియన్స్ కి పిచ్చ బోర్ కొడుతుంది. ఫస్ట్ ఇంటర్వల్ వరకూ బాగానే తీసుకుంటూ వచ్చిన డైరెక్టర్ సెకండాఫ్ మొత్తం ఆ డామ్ దగ్గర ఉంచేసాడు. అస్సలు ముందుకు తీసుకెళ్ళలేదు. ఫస్ట్ హాఫ్ సగంలో మొదలైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ క్లైమాక్స్ వరకూ సాగుతుంది. దాన్నిబట్టే సినిమాని ఎంత సాగదీసారు అన్నది తెలుసుకోవచ్చు. సరే పోనీ ఫ్లాష్ బ్యాక్ ఫినిష్ చేసి సూపర్బ్ ఎపిసోడ్ తో క్లైమాక్స్ ఫినిష్ చేసాడా అంటే అదీ లేదు.. ఎందుకంటే అప్పటికే నిరాశ పరిచిన ఈ సినిమా క్లైమాక్స్ చూసాక ఇంకా దారుణమైన ఫీలింగ్ కలిగేలా చేస్తుంది.

ఈ సినిమా కథని మనం చాలా కాలం నుంచి చూస్తూనే ఉన్నాం. కథే బాలేదు అనుకుంటే కథనం దానికన్నా దారుణంగా తయారైంది. అస్సలు సినిమాలో ఆడియన్స్ ఊహించనిది ఏమీ జరగదు. అలాగే విలన్ అనే పాత్ర ఎక్కడా హీరోకి టఫ్ పోటీని ఇవ్వదు. అటు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో, ఇటు జగపతి బాబు పాత్ర సినిమాకి చాలా మైనస్ అయ్యాయి. విలన్ స్ట్రాంగ్ గా ఉంటేనే హీరోయిజం పండుతుంది అనే విషయాన్ని డైరెక్టర్ ఎలా మిస్ అయ్యాడో.. ఇకపోతే రజినీకాంత్ సినిమాలో పాటలన్నీ బాగా హిట్ అవుతాయి. విజువల్స్ పరంగా ఓకే అనుకున్నా పాటలేవీ పెద్దగా బాగోలేకపోవడం వలన ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వరు. ఇదంతా ఒక ఎత్తు ఐతే ఈ సినిమాలో మనకు చాలా తెలుగు సినిమాల్లోని సీన్స్ యాజిటీజ్ గా కనిపిస్తాయి. అలాగే లాజికల్ గా మాత్రం ఈ మూవీ చాలా పూర్ గా ఉంటుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో చెప్పుకోవాల్సిన డిపార్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ రత్నవేలు గురించి.. రత్నవేలు రజినీ, సోనాక్షి, అనుష్కలని చాలా బాగా చూపించాడు. అది పక్కన పెడితే ఆయన చూపించిన ప్రతి లొకేషన్, ప్రతి ఫ్రేం ఆడియన్స్ ని థ్రిల్ చేసేలా ఉంటుంది. ముఖ్యంగా ఇంత తక్కువ టైంలో తీసిన ఈ మూవీకి ఇంత హై క్వాలిటీ విజువల్స్ అందించినందుకు తనకి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ఆర్ట్ డైరెక్టర్ సనత్ డిజైన్ చేసిన సెట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే అతను డిజైన్ చేసిన వారికి సబు సైరిల్ అందించిన ప్రొడక్షన్ డిజైన్స్ సూపర్బ్ అని చెప్పాలి. తను డిజైన్ చేసిన విజువల్ ఎఫెక్ట్స్ కూడా సినిమాలోని ఫీల్ ని మరింత పెంచేలా ఉన్నాయి. ఎఆర్ రెహమాన్ అందించిన పాటలు సినిమాకి పెద్దగా హెల్ప్ అవ్వలేదు, కానీ ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఆడియన్స్ లో కాస్త ఊపు తెస్తుంది. ముఖ్యంగా రజినీకాంత్ కౌంటర్ టాక్ ఇచ్చే సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ లో ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. ఎడిటర్ సంజిత్ డైరెక్టర్ తో కచ్చితంగా చెప్పి లెంగ్త్ ని తగ్గించడానికి ట్రై చెయ్యాల్సింది. సెకండాఫ్ లో ఎడిటర్ పనితనం కూసింత కూడా కనిపించదు.

ఇక చెప్పాల్సింది కథ అందించిన పొన్ కుమరన్ – కథ చాలా పాత కాలం నాటిది.. ఒక హీరో అతనికి ఫ్లాష్ బ్యాక్, అందులో ప్రజల కోసం పోరాటం ఆయన చనిపోవడం దాన్ని వాళ్ళ వారసుడు పూర్తి చేయడం ఇది నేను నా చిన్నప్పటి నుంచే చూస్తున్నాను. సరే ఇందులో కొత్తగా ఏమన్నా రాసారా అంటే అదీ లేదు. అంతే కాకుండా తెలుగు సినిమాల్లో వచ్చిన కొన్ని సీన్స్ ఇందులో యాజిటీజ్ గా కనిపిస్తాయి. ఇక కెఎస్ రవికుమార్ కథనం – దర్శకత్వానికి వస్తే.. కథనం – చాలా నీరసంగా ఉంది, ఇంత పెద్ద సినిమాలో మనం ఊహించిందే ఉంటే ఆడియన్స్ నిరాశపడక ఏమి చేస్తారు. ఇక డైరెక్షన్ అంటారా రజినితో రెండు హిట్ సినిమాలు తీసి కూడా ఎలాంటి సినిమా తీయాలో తెలియక కన్ఫ్యూజన్ లో రవికుమార్ ఇలా నిరాశపరిచే సినిమాని తీసారని చెప్పాలి. కెఎస్ రవికుమార్ సినీ అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాణ విలువలు బాగా గ్రాండ్ గా ఉన్నాయి. ఆయన లోకేషన్స్ కి, సెట్స్ కి ఎంత ఖర్చు పెట్టినా ఆయన పెట్టిన దాన్లో ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా ఈ చిత్ర టీం కేర్ తీసుకొని సూపర్బ్ గ్రాండ్ ఫిల్మ్ ని అందజేసింది.

తీర్పు :

నాలుగేళ్ల తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లింగ’ సినిమా రజినీ అభిమానులను మాత్రమే సంతృప్తి పరచగలిగింది. రజినీకాంత్ నుంచి ఆశించే బేసిక్ మారిజమ్స్, పంచ్ డైలాగ్స్ కూడా ఇందులో లేకపోవడంతో ఆడియన్స్ తీవ్ర నిరాశకి గురవుతారు. అసలు రజినీతో ‘ముత్తు’, ‘నరసింహా’ లాంటి సినిమాలు తీసిన కెఎస్ రవికుమార్ ఏనా ఈ సినిమా తీసింది అనే ఫీలింగ్ ని ఆడియన్స్ కి కలిగించాడు అంటే డైరెక్టర్ గా రవికుమార్ ఏ రేంజ్ లో ఫెయిల్ అయ్యాడో నేను మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా.. ఓవరాల్ గా రజినీకాంత్ కి డై హార్డ్ ఫ్యాన్స్ అయిన వారికి ఈ సినిమా ఓ మేరకు నచ్చుతుంది, కానీ ఈ నాలుగేళ్ల గ్యాప్ ని మాత్రం భర్తీ చేయలేకపోయింది. మిగతా వారందరికీ ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండాఫ్ ని బెటర్ గా తీసుంటే బాగుండేది అనే ఫీలింగ్ వస్తుంది. ఫైనల్ గా రజినీకాంత్ పెర్ఫార్మన్స్, ఫస్ట్ హాఫ్, గ్రాండ్ విజువల్స్, సూపర్ ఆర్ట్ వర్క్ ఈ సినిమాకి ప్లస్ అయితే ఓల్డ్ అండ్ రొటీన్ కథ, అంతకన్నా రొటీన్ గా అనిపించే కథనం, డైరెక్షన్, సెకండాఫ్ సెహ్ప్పదగిన మైనస్ పాయింట్స్. ఫైనల్ గా ‘లింగ’ అనే సినిమా ఓన్లీ ఫర్ తలైవా ఫ్యాన్స్.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు