సమీక్ష : ‘రాజ్యాధికారం’ – బోర్ కొట్టించిన ఆర్.నారాయణమూర్తి మార్క్ ఎంటర్టైనర్

rajadikaram విడుదల తేదీ : 21 నవంబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2/5
దర్శకత్వం : ఆర్.నారాయణమూర్తి
నిర్మాత : ఆర్.నారాయణమూర్తి
సంగీతం : ఆర్.నారాయణమూర్తి
నటీనటులు : ఆర్. నారాయణమూర్తి, తనికెళ్ళ భరణి, ఎల్బీ శ్రీరాం, తెలంగాణ శకుంతల


గత ముప్ఫై ఏళ్లుగా సినిమా ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ఆర్.నారాయణమూర్తి. విప్లవ భావాలు కల సినిమాలను మాత్రమే తీస్తూ వచ్చారు. తాజాగా ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘రాజ్యాధికారం’ సినిమా నేడు విడుదలయింది. ఈ సినిమాలో నాలుగు పాత్రలు పోషించడంతో పాటు సంగీత, ఎడిటింగ్ భాద్యతలను కూడా నిర్వర్తించారు. ఎన్నికల నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందొ..? ఒకసారి చూద్దాం.

కథ :

సూరారం గ్రామంలో గల రామన్న(ఆర్.నారాయణమూర్తి) రైతుగా మారిన ఒకప్పటి దళితు రైతు కూలి. దళితుల, రైతుల హక్కుల కోసం పోరాడుతుంటాడు. ఇది ఆ గ్రామ సర్పంచ్ అయిన పోలేరమ్మ(తెలంగాణ శకుంతల), మంత్రి అయిన ఆమె సోదరుడు (తనికెళ్ళ భరణి) సహించరు. సరిగ్గా ఆ సమయంలో ఎన్నికలు వస్తాయి. రామన్న, అతని అనుచరులు పోలేరమ్మ వ్యతిరేక వర్గానికి మద్దతు పలుకుతారు. ఆగ్రహంతో రగిలిపోయిన మంత్రి, పోలేరమ్మలు ‘రాజ్యాధికారాన్ని’ అడ్డం పెట్టుకుని రామయ్య కుటుంబాన్ని, ఆ ఊరిలో దళితులను చిత్ర హింసలకు గురిచేస్తారు. రాష్ట్రంలో మత ఘర్షణలను సృష్టిస్తారు.

మంత్రి, పోలేరమ్మల రాజ్యాధికారాన్ని రామన్న ఎలా ఎదుర్కున్నాడు..? ప్రజలను కష్టాల నుండి విముక్తి చేయడం కోసం ఎటువంటి పోరాటం చేశాడు..? ఈ పోరాటంలో అతని కుమారులు అర్జునుడు, శంకరన్న, యాకూబ్ ల పాత్ర ఏమిటి..? చివరకు రాజ్యాధికారాన్ని సాధించారా..? లేదా..? అనేది మిగతా సినిమా.

ప్లస్ పాయింట్స్ :

తన గళంతో వందేమాతరం శ్రీనివాస్ సినిమాకు ప్రాణం పోశారు. వందేమాతరం పాడిన ప్రతి పాట జనరంజకంగా ఉంది. రొటీన్ సన్నివేశాలతో బోర్ కొట్టిస్తున్న సినిమాకు మధ్య మధ్యలో ఆక్సిజన్ అందించారు. తర్వాత ఈ సినిమాకు ప్రధాన బలం ఆర్.నారాయణమూర్తి. కర్త, కర్మ, క్రియ అన్నీ తానై సినిమాను నడిపించారు. రామన్న పాత్రలో ఆర్.నారాయణమూర్తి నటన బాగుంది. కీలక పాత్రలలో నటించిన తనికెళ్ళ భరణి, తెలంగాణ శకుంతల, ఎల్బీ శ్రీరాంలు చక్కని నటన కనబరిచారు. టికెట్ ఆశించి బంగపడ్డ రాజకీయ నాయకుడి పరిస్థితి ఎలా ఉంటుంది అనే సన్నివేశం బాగుంది.

మైనస్ పాయింట్స్ :

రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో అధికారం కోసం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, తెరవెనుక మంతనాలు సాగిస్తున్నారు అనే పాయింట్ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రతి రోజూ టీవీ చూసే వారికి ఈ సినిమాలో ఇసుమంతైనా కొత్తదనం కనిపించదు. ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా ఆకట్టుకోదు.

మత ఘర్షణలు జరగడానికి గల చూపించిన కారణాలు నమ్మశక్యంగా లేవు. కుల వివక్ష ఎక్కడో మారుమూల పల్లెలలో ఉందేమో..? ప్రస్తుత సమాజంలో వాటికి తావులేదు. ప్రతి సినిమాలో ఆర్.నారాయణమూర్తి అవే అంశాలను మళ్లీ మళ్లీ చూపించి.. ఏదో ఆశించిన సినిమాకు వచ్చిన ప్రేక్షకులను నిరాశపరుస్తున్నారు.

సినిమాలో నాలుగు పాత్రలను పోషించడం కంటే ఇతరులను ఎవరైనా తీసుకుంటే బాగుండేది. సీరియస్ గా సాగిపోయే పాత్రలలో ఆర్.నారాయణమూర్తి నటనకు వంక పెట్టలేం. అలా అని గెటప్ లు వేరైనా ప్రతి సన్నివేశంలో స్క్రీన్ మీద ఒకే నటుడు కనబడడంతో ప్రేక్షకులు మొనాటనీ ఫీల్ అయ్యారు. ఇతర నటులకు అవకాశం ఇస్తే బాగుండేది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో కథ, కథనం, ఎడిటింగ్, సంగీతం, నిర్మాణం, దర్శకత్వం ఇలా కీలకమైన భాద్యతలు అన్నిటిని ఆర్.నారాయణమూర్తి నిర్వర్తించారు. ఎక్కువ పడవల మీద ఒకేసారి కాలు వేయడంతో కొన్నిసార్లు కంగారు పడ్డారు. రెగ్యులర్ ఆర్.నారాయణమూర్తి సినిమాల తరహాలోనే ఈ సినిమా కూడా సాగింది. పెద్దగా విశ్లేషించడానికి ఏమి లేదు. మార్క్ ఆర్.నారాయణమూర్తి ఎంటర్టైనర్ ‘రాజ్యాధికారం’ అంతే.

తీర్పు :

ఎన్నికల ముందు, తర్వాత రాజకీయ నాయకులు ఎన్ని వేషాలు వేస్తారు..? ప్రజలను ఎలా మోసగిస్తారు..? అనే అంశాలను, కుల వివక్షను, మత ఘర్షణలను ఈ సినిమాలో చూపించారు. రెగ్యులర్ గా టీవీ ఫాలో అయ్యేవారికి ఈ సినిమా కొత్త అనుభూతిని ఇవ్వదు. ‘రాజ్యాధికారం’ సినిమాకు బలం, బలహీనతా రెండు ఆర్.నారాయణమూర్తి అని చెప్పాలి. కథ, కథనం, దర్శకత్వం, నటన ఆర్.నారాయణమూర్తి టిపికల్ స్టైల్ లో సాగిపోయాయి. ముఖ్యంగా సి సెంటర్ ప్రేక్షకులను, విప్లవ భావాలు కలిగిన మూర్తి వీరాభిమానులను ఈ సినిమా ఆకట్టుకునే అవకాశం ఉంది. 30 ఏళ్ళుగా సినిమా తీయడంలో ఆర్.నారాయణమూర్తి ఒకే పంథాను అనుసరించడం ఈ సినిమాకు బలహీనత. సినిమా బోర్ కొడుతుంది.

123తెలుగు. కామ్ రేటింగ్ : 2/5

123తెలుగు టీం

 
Like us on Facebook