సమీక్ష : రక్షక భటుడు – సహనానికి పరీక్ష

Rakshaka Bhatudu movie review

విడుదల తేదీ : మే 12, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : వంశీకృష్ణ ఆకెళ్ళ

నిర్మాత : ఎ. గురురాజ్

సంగీతం : శేఖర్ చంద్ర

నటీనటులు : నందు, రిచా పనాయ్, బ్రహ్మానందం, బ్రహ్మాజి

వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఎస్. గురురాజ్ నిర్మాణంలో రూపొందిన చిత్రమే ఈ ‘రక్షక భటుడు’. ఆరంభం నుండి ఇందులో అసలు కథానాయకుడెవరనే విషయం దాచి పెట్టి సినిమాకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది టీమ్. మరి ఈ క్రేజ్ నడుమ ఈరోజే రిలీజైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

రామ్ (నందు), మైథిలి (రిచా పనాయ్) లు ప్రేమికులు. వరిదద్రూ ఎవరికీ తెలీకుండా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో అరకును దగ్గరలో ఉన్న అనంతగిరి అనే గ్రామం వెళతారు. అక్కడే ఉండే ఒక పోలీస్ స్టేషన్ అన్ని పోలీస్ స్టేషన్ల కన్నా భిన్నంగా ఉంటుంది.

అలా ఆ గ్రామానికి చేరుకున్న నాడు, మైథిలిలు తర్వాత తర్వాత ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కున్నారు ? కథలోకి సంపూర్ణేష్ బాబు ఎలా ఎంటరయ్యాడు ? టీమ్ ముందు నుండి చెబుతున్న ఆ రక్షక భటుడు ఎవరు ? అనే విషయాలే తెరపై నడిచే సినిమా.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకి దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ల ఎంచుకున్న కాన్సెప్ట్ కాస్తంత కొత్తగా ఉంది. హీరోయిన్ రిచా పనాయ్ తన లుక్స్ తో, నటనతో ఆకట్టుకుంది. కొన్ని కామెడీ, రొమాంటిక్ సన్నివేశాల్లో బాగా నటించింది. నటుడు నందు కూడా తన పాత్ర మేర బాగానే నటించాడు.

అలాగే ప్రత్యేక పాత్ర చేసిన సంపూర్ణేష్ బాబు కూడా అక్కడక్కడా మెప్పించాడు. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కీలక సన్నివేశాలకు చాలా బాగా హెల్ప్ అయింది. ఇక కమెడియన్ ధనరాజ్ అయితే తన కేరీర్లోనే అత్యంత సీరియస్, ఇన్నోసెంట్ రోల్ చేసి మెప్పించాడు.

మైనస్ పాయింట్స్ :

డైరెక్టర్ వంశీ కృష్ణ ఎంచుకున్న కాన్సెప్ట్ కొత్తగానే ఉన్నా కథను వివరించిన తీరు మాత్రం అస్సలు బాగోలేదు. సినిమాని మొదలుపెట్టిన సన్నివేశం బాగున్నా ఆ తర్వాత వచ్చే కథనం మొత్తం నీరసంగా సాగి బోర్ కొట్టించింది. దర్శకుడు కథను చెప్పిన ఆ తీరు ఎక్కడా ఆకట్టుకోలేదు. ఇక టాప్ కమెడియన్ బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కూడా సినిమాకి మరొక పెద్ద మైనస్ పాయింట్.

ఆ కామెడీకి సినిమాకు అస్సలు సంబంధం ఉండదు. నవ్వించపోగా బోరింగా అనిపించింది కూడా. పోలీస్ స్టేషన్లో బ్రహ్మాజీ, అతని టీమ్ మీద నడిచే సన్నివేశాలైతే సహనానికి పరీక్షనే చెప్పాలి. వాళ్ళు చేసిన కామెడీలో సీన్లలో ఒక్కదానికి కూడా లాజిక్, సరైన ముగింపు ఉండవు. పాపులర్ నటులైన సుప్రీత్(కాట్రాజ్), కాలకేయ ప్రభాకర్లను సరిగా ఉపయోగించుకోనందున వాళ్లకు సినిమాలో పెద్దగా ప్రాముఖ్యత ఏమీ ఉండదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ సినిమాకు మంచి నైపథ్యాన్ని అయితే ఎంచుకున్నాడు కానీ దాన్ని తెరపై మీద ఆసక్తికరంగా ప్రదర్శించడంలో విఫలమయ్యాడు. అమీర్ రెడ్డి ఎడిటింగ్ అంత బాగో లేదు. అనవసరమైన సన్నివేశాల్ని ఇంకా తొలగించి ఉండాల్సింది. మల్హర్ భట్ సినిమాటోగ్రఫీ బాగుంది. శేఖర్ చంద్ర మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. నిర్మాణ విలువలు చెప్పుకొదగిన స్థాయిలో లేవు.

తీర్పు:

మొత్తం మీద సినిమా ముందు పోస్టర్ తో క్రియేట్ చేసిన హైప్ తప్ప ఈ ‘రక్షక భటుడు’ లో ఇంకేం లేదు. సినిమా నైపథ్యం బాగానే ఉన్నా దర్శకుడు దాన్ని సరిగా ఎగ్జిక్యూట్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. సంపూర్ణేష్ బాబు మాత్రమే తన పాత్రతో కథనానికి కాస్త సీరియస్ నెస్ తీసుకొచ్చి సినిమాను కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ సరిగాలేని నిర్మాణ విలువలు, దర్శకత్వ లోపాలు అతని పెర్ఫార్మెన్స్ ను వెనక్కి నెట్టి సినిమాను బోరింగా తయారుచేశాయి.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review