సమీక్ష: రంగుల రాట్నం – కొంచెం కామెడీ.. కొంచెం ఎమోషన్

14th, January 2018 - 05:40:43 PM
Rangula Raatnam movie review

విడుదల తేదీ : జనవరి 14, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : రాజ్ తరుణ్, చిత్రా శుక్ల

దర్శకత్వం : శ్రీరంజని

నిర్మాత : అన్నపూర్ణ స్టూడియోస్

సంగీతం : శ్రీచరణ్ పాకాల

సినిమాటోగ్రఫర్ : ఎల్.కె.విజయ్

ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్

స్టోరీ, స్క్రీన్ ప్లే : శ్రీరంజని

అక్కినేని నాగార్జున నిర్మాతగా తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించిన మరొక చిత్రం ‘రంగుల రాట్నం’. రాజ్ తరుణ్, చిత్రా శుక్ల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

విష్ణు (రాజ్ తరుణ్) ఒక కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ, తన తల్లి(సితార) తో కలిసి సంతోషంగా జీవించే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. అతని తల్లి మాత్రం అతనికి త్వరగా పెళ్లి చేయాలని ఆశపడుతూ పెళ్లి సంబంధాలు చూస్తుంటుంది.

అలాంటి సమయంలోనే అతను కీర్తి (చిత్రా శుక్ల) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ విషయం తల్లికి చెప్పి ఆ అమ్మాయికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. అమ్మాయి కూడా అతని ప్రేమను అంగీకరిస్తుంది. కానీ ఒక దశలో విష్ణు, కీర్తి ప్రేమను తట్టుకోలేక ఆమెకు దూరం జరుగుతాడు. అలా విష్ణు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ప్రేమను ఎందుకు కాదంటాడు ? మళ్ళీ వాళ్లిద్దరూ కలిశారా లేదా ? అనేదే తెరపై నడిచే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

దర్శకురాలు శ్రీరంజని కేవలం ప్రేమ అనే ఎమోషన్ ను మాత్రమే కాకుండా తల్లీకొడుకుల సెంటిమెంట్ ను కూడా హైలెట్ చేస్తూ కథను రాశారు. దానికి తగ్గట్టే సినిమాలో తల్లి పాత్ర చేసిన సితారకు, రాజ్ తరుణ్ కు మధ్యన చాలా సన్నివేశాలు ఉండేలా చూసుకున్నారు. వాటిలో కొన్ని సీన్స్ బాగానే అలరించాయి కూడ. హీరో స్నేహితుడిగా ప్రియదర్శి రోల్ బాగుంది. సినిమా బోర్ కొడుతోంది అనే సమయానికి టైమింగ్ తో కూడిన తన కామెడీతో నవ్వులు పూయించే ప్రయత్నం చేశారాయన.

ఇక సినిమాకు కీలకమైన సెకండాఫ్ ఫస్టాఫ్ మీద కొంత బెటర్ గా ఉంది. హీరో తనపై హీరోయిన్ చూపించే అతి ప్రేమను, ఓవర్ కేరింగ్ ను తట్టుకోలేక ఇబ్బందిపడటం, ప్రేమను వద్దని చెప్పడం వంటి అంశాలు, వాటి తాలూకు కొన్ని సీన్లు బాగున్నాయి. క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ ను కన్విన్స్ చేయడానికి చేసే చిన్నపాటి సాహసం కొంత థ్రిల్ కలిగిస్తుంది. నిర్మాతగా నాగార్జున మంచి నిర్మాణ విలువల్ని పాటించి క్వాలిటీ ఫిల్మ్ ను చూస్తున్న ఫీలింగ్ కలిగించారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు అతి పెద్ద మైనస్ ప్రధాన పాత్రల మధ్యన కెమిస్ట్రీ సరిగా కుదరలేదు. తల్లిగా సితార పాత్ర బాగున్నా, కొడుకుగా రాజ్ తరుణ్ ఆమెకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయాడు. దీంతో కొన్ని సన్నివేశాలు బాగున్నా సెంటిమెంట్ పూర్తిస్థాయిలో ప్రేక్షకుడ్ని కదిలించలేకపోయింది. అలాగే హీరో, హీరోయిన్ కు మధ్యన కూడా కెమిస్ట్రీ చాలా వరకు కుదరలేదు. హీరోయిన్ చిత్రా శుక్ల లుక్స్ పరంగా హీరో కంటే కొంచెం పెద్దగా కనిపించడం, వారిద్దరి మధ్యన రొమాంటిక్ సీన్స్ అసలే లేకపోవడంతో ఆద్యంతం ఒక ప్రేమ జంటను చూస్తున్న బలమైన ఫీలింగ్ కలుగలేదు.

ముఖ్యంగా ఫస్టాఫ్ మొత్తం కాసేపు తల్లి, కొడుకులు, ఇంకాసేపు ప్రేమికులు, ఇంకాసేపు స్నేహం అంటూ మూడు రకాల అంశాల చుట్టూ తిరగడం వలన దేన్నీ పూర్తిస్థాయిలో ఎలివేట్ చేయలేక చాలా రొటీన్ గా, కొంత బోరింగ్ గా తయారైంది. అలాగే సెకండాఫ్ సైతం ఒక పది నిముషాలు, క్లైమాక్స్ మినహా మిగతా మొత్తం బలంలేని సన్నివేశాలతో, ప్రేక్షకుడ్ని కదిలించలేని పాత్రలతో నిండి చాలా నార్మల్ గానే ముగిసిపోయింది.

రాజ్ తరుణ్ చేసిన ప్రతి సినిమాలో ఆయన పాత్రలో ఏదో ఒక చిన్న కనెక్టివిటీ ఉంది ప్రేక్షకుడ్ని అలరిస్తూ ఉంటుంది. కానీ ఈ సినిమాలో అదే లోపంచింది. డబ్బింగ్ కు హీరోయిన్ లిప్ సింక్ అస్సలు కుదరక చాలా చోట్ల నిరుత్సాహని కలిగించింది.

సాంకేతిక విభాగం :

ఒకే కథలో ప్రేమ, మధర్ సెంటిమెంట్, స్నేహం వంటి మూడు అంశాల్ని చూపాలనే దర్శకురాలు శ్రీరంజని ఆలోచన బాగానే ఉన్నా అందుకు తగిన బలమైన కథ, కథనాలు, పాత్రలు, ఆకట్టుకునే సన్నివేశాలను రాసుకోలేకపోయారామె. శ్రీచరణ్ పాకాల సంగీతం కూడా అంతంత మాత్రంగానే ఉంది.

ఎల్.కె.విజయ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ క్లియర్ గా అనిపించింది. శ్రీకర్ ప్రసాద్ పర్వాలేదు. రిపీటెడ్ గా అనిపించే కొన్ని సన్నివేశాలని తొలగించి ఉండాల్సింది. ఇకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

యంగ్ హీరో రాజ్ తరుణ్ నుండి వచ్చిన ఈ ‘రంగుల రాట్నం’ ఆశించిన స్థాయిలో లేదు. ఫస్టాఫ్లో కొన్ని సెంటిమెంట్ సీన్స్, సెకండాఫ్ ప్రేమికుల మధ్యన మనస్పర్థలు, క్లైమాక్స్, అక్కడక్కడా నవ్వించిన ప్రియదర్శి కామెడీ మినహా రొటీన్ కథ, కథనాలు, ముఖ్యమైన మథర్ సెంటిమెంట్, ప్రేమ అనే ఈ రెండింటిలోనూ ఏ ఒక్కటీ కూడా పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేకపోవడం, ప్రధాన పాత్ర మధ్యన కెమిస్ట్రీ లోపించడం నిరుత్సాహపరిచే అంశాలు. మొత్తం మీద కొంచెం కామెడీ, కొంచెం ఎమోషన్ ఉన్న ఈ చిత్రం నెమ్మదిగా సాగే, ఊహాజనితమైన ఫ్యామిలీ డ్రామాను ఇష్టడేవాళ్ళకు నచ్చవచ్చు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review