సమీక్ష : ఒంగోలు గిత్త – దమ్ము లేని గిత్త

సమీక్ష : ఒంగోలు గిత్త – దమ్ము లేని గిత్త

Published on Feb 2, 2013 3:45 AM IST
ongole_gitta2 విడుదల తేదీ : 1 ఫిబ్రవరి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకుడు : ‘బొమ్మరిల్లు’ భాస్కర్
నిర్మాత : బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్
సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్, మణిశర్మ
నటీనటులు : రామ్, కృతి కర్భంద, ప్రకాష్ రాజ్..

వరుసగా మూడు ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తన రూటు మార్చి మాస్ ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకోవాలని తీసిన సినిమా ‘ఒంగోలు గిత్త’. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా గుంటూరు మిర్చి యార్డు నేపధ్యంలో తీసిన ఈ సినిమాలో కృతి కర్భంద హీరోయిన్ గా నటించింది. బి.వి.ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి జి.వి ప్రకాష్ సంగీతం అందించగా మణిశర్మ ఓ పాటని, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో భాస్కర్ మాస్ ని ఎంత వరకూ ఆకట్టుకున్నాడో, సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

12 ఏళ్ళ వయసులో తిక్కలవారిపల్లె నుంచి పారిపోయి గుంటూరుకి చేరుకుంటాడు వైట్ అలియాస్ దొరబాబు(రామ్). మిర్చి యార్డ్ చైర్మెన్ అయిన ఆదికేశవులు (ప్రకాష్ రాజ్) వద్ద తన టాలెంట్ చూపించి, తనకి ఎవరూ లేరని చెప్పి మిర్చి యార్డ్ లో అడుగుపెడతాడు. అక్కడ ఉన్న పావురం(కిషోర్ దాస్)ని తన పార్టనర్ గా చేసుకొని మిర్చి యార్డ్ లో ఒక సొంత షాప్ స్టార్ట్ చేస్తాడు. మిర్చి యార్డ్ లో షాప్ స్టార్ట్ చేసినా మొదటినుంచి అతని కన్ను మిర్చి యార్డ్ చైర్మెన్ పదవి మీదే ఉంటుంది. అందులో భాగంగానే ఎమ్మెల్యే (ఆహుతి ప్రసాద్) తో చేతులు కలుపుతాడు. ఆ ప్లాన్ ఫెయిల్ అవడంతో ఆదికేశవులు కూతురు అయిన సంధ్యని ప్రేమలో దించాలని ప్రయత్నిస్తాడు.

ఇదిలా ఉండగా ప్రకాష్ రాజ్ కొంతమందితో కలిసి ఆ మార్కెట్ యార్డ్ ని అక్కడి నుంచి వేరే ప్లేస్ కి మార్చేయాలని చూస్తుంటాడు. ఇవన్నీ జరగకుండా వైట్ ఎలా ఆపాడు? అసలు ఇంతకీ వైట్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? నిజంగానే అతనికి ఎవరూ లేరా? ఎందుకు మిర్చి యార్డ్ చైర్మెన్ పదవిపై కన్నేశాడు అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో రామ్ పెర్ఫార్మన్స్, ‘చాల్ చాల్లే’ పాటలో డాన్స్ ఎంతో ఎనర్జీగా ఉన్నాయి. ఈ సినిమాలో తాగి హీరోయిన్ తో చేసే కామెడీ సన్నివేశాలు బాగా చేసాడు. కృతి కర్బంధ అమాయకురాలిగా, హీరో టార్చర్ బరించే పాత్రలో బాగా నటించిది, అలాగే పాటల్లో గ్లామర్ గా, చూడటానికి చాలా అందంగా ఉంది. రామ్ పార్టనర్ గా నటించిన కిషోర్ దాస్ కామెడీ బాగుంది. తిక్కలవారిపల్లెకి చెందిన కర్రి నీలకంఠం పాత్రలో రఘుబాబు కొద్దిసేపు నవ్వించాడు.

మంచి అని ముసుగు వేసుకొని విలన్ పాత్ర చేసిన ప్రకాష్ రాజ్ నటన ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్. ఈ మధ్య రొటీన్ పాత్రలు చేస్తున్న ప్రకాష్ రాజ్ ని ఈ సినిమాలో కొత్తగా చూడొచ్చు. సినిమాలో మొదటి 40 నిమిషాలు, అలాగే సెకండాఫ్ లో రామ్, అలీ, హీరోయిన్ ఫ్యామిలీ మధ్య జరిగే కామెడీ సన్నివేశాలు బాగుంటాయి.

మైనస్ పాయింట్స్ :

మొదటి రెండు సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకున్న బొమ్మరిల్లు భాస్కర్ ఆ తర్వాత తీసిన మూడవ సినిమాతో అందరినీ ఆకట్టుకోలేకపోయినా ఒక టైపు ఆడియన్స్ ని మాత్రం మెప్పించగలిగాడు. అలాగే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్, కామెడీ ఇలా పలు విభాగాల్లో మంచి పట్టు ఉందని నిరూపించుకున్న భాస్కర్ అలాంటి సినిమాలు బోర్ కొట్టాయని చెప్పి, తనకు కిక్ కావాలని రూటు మార్చిన భాస్కర్ మాస్ సినిమా తీయాలనుకొని డిసైడ్ అయ్యి తన గొయ్యి తానే తవ్వుకున్నాడు.

అలాగే భాస్కర్ రాసుకున్న కథలో కూడా పెద్దగా దమ్ము లేదు, ఇప్పటివరకూ ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. మన భాస్కర్ పాత చింతకాయ పచ్చడి లాంటి ఓ కథని తీసుకొని దానికి మిర్చి యార్డ్ అనే కొత్త నేపధ్యాన్ని చేర్చి సినిమా తీసేశాడు. గంతకు తగ్గ బొంతలా రొటీన్ కథకి తగ్గట్టుగానే స్క్రీన్ ప్లే కూడా గందరగోళంగా ఉంటుంది. భాస్కర్ కథానుసారంగానే ప్రకాష్ రాజ్ న్యూడ్ సీన్స్ పెట్టామని చెప్పుకొచ్చాడు. కానీ కథానుసారం అయితే ఆ సీన్స్ అవసరమే లేదు, ఒకవేళ భాస్కర్ ఏదైనా కాన్సెప్ట్ అనుకొని అలా సీన్స్ రాసుకున్నా దాన్ని కరెక్ట్ గా తెరపై చూపలేకపోయాడు. సెంటిమెంట్ బాగా పలికించే భాస్కర్ తండ్రీ – కొడుకుల మధ్య సెంటిమెంట్ ని కూడా సరిగ్గా తీయలేదు.

సినిమాలో విలనిజంకి చాలా ప్రాముఖ్యత ఉన్నప్పటికీ దాన్ని ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ భాస్కర్ పూర్తిగా విఫలమయ్యాడు. ఎలాంటి భూతు లేకుండా కామెడీ సీన్స్ రాసుకేనే భాస్కర్ స్టైల్ మార్చాం కదా అని చెప్పి డబుల్ మీనింగ్ డైలాగ్స్ రాసుకున్నాడు, అవి కూడా రమాప్రభ గారితో చేయించడమేంటో ఆయనకే తెలియాలి. అలాగే అభిమన్యు సింగ్, అజయ్, ప్రభు లాంటి పెద్ద నటులు ఉన్నప్పటికీ వారిని సరిగ్గా వాడుకోలేకపోవడమే కాకుండా అభిమన్యు సింగ్ ది విలన్ పాత్ర అని చెప్పుకోవడం కంటే తనదో జోకర్ పాత్ర అని చెప్పుకోవచ్చు.

సినిమా మొదలై 40 నిమిషాలు గడిచిన తర్వాత సినిమా రొటీన్ గా తయారవుతుంది. వచ్చిన సన్నివేశాలే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి దాంతో ఇంటర్వల్ ఎప్పుడు ఇస్తాడా లేచి వెళ్లి రిలాక్స్ అవుదాం అనుకుంటాడు. ఇక సెకండాఫ్ విషయానికొస్తే మధ్యలో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ తప్పితే మిగతా ఆకట్టుకునే సీన్స్ ఏమీ లేవు. సెకండాఫ్, క్లైమాక్స్ అంతా ముందుగానే ఆడియన్స్ కి తెలిసిపోతుంది. అలాగే సెకండాఫ్ లో పాటలు కూడా ఇరికించి నట్టుగా ఉంటాయి.

సాంకేతిక విభాగం :

భాస్కర్ కథ విషయంలోనే నెగటివ్ మార్కులు సంపాదించుకున్నాడు. మాస్ సినిమాలు తీయడం మొదటిసారి కావడంతో సినిమాని ఎలివేట్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. అలాగే టేకింగ్ లో అరవ పైత్యం కనపడుతుంది. రొటీన్ కథ అనుకున్నప్పుడు స్క్రీన్ ప్లేలో ట్విస్ట్ లు అయినా బాగుండాలి. ట్విస్ట్ లు ఆకట్టుకోకపోగా స్క్రీన్ ప్లే అన్నీకూరగాయలు కలగలిపిన చప్పిడి కిచిడీలా ఉంటుంది. వెంకటేష్ సినిమాటోగ్రఫీ క్లీన్ గా ఉంది. ఎడిటర్ ఫస్ట్ హాఫ్ మీద కాస్త శ్రద్ధ తీసుకొని కొన్ని సీన్స్ కత్తిరించి పారేయాల్సింది. జి.వి ప్రకాష్ కుమార్ పాటలు సినిమాకి పెద్దగా హెల్ప్ అవ్వలేదు, మణిశర్మ అందించిన ‘చాలు చాల్లే’ పాటకి మాస్ కి నచ్చుతుంది, అలాగే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తమిళ సినిమాలను తలపించేలా ఉంటుంది.

తీర్పు :

ఇప్పటి వరకూ సాఫ్ట్ లవ్ స్టోరీలు తీసి రొటీన్ గా అనిపించిదని చెప్పి కొత్తగా తీయాలని ప్రయత్నించి బొమ్మరిల్లు భాస్కర్ తన చేతుల్ని తానే కాల్చుకున్నాడు. మొత్తంగా ఒంగోలు గిత్త సినిమా సో సో గా సాగుతుంది. సినిమాలో రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, ప్రకాష్ రాజ్ నటన, కృతి కర్భండ అందం, కొన్ని కామెడీ సీన్స్ సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు. దమ్ము లేని కథ, గందరగోళంగా ఉండే స్క్రీన్ ప్లే, అంతంత మాత్రంగా ఉండే టేకింగ్ సినిమాకి మైనస్.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు