సమీక్ష : రేస్ – రేసులూ లేవు, కథలో స్పీడూ లేదు..

సమీక్ష : రేస్ – రేసులూ లేవు, కథలో స్పీడూ లేదు..

Published on Mar 2, 2013 2:05 PM IST
race విడుదల తేదీ : 01 మార్చి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
దర్శకుడు : రమేష్ రాపర్తి
నిర్మాత : అన్నే రవి
సంగీతం : వివేక్ సాగర్, సంజయ్
నటీనటులు : విక్రమ్, కార్తీక్, భరత్ కిషోర్, దిశా పాండే, నిఖితా నారాయణ్..

రవిబాబు డైరెక్ట్ చేసిన ‘మనసారా’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన విక్రమ్ హీరోగా, కార్తీక్, భరత్ కిషోర్, దిశా పాండే, నిఖితా నారాయణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘రేస్’. రమేష్ రాపర్తి డైరెక్ట్ చేసిన ఈ బ్యాచిలర్ థ్రిల్లర్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్నే రవి నిర్మించిన ఈ సినిమాకి వివేక్ సాగర్, సంజయ్ సంగీతం అందించాడు. ఇంతకీ ఈ ‘రేస్’ ఎవరెవరు ఆడారు? అసలు దేని కోసం రేస్ ఆడారు అనేది ఇప్పుడు చూద్దాం…

కథ :

చైతన్య(కార్తీక్) వీడికి డబ్బు పిచ్చి, సిద్దార్థ్(భరత్ కిషోర్) వీడికి అమ్మాయిల పిచ్చి, అభిరామ్(విక్రమ్) వీడికి సాటి వారికి హెల్ప్ చెయ్యడం ఇష్టం. ఇలా మూడు వేరు వేరు స్వభావాలు కలిగిన వీరు ముగ్గురూ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. చైతన్య అంజలితో(నిఖితా నారాయణ్) ప్రేమలో పడతాడు కానీ ఆమెకి డబ్బు లేదని డబ్బున్న అమ్మాయి నేహ అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయమవుతుంది. పెళ్ళికి ముందు బ్యాచిలర్ పార్టీ చేసుకోవాలని వీళ్ళు ముగ్గురూ కలిసి బ్యాంకాక్ వెళ్తారు. ఓ రోజు పార్టీ కెళ్ళి తిరిగి వస్తుండగా బ్యాంకాక్ ఫేమస్ డాన్ మైఖేల్ తమ్ముడు రాబర్ట్ ఓ యాక్సిడెంట్ కి గురవడంతో కథ ఓ మలుపుతిరుగుతుంది. ఆ తర్వాత ఆర్తి(దిశా పాండే) తెలుగమ్మాయిలా ఈ ముగ్గురి బ్యాచ్ లో వచ్చి చేరుతుంది. అభిరామ్ – ఆర్తి ప్రేమలో పడతారు. ఈ ముగ్గురి ట్రిప్ అయిపోయి ఇండియాకి బయలుదేరాల్సిన టైములో చైతన్య – అంజలి కిడ్నాప్ అవుతారు. అసలు చైతన్య – అంజలిని ఎందుకు కిడ్నాప్ చేసారు? అసలెవరు కిడ్నాప్ చేసారు? ఇంతకీ ఆ యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగింది? మధ్యలో వచ్చిన ఈ ఆర్తి ఎవరు? చివరికి చైతన్య – అంజలి కిడ్నాపర్స్ నుంచి ప్రాణాలతో బయట పడ్డారా? లేదా? అనేదే మిగిలిన కథాంశం.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ ని పక్కన పెట్టి కమేడియన్ శ్రీనివాస్ రెడ్డిని హీరోగా చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా మొత్తం మీద బెస్ట్ సీన్స్ అంటే డి.కె బోస్ పాత్రలో శ్రీనివాస్ రెడ్డి చేసిన సీన్స్ అనే చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ లో వీళ్ళంతా కలిసి ఓ రిసార్ట్ కి వెళ్ళిన ఎపిసోడ్, సెకండాఫ్ లో వచ్చే విలన్ కి – శ్రీనివాస్ రెడ్డి కి మధ్య జరిగే కామెడీ ఎపిసోడ్ బాగుంటుంది. అలాగే సినిమా మొదటి 15 నిమిషాలు ఫన్నీగా ఉంటుంది. విక్రమ్, కార్తీక్, భరత్ కిషోర్, నిఖితా నారాయణ్ ల నటన పరవాలేదనిపిస్తుంది. దిశా పాండే నటన ఎలా ఉన్నా అందాల ఆరబోతతో బాగానే ఆకట్టుకుంది. చాలా సన్నివేశాల్లో కామెడీ డైలాగ్స్ ముఖ్యంగా యంగ్ జెనరేషన్ మీద వేసే పంచ్ డైలాగ్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ ఎన్నని చెప్పను ఏమని చెప్పను ఒకటా రెండా చెప్పడానికి అయినా సరే కొన్ని మీకోసం… సినిమాకి మొదటి మైనస్ సినిమా టైటిల్ ‘రేస్’, సినిమా టైటిల్ కి కథకి సంబందమే ఉండదు. టైటిల్ చూసిన వారు ఇదేదో రేసులు గీసులు ఉండే సినిమా అనుకోని వెళితే మీరు పెద్ద ప్రమాదంలో పడ్డట్టే సినిమాలో రేసులు లేకపోగా ఇదేం సినిమారా బాబు దీనికంటే చిన్నపిల్లలకి చెప్పే కాకమ్మ కథలు ఇంకా ఆసక్తిగా ఉంటాయికదా అనిపిస్తుంది. రొటీన్ కథకి పరమ వీక్ స్క్రీన్ ప్లే తోడవడంతో సినిమా అంతా ఊహించుకోవచ్చు, అలాగే సినిమా క్లైమాక్స్ ఏంటి అనే విషయాలను ఇట్టే చెప్పేయొచ్చు. సినిమా మొదలైన ఒక 20 నిమిషాల తర్వాత కథ ముందుకు వెళ్ళదు ఒకే టైపు సీన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, అవి చాలా బోర్ కొడతాయి.

సినిమాలో వచ్చే ఒకే ఒక్క ట్విస్ట్ అంత ఆసక్తికరంగా లేదు. ఇక సినిమా చివరి 30 నిమిషాలు మేజర్ మైనస్ గా చెప్పుకోవాలి. మొదటి సినిమా ‘మనసారా’ లో చాలా కూల్ గా ఉండే పాత్రలో కనిపించిన విక్రమ్ ఈ సినిమాతో కూడా తనలో ఈజ్ ఉందని నిరూపించుకోలేక పోయాడు. ఇక డాన్సుల విషయంలో చిన్న చిన్న స్టెప్పులు వేయడానికి అతను పడ్డ కష్టం తెరపై వద్దన్నా తెలిసిపోతుంటుంది. సినిమాలో ఉన్న పాటలు అసలు అర్ధం కాకపోగా, చిరాకు తెప్పిస్తాయి.

బాంకాక్లో చైతన్యని కిడ్నాప్ చేస్తే వాడు ఎక్కడున్నాడో వెతకడానికి ఒక చిన్న వాచ్ ని పెట్టుకొని 24 గంటల్లో బ్యాంకాక్ మొత్తాన్ని తిరిగేలా చూపించడం మరీ విడ్డూరంగానూ, ఆడియన్స్ వామ్మో ఇలాంటి సీన్స్ కూడా తీయోచ్చా అనే ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటుంది. ఇక చివరి కొచ్చే సరికి గతంలో మన మహేష్ బాబు సినిమా ‘టక్కరిదొంగ’ సినిమా క్లైమాక్స్ లో లాగా విలన్ గ్యాంగ్లో డైమండ్స్ కోసం ఒకరినొకరు కాల్చేసుకొని సచ్చిపోవడం అలాగే విలన్ ని కోన ఊపిరితో ఉన్న తన సెక్రెటరీనే చంపడం లాంటి సీన్స్ ఆడియన్స్ ని థియేటర్ నుండి పరుగులు పెట్టించడానికే తీసినట్టు ఉంటుంది. డైరెక్టర్ విలన్ పాత్రలని డిజైన్ చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. సస్పెన్స్ అంటే విలన్ స్ట్రాంగ్ గా ఉండాలి కానీ ఇందులో విలన్ పాత్ర కామెడీ విలన్ కన్నా నీచంగా ఉంటుంది. ఇంతటితో ఈ మైన పాయింట్స్ ముగిసున్నా..

సాంకేతిక విభాగం :

మురళి మోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాంకాక్ లోని కొన్ని ప్రదేశాలను బాగా చూపించారు. శంకర్ రాసిన డైలాగ్స్ బాగున్నాయి. వివేక్ సాగర్, సంజయ్ అందినచిన సాంగ్స్ బాలేవు, అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని కామెడీ సీన్స్ లో తప్ప మిగతా ఎక్కాడా అంతగా అనిపించదు. ఎడిటర్ ముందు సినిమాలో పాటలని ఆ తర్వాత సినిమాలో ఉన్న చాలా వేస్ట్ సీన్స్ ని తీసేస్తే ఆడియన్స్ కి కాస్తైన మేలు చేసిన వాడవుతాడు.

కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇలా ఒక్క విభాగంలోనూ డైరెక్టర్ రమేష్ రాపర్తి విజయం సాధించలేకపోయాడు కానీ ఇలాంటి రొటీన్ కథని చెప్పి బ్యాంకాక్ లో తీయాలని నిర్మాత చేత బాగా డబ్బులు ఖర్చు పెట్టించడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. సినిమా మొదటి 15 నిమిషాలు తప్ప మిగతా అంతా బ్యాంకాక్ లోనే తీయడం వాళ్ళ నిర్మాణ విలువలు ఓకే అని చెప్పుకోవాలి. కానీ మన హైదరాబాద్లోనే తీసుంటే నిర్మాతకి కాస్త ఖర్చు అన్నా తగ్గేది.

తీర్పు :

ఈ ‘రేస్’ సినిమాలో అన్నీ రేసులే అనుకోని వెళితే మాత్రం నిరాశతో పాటు టైం, మనీ రెండూ వేస్ట్. ఈ సినిమాలో మొత్తంగా మూడు నాలుగు కామెడీ ఎపిసోడ్స్, కొన్ని పంచ్ డైలాగ్స్ తప్ప చెప్పుకోవడానికి, చూడటానికీ ఏమీ లేదు. నటీనటుల నటన అంతంత మాత్రంగా ఉండే ఈ సినిమా కథలో స్పీడు లేదు, స్క్రీన్ ప్లే పరమ రొటీన్, దానికి తగ్గా పరమ వీక్ డైరెక్షన్ సినిమాకి మేజర్ మైనస్ పాయింట్స్. కమేడియన్ శ్రీనివాస్ రెడ్డి ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే వారు థియేటర్ వరకూ వెళ్ళడం కంటే టీవీలో వచ్చే వరకూ ఎదురు చూడటం ఉత్తమం అని నా ఉద్దేశం.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

రాఘవ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు